ఢిల్లీ దేశ రాజధాని. దేశ పౌరులు రాజధానికి అనేక పనులపైన మరియు పైరవీలు చేసుకోవడం కోసం వెళుతుంటారు. మన వ్యవస్థలో ఇది సర్వసాధారణం.
ఢిల్లీకి రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక పర్యటనలు, రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోడీని మరియు హోం మంత్రి అమిత్ షాను కలుసుకొన్నంత తరచుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కడకు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహితం కలుసుకున్న దాఖలాలు లేవు.
కానీ, ఆంధ్రప్రదేశ్ కు ఒనగూడిన ప్రయోజనం ఏమైనా ఉన్నదా! అన్నదే ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పొందుపరచిన హక్కులతో సమానమైన కడప ఉక్కు కర్మాగారం, రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకం, ఓడరేవు, రైల్వే జోన్(ఆమోదం పొందిన విశాఖలో), రెవెన్యూ లోటు భర్తీ(ఓ నాలుగు వేల కోట్లు తప్ప), పోలవరం ప్రాజెక్టు డిపియర్ -2 కు ఆమోదం – నిధుల మంజూరు, పారిశ్రామికాభివృద్ధికి పన్నుల్లో రాయితీ, ఉమ్మడి ఆస్తుల పంపిణీ, వగైరా వగైరా ఒక్కటంటే ఒక్క హామీ (నిధుల లేమితో నడుస్తున్న విద్యా సంస్థలు మినహా) అమలుకు నోచుకోలేదు.
ప్రత్యేక తరగతి హోదా ముగిసిన ఆధ్యాయమని నిర్ద్వందంగా మోడీ ప్రభుత్వం తిరస్కరిస్తున్నది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆపేసింది. వీటికి తోడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందకు వంద శాతం అమ్మెస్తామని మోడీ ప్రభుత్వం తెగేసి చెబుతూనే ఉన్నది.
ఇహ! ముఖ్యమంత్రి పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి! ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన ప్రజల డబ్బు వృధానే కదా!

కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక