జగనన్న ఢిల్లీ వెళితే ఎందుకీ లొల్లి?

4

– ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, పోలవరం, విశాఖ స్టీల్‌ కోసం ఢిల్లీ వెళితే తప్పేంటి?
– జగనన్నకు మోదీ-షా అపాయింట్‌మెంట్లు ఇస్తే తప్పేంటి?
– నిధులిచ్చి ఆదుకుంటున్న కేంద్రానికి కృతజ్ఞతతో ఉండటం తప్పా?
-మోదీ-షాలకు జగన్‌ నచ్చితే దానిని తప్పు పడితే ఎలా?
– కేసీఆర్‌-జగన్‌కు ‘బీజేపీ బంధం’తో పోల్చడం తప్పు కదా?
– అవినాష్‌రెడ్డి అరెస్టు కాకపోతే, అది బీజేపీ ప్రభావం ఎలా అవుతుంది?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగనన్న ఢిల్లీ వెళ్లొచ్చారు. అది కూడా ఒక వార్తేనా? ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ వేశారు. షాజీతో ఓ 45 నిమిషాలు మంతనాలు జరిపారు. అయితే ఏంటట? వారి భేటీ వెనుక ఏదో బ్రహ్మరహస్యం ఉందని, అసలు పెద్ద పెద్ద మోతబరులకే అపాయింట్‌మెంట్లు ఇవ్వని మోదీషా సార్లు.. జగనన్న అడిగిన వెంటనే లోపలికి పిలిచి, జగనన్న ఇచ్చే శాలువ వేసుకుని, ఆయనిచ్చే వెంకటేశ్వరస్వామి విగ్రహాలు తీసుకుని, ఫొటోలకు ఫోజులిస్తున్నారన్నది వార్తల సారంశం. సో వాట్‌?

వారి కలయికలో కొత్తమీ లేదు. అది పాతబంధమే. నాలుగేళ్ల ముందు వైసీపీని.. ఎన్నికల వైతరణి దాటించేందుకు శ్రమదానం చేసిన పువ్వుపార్టీ ‘ఢిల్లీ బంధం’, ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. పక్కనే ఉన్న ‘తెలంగాణ చంద్రశేఖరుడు’ ఎన్నిసార్లు అడిగినా నయాపైసా సాయం చేయని కేంద్రం, జగనన్న సర్కారు కష్టాల్లో పడ్డప్పుడల్లా కాసులసాయం చేస్తూనే ఉంది. ఇటు జగనన్న సర్కారు కూడా.. పార్లమెంటులో కేంద్రం ఏ బిల్లు పెట్టినా, అడగకపోయినా మద్దతునిస్తూనే ఉంది.

ఇక సీబీఐ, ఈడీ, వివేకా కేసులంటారా? చట్టం తన పనిచేసుకుపోతుంది. అందులో బీజేపీ జోక్యం ఉండదు. అసలు వాటి అధిపతుల ఫోన్‌ నెంబర్లు కూడా బీజేపీ నేతల వద్ద ఉండవు. వారి నియామకాలు కూడా నిబంధనల ప్రకారమే జరుగుతాయి. జగనన్న అక్రమ ఆస్తుల కేసుకు ప్రతివారం హాజరు కాకపోయినా, తామేమీ అనుకోమని సీబీఐ కోర్టు చెప్పింది. దానితో జగనన్న సాధారణ మానవుల మాదిరిగా, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పని తప్పింది. అంతమాత్రాన ‘ఇది జగనన్న-ఢిల్లీ పెద్దల భేటీల మహత్య్మమని’ అనుకుంటే తప్పు కదా? కళ్లు పేలిపోవూ?!

ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని సీబీఐ స్వయంగా కోర్టుకు చెప్పింది. ‘సరే మీ ఇష్టం. మీ పనిలో మేం జోక్యం చేసుకోలేం’ అని కోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ సీబీఐలో మళ్లీ అవినాషన్న అరెస్టు ముచ్చటనే లేదు. ఈలోగా అవినాష్‌రెడ్డి అరెస్టు కోసం, గట్టి ప్రయత్నం చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను పైకోర్టు బదిలీ చేసింది. ‘అతను లేని కొత్త టీమును’ వేసుకోమని, సీబీఐకి పెద్ద కోర్టు సలహా ఇచ్చింది. ‘రాంసింగ్‌ పనోడు కాదు’ పొమ్మంది. హమ్మయ్య. వైసీపీ వారికీ కావలసింది అదే. రోగి-వైద్యుడి సామెత చందమన్నమాట. ఈ పరిణామాలను- జగనన్న,మోదీషా భేటీతో ముడిపెడితే ఎలా? తప్పు కదూ? అసలు కోర్టు తీర్పులకూ-బీజేపీకి ఏం సంబంధం? రాహుల్‌ అనర్హత కేసులో కూడా ఇదే చెబుతున్నా ఎవరూ నమ్మరేం?

అసలు బాబాయ్‌ను ‘గుండెపోటుతో వేసేసిన’ హంతకులను.. తేల్చమని అడిగిందే జగన్‌, ఆయన సోదరుడు అవినాష్‌రెడ్డి. అలాంటి వారు మోదీషా దగ్గరకెళ్లి, బాబాయ్‌ హంతకులను కాపాడమని జగన్‌ ఎలా అడుగుతారు? అలా వెళ్లి అడిగితే ఓకే అనడానికి, జగనన్న కలిసేది అల్లాటప్పా నాయకులను కాదు. ఆవులించకముందే పేగులు లెక్కపెట్టగల అఘటనాఘట సమర్ధులు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా.. పార్టీల పక్షపాతానికి అతీతంగా వ్యవహరించే మోదీ-అమిత్‌షా దగ్గరకు! అది మర్చిపోతే ఎలా?

పనిలో పనిగా ఏపీ రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేక.. ఉద్యోగులకు ఠంచనుగా జీతాలిచ్చే ఠికాణాలేని దుస్థితిలో జగనన్న, విత్తమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలవడంలో తప్పేమీ లేదు. పాపం అప్పటికీ నిర్మలమ్మ.. ఏపీ పట్ల నిర్మల హృదయంతో వ్యవహరిస్తున్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన హస్తినలో కాపురం పెట్టి, కాసుల కోసం అక్కడే బైఠాయించిన రోజులు లేకపోలేదు.

ఏపీ సర్కారు ‘విత్తవిషాదం’ చూసిన నిర్మలమ్మ, అడిగినప్పుడు కాదనకుండా చేతికిఎముక లేకుండా రాష్ర్టానికి నిధులిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పులు ఇస్తున్నారు. ఇప్పిస్తున్నారు. అందువల్ల జగనన్న సర్కారు, కేంద్రంలోని బీజేపీకి సాగిలపడిందంటే ఎలా? మరి కేసీఆర్‌ అడిగితే చేయని సాయం, జగనన్నకు ఎలా చేస్తున్నారని అడగవచ్చు. ఇది మరీ అన్యాయం!

ఏమో.. మోదీషాలకు, జగనన్న విధేయత నచ్చి ఉండవచ్చేమో? ముత్తు సినిమాలో రజనీకాంత్‌ను చూసినట్లు, వారిద్దరూ జగన్‌లో రజనీకాంత్‌ను చూసి ఉండవచ్చేమో? ‘మనవాడే’నన్న సానుభూతి కూడా, ఢిల్లీ పెద్దలిద్దరికీ ఉండవచ్చేమో? ముదురు చంద్రబాబు కంటే, లేత జగనన్నతోనే బెటరనుకున్నారేమో? అందువల్లే ఏపీకి ఎప్పుడు కావాలంటే నిధులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్‌ మెంట్లు ఇస్తున్నారేమో!? కొంచెం పాజిటివ్‌గా ఆలోచించాలి కదా?

ప్రభుత్వం-పార్టీగా.. కేంద్రంలో ఉన్న పార్టీలతో సవాలక్ష సంబంధాలుంటాయి. పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రులతో, లక్షాతొంభై సంబంధాలుంటాయి. అందులో రాజకీయ సంబంధాలుండవచ్చు. ‘అంతకుమించిన’ సంబంధాలూ ఉండవచ్చు. అవన్నీ ఇచ్చి పుచ్చుకునే లెక్కలు. అంటే ‘రిటర్న్‌ గిఫ్టులన్నమాట. అయినా అవన్నీ పైకి ప్రెస్‌కాన్ఫరెన్సు పెట్టి చెప్పేవి కాదు. అలాగని పూర్తిగా దాచుకునేవీ కావు. ఇవి మానవసంబంధాలకు మించిన రాజకీయ సంబంధాలు. వాటికి అర్ధాలు, పరమార్ధాలు, తాత్పర్యాలు అడగకూడదు. అర్ధం చేసుకోవాలంతే.

కాబట్టి.. సీబీఐ ఇంకా అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకపోవడం, ఏపీకి ఎప్పుడంటే అప్పుడు అప్పులు పుట్టడం, మోదీషాలు ఎప్పుడంటే జగనన్నకు అపాయింట్‌మెంట్లు ఇస్తుండటాన్ని విశాల దృక్పథంతో చూడాలే తప్ప, రాజకీయ కోణంలో దర్శించకూడదు. ఇలాంటివి బీజేపీకి అస్సలు నచ్చవు.

దేశం కోసం పుట్టి, మనసు-తనువు దేశహితం కోసమే పనిచేసే బీజేపీని అసలు ఆ కోణంలో చూడటమే తప్పున్నర తప్పు. బీజేపీ ఏ వ్యవస్థలపైనా ప్రభావితం చూపించదు. ఎవరిపైనా ఒత్తిళ్లు చేయదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంతే! సినిమాల్లో స్వాతిముత్యం కమల్‌హాసన్‌, రాజకీయాల్లో పువ్వుపార్టీ రెండూ ఒకటే!

ఇంతకూ జగనన్న ఢిల్లీకి వెళ్లేది రాష్ట్రహితం కోసమేనట. ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారు? పోలవరం ప్రాజెక్టుకు నిధులెప్పుడు ఇస్తారు? విశాఖ రైల్వే జోన్‌ కథ ఏమైంది? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాల్సిందేనని బల్లగుద్ది వాదించేందుకే జగనన్న తరచుగా ఢిల్లీకి వెళుతున్నారట. అయితే ఖర్మకొద్దీ.. జగనన్న ఢిల్లీకి వెళ్లే ముందో- ఆ తర్వాతనో, అవినాషన్న కేసులు కోర్టు ముందుకు వస్తున్నాయి. దానితో జనమంతా, పాపం జగనన్న- మోదీషాల నిజాయితీని శంకిస్తున్నారంతే!