– సమన్వయకర్త పదవిపై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల ఆగ్రహం
– ఉండవల్లి శ్రీదేవికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం
– దళిత ఎమ్మెల్యే పైనే సమన్వయ కర్తను నియమించాల్సిన అవసరం ఏముంది?
– సమన్వయకర్త ను నియమించేటప్పుడు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు
– తాడికొండ నియోజకవర్గానికి సమన్వయకర్త ఉంటే మేము పదవులకు రాజీనామా చేస్తాం
– వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బాలస్వామి
తాడికొండ నియోజకవర్గ వైసీపీ దళిత ఎమ్మెల్యే శ్రీదేవికి చెక్ పెట్టేందుకు నాయకత్వం, కొత్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ రూపంలో సృష్టించిన సమన్వయకర్త పదవిపై శ్రీదేవి అనుచరులు తిరుగుబాటు ప్రారంభించారు. తమకు తెలియకుండా ఆ పదవి ఎలా సృష్టించారంటూ మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రశ్నించారు. ఇది జగన్‌కు తెలియకుండా మధ్యలో కొందరు నాయకులే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమన్వయకర్త పదవిని ఉపసంహరించుకోకపోతే, సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు. శ్రీదేవి కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చని, అంతమాత్రాన ఒక దళితురాలు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికే సమన్వయకర్త పదవిని సృష్టిస్తారా? అని నిలదీశారు. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఇంకా ఏమన్నారంటే…
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బాలస్వామి ఏమన్నారంటే.. పార్టీ కోసం కష్టపడి పని చేశాం. జగన్ ఆదేశాలను పాటించి పని చేశాం. ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇస్తే గెలిపించాం. రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మనమే. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చుదళిత ఎమ్మెల్యే పైనే సమన్వయ కర్తను నియమించాల్సిన అవసరం ఏముంది.టిడిపిలో పనిచేసిన వారిని సమన్వయకర్తగా ఎలా నియమిస్తారు? సమన్వయకర్త నియామకాన్ని రద్దు చేయాలి.సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అనుకోవడం లేదు.పార్టీ పెద్దలు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షంచుకోవాలి.
వైసీపీ సర్పంచ్ భర్త నరసింహరావు ఏమన్నారంటే..రాజధాని ప్రాంతంలో గెలిచారు.శ్రీదేవి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండవచ్చు.వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తిరిగి పని చేస్తాం.సీఎం వెంటనే సమన్వయకర్త పదవిని రద్దు చేయాలి.
తుళ్ళూరు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొర్రా శివరామిరెడ్డి ఏమన్నారంటే.. తాడికొండ నియోజకవర్గానికి సమన్వయకర్త ఉంటే మేము పదవులకు రాజీనామా చేస్తాం.సమన్వయకర్త ను నియమించేటప్పుడు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు?మూడు రాజధానులు అంటే ఎవరం మాట్లాడలేదు.నియోజకవర్గంలో లోపం ఏంటి? ఎందుకు సమన్వయకర్తను నియమించాలి?ఉండవల్లికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం.