నెల్లూరులో మరో దళితుడికి జగన్ వేసిన ఉరి ఇది

– కావలిలో కరుణాకర్ ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డీ…ఇదిగో, నీ పాలనలో మరో దళితుడికి నువ్వేసిన ఇంకో ఉరి. ఒక ఘటన మరువక ముందే మరో దారుణం ఎపిలో సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది?…రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు?.. అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరగాలి.

నెల్లూరు జిల్లా, కావలి మండలం, ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. తాను లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనివ్వకుండా, వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డిలు వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖలో తెలిపారు.

శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా కూడా ఉన్న జగదీష్ రెడ్డి ఆగడాలకు జగన్ రెడ్డి ముందుగానే అడ్డుకట్ట వేసివుంటే , ఇప్పుడు ఈ దళిత సోదరుని ప్రాణాలు పోయేవి కావు. భూదందాలు, సెటిల్మెంట్లను దాటిన ధనదాహం…ఇప్పుడు వ్యక్తుల ప్రాణాలను కూడా మింగేస్తోంది.

సమాజ శత్రువులుగా మారిన వైసీపీ రాక్షసులను కట్టడి చెయ్యడంలో ఆ పార్టీ ఎప్పుడూ ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. నేడు ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి, ఒక కుటుంబం రోడ్డున పడడానికి కారణమైన వారిపై కనీసం ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి.

ఇప్పుడు కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మానవత్వం మరిచి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే అంతకంటే నీచం మరొకటి ఉండదు. కొందరు పోలీసులు తమ మనసుల మురికిని ఖాకీ దుస్తులకూ అంటిస్తున్నారు. జరిగినదానికి జగన్ రెడ్డి బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.