వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ లక్ష్యం. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ ను పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అనుచరులకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు వేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగుంటుందని భావించి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్ధం చేసుకొని మళ్లీ తిరిగి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది. వంశీకృష్ణ ప్రజా రాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరఫున నాతోపాటు రాజకీయ ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావడం సొంత ఇంటిలోకి రావడం లాంటిది. యువరాజ్యంలో కీలకంగా పని చేసిన ఎందరో నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకులుగా ఎదిగారు.
వంశీకృష్ణ ని కూడా కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా చూడటం లేదు. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలి. వంశీకృష్ణ పార్టీలోకి వస్తున్న సమయంలో ఆయన వైసీపీ మీద ఎలాంటి ఇతర వ్యాఖ్యలు చేయకుండానే, జనసేన పార్టీ భావజాలం నచ్చడంతోనే పార్టీలోకి వస్తున్నట్లు చెప్పడం నన్ను ఆకట్టుకుంది. ఏ నమ్మకంతో జనసేనలోకి వంశీకృష్ణ వచ్చారో అలాంటి ప్రాధాన్యం ఆయనకు కచ్చితంగా దక్కుతుంది. ఆయనకు అండగా నిలబడతాను. జనసేన పార్టీ ఉన్నతి కోసం, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ మనస్ఫూర్తిగా పనిచేస్తారని భావిస్తున్నానన్నారు.
వంశీకృష్ణ రాక మొదటి అడుగే : పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వంశీకృష్ణ యాదవ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. విశాఖపట్నం నగరంలో వైసీపీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. విశాఖ నగర అధ్యక్షులుగా కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందించారు. ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ కాదు. స్థానిక సంస్థల్లో గెలిచి ఎన్నికైన వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి రావడం చాలా ఆనందం కలిగిస్తోంది. ఆయన్ను పార్టీలోకి పవన్ కళ్యాణ్ తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
వైసీపీలోని అంతర్గత రాజకీయాల వల్ల ప్రజా సమస్యలను తీర్చలేకపోతున్నామని, కనీసం మాట్లాడలేకపోతున్నామని, అదే జనసేనలోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చనే భావనతోనే పార్టీలోకి వస్తున్నానని ఆయన చెప్పారు. ఆయనతోపాటు చాలా మంది జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రావడం మొదటి అడుగు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, విశాఖను మహానగరంగా తీర్చిదిద్ది, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కలిసి పనిచేద్దామని వంశీకృష్ణ కి పవన్ కళ్యాణ్ చెప్పారని వెల్లడించారు.
జనసేన ఉన్నతి కోసం కష్టపడతా : వంశీకృష్ణ యాదవ్
పార్టీలో చేరిన వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా వైసీపీ మొదలు కాకముందు నుంచి నేను రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాను. వైసీపీలోకి వెళ్లిన తరువాత ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డాను. నాకు జరిగిన విషయాలు చాలా మందికి తెలుసు. వైసీపీలో పూర్తిస్థాయిలో పని చేసిన తరువాత ఇప్పుడు జనసేనలోకి రావడం నా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. పవన్ కళ్యాణ్ తో ఉన్న పరిచయం, ఆయన ఆలోచన తీరు నాకు ఎప్పుడూ నచ్చుతాయి. కచ్చితంగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఉన్నతి కోసం పని చేస్తాను. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడటం కోసం మనస్ఫూర్తిగా పని చేస్తానన్నారు.