జగన్ కు రేవంత్ ‘రిటర్న్ గిఫ్ట్’

– రేవంత్ సర్కారు కూలిపోతుందన్న విజయసాయిరెడ్డి
– గత ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాన్నే అమలు చేయనున్న రేవంత్?
-తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యాపారాలపై ఇప్పటికే నివేదికలు
– వైసీపీ ఎమ్మెల్యే-ఎంపీలపై ఉన్న పోలీసు కేసులపై ఆరా?
– తెలంగాణలో రియల్ ఎస్టేట్, వివాదాస్పద భూములు కొన్న వైసీపీ ఎమ్మెల్యేలు
– గతంలో టీడీపీ నేతలపై కేసీఆర్ సర్కారు ఇలాంటి బెదిరింపులు?
– వారికి నోటీసులు ఇస్తామని హెచ్చరికలు
– ఆ భయంతో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది వెనుకంజ
– తెలంగాణ సరిహద్దుల వద్ద వైసీపీ ఎమ్మెల్యేలకు నాటి మంత్రుల నిధుల పంపిణీ
– ఇప్పుడు వైసీపీ నేతలకూ అలాంటి బెదిరింపుల భయం
– తెలంగాణ సాగునీటి కాంట్రాక్టర్లలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు
– గతంలో బీఆర్‌ఎస్‌కు నిధులిచ్చిన ‘మెగా’ కంపెనీలు
– ఇప్పుడు వాటికి బిల్లులు ఆపేసిన రేవంత్ సర్కారు
– తెలంగాణలో వైసీపీ నేతల వ్యాపారాలపై నిఘా?
– వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రేవంత్ వ్యూహం ‘సిద్ధం’
– ఇప్పటికే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో విపక్షాలపై వైసీపీ అధినేత-సీఎం జగన్ చేసే యుద్ధానికి ‘సిద్ధం’ అని పేరు పెట్టారు. కానీ గతంలో కేసీఆర్ సర్కారు దన్నుతో తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు చేసుకుని.. కోట్లు గడిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే-ఎంపీల ఆస్తులపై, సీఎం రేవంత్‌రెడ్డి రంగస్థలం సిద్ధం చేశారు. అంటే గత ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు, కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరించారో.. రేపటి ఎన్నికల కోసం జగన్‌కు రిటన్ గిఫ్ట్ ఇచ్చేందుకు, రేవంత్ అలాంటి వ్యూహమే సిద్ధం చేస్తున్నారన్న మాట.

ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరిపోసేందుకు, వైఎస్ బిడ్డ షర్మిలకు పగ్గాలు అప్పగించిన కాంగ్రె స్ నాయకత్వం.. జగన్ ఓడించడమే ఏకైక లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా, వైసీపీ నేతల ఆస్తుల మూలాలు ఉన్న తెలంగాణపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబునాయుడును ఓడించి, తన మిత్రుడైన జగన్‌ను గద్దెనెక్కించేందుకు కేసీఆర్ సహకరించారు. ఆమేరకు చంద్రబాబుకు రిటన్‌గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలోనే ప్రకటించారు కూడా.

ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల భూములున్న టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే నేతలు, వివాదాస్పద భూములు కొన్న టీడీపీ ప్రముఖులను.. నాటి కేసీఆర్ సర్కారు భయపెట్టిందన్న వార్తలు, అప్పట్లోనే చర్చనీయాంశమయ్యాయి. అంటే వారి భూములకు రెవిన్యూ శాఖ నుంచి నోటీసులిప్పంచటం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించడం, కోర్టులో కేసులు వేయటం వంటివన్నమాట. దానితో భయపడిన చాలామంది నేతలు, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీలోకి జంపయేందుకు కూడా, కేసీఆర్ అనుసరించిన ఇలాంటి వ్యూహమే కారణమన్న ప్రచారం జరిగింది.

ఎన్నికల ముందు తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు.. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మహబూబ్‌నగర్- నల్లగొండలో తిష్టవేసి, వైసీపీ అభ్యర్ధులకు నిధులు పంపిణీ చేశారన్న ప్రచారం జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎల్బీనగర్‌కు చెందిన ఓ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి, నిధులు పంపిణీచేశారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇక టీడీపీకి హైదరాబాద్ నుంచి నయాపైసా నిధులు అందకుండా, కేసీఆర్ సర్కారు సరిహద్దులను కట్టుదిట్టం చేసింది. ఫలితంగా టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌ను బతికించేందుకు తెలంగాణ సీఎం-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా, సరిగ్గా అదే వ్యూహం అమలుచేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు వైసీపీకి నిధులు అందే మార్గాలను, మూసివేసే ప్రణాళిక మొదలయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కాంట్రాక్టర్లు దక్కాయి. వివిధ ప్యాకేజీల్లో వారికి జగన్ సిఫార్సు మేరకు కాంట్రాక్టులు లభించాయి.

అందులో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక ‘మెగా’ కంపెనీ కూడా ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా పాలకులను పట్టేయడంలో నిష్ణాతుడన్న ఆ కంపెనీ అధినేత.. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పారు. చిరంజీవికి కేంద్రమంత్రి హోదాలో ఢిల్లీలో కేటాయించిన బంగ్లాకు, సదరు మెగా కాంట్రాక్టరే కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించారట. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో బోలెడు టూరిజం ప్రాజెక్టులు తీసుకుని, వందల కోట్లు గడించారన్న ప్రచారం తెలిసిందే. సదరు కంపెనీ గత అసెంబ్లీ ఎన్నికలతోపాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా, భారీ నిధులు సమకూర్చిందన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం సహా తెలంగాణలోని భారీ ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీకే కట్టబెట్టారు.

దానిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ, హోంమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి జగన్-కేసీఆర్ అనుకూల కాంట్రాక్టర్లకు, బిల్లులు నిలిపివే యాలని రేవంత్ సర్కారు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. వీటిలో ఏపీకి చెంది వైసీపీ మంత్రులు-ఎమ్మెల్యే కంపెనీల బిల్లులు కూడా ఉండటం గమనార్హం.

కాగా ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రధానంగా రాయలసీమకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తెలంగాణ సాగునీటి సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అవి కాకుండా సీమకు చెందిన వైసీపీ నేతలకు హైదరాబాద్‌లో పబ్, బార్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఏపీలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.

రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే, అందులో నిబంధనలకు విరుద్దంగా నడిచే వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. ఆ క్రమంలో స్థానిక రైతుల నుంచి, చాలాకాలం క్రితమే రెవిన్యూ-పోలీసులకు ఫిర్యాదులు నమోదయి ఉంటాయి. అంటే రైతులకు పూర్తి నగదు చెల్లించకుండానే, భూములకు లేవుట్లు వేసి వెంచర్ల పేరిట అమ్మకాలు సాగించడం వంటివన్నమాట.

ఇప్పుడు వైసీపీ నేతల కంపెనీలపై అలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయి? ఎన్ని ఫిర్యాదుల రూపంలో ఉన్నాయి? ఎన్ని విచారణ దశలో ఉన్నాయి? ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలో ఎన్ని కేసులు నమోదయ్యాయని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్-రంగారెడ్డి-మెదక్ జిల్లాల రిజిస్ట్రార్ల నుంచి, భూములు-భవనాలు-ఆస్తుల కొనుగోలు సమాచారం తెప్పించుకుంట్నునట్లు తెలుస్తోంది.

కాగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఎక్కువ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్ వంటి పోలీసుస్టేషన్లలో పలువురు వైసీపీ నేతలపై ఎక్కువ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని.. వైసీపీ ఎంపి, జగన్ ఆత్మ విజయసాయిరెడ్డి జోస్యంపై, రేవంత్ సర్కారు అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ నేతలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఏపీ సీఎం జగన్, ఆయనను కలవకపోవడం చర్చనీయాంశమయింది. కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన జగన్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మాత్రం కలవకుండా వెళ్లడం తెలిసిందే.

కాగా రేవంత్‌రెడ్డి సీఎం కాకుండా అడ్డుకునేందుకు, కాంగ్రెస్‌లోని తన సన్నిహిత వర్గాల ద్వారా.. జగన్ తీవ్రమైన ప్రయత్నాలు చేశారన్న ప్రచారం, రెండు నెలల క్రితం వరకూ కాంగ్రెస్ వర్గాల్లో వినిపించింది. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కారు త్వరలో కూలిపోతుందని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

Leave a Reply