Suryaa.co.in

Editorial

రాబందులకెందుకు… రైతుబంధు?

– బడా పారిశ్రామికవేత్తలు, నేతలు, బిల్డర్లకూ పెట్టుబడి సాయం ఎందుకు?
– వేలు, లక్షల జీతగాళ్లకూ రైతుబంధు ఇస్తారా?
– వందల కోట్లు ఖర్చు పెట్టే నేతలకూ రైతుబంధు ఇవ్వాలా?
– ఆదాయపన్ను చెల్లించే బడా రైతులకెందుకు పెట్టుబడి సాయం?
– 50 ఎకరాలున్న వారికీ రైతుబంధు ఇవ్వడం సమంజసమా?
– ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్న పాలకులు
-పన్ను చెల్లింపుదారులను లూటీ చేస్తున్న సర్కారు
– కష్టం కౌలు రైతులది.. కాసులు బడా రైతులకా?
– పేదరైతులకు పెట్టుబడి సాయం అందిస్తేనే ఫలితం
– రైతుబంధుపై పరిమితులు విధించేందుకు భయమెందుకు?
– 5-10 ఎకరాల రైతులకే రైతుబంధు ఇవ్వడం సమంజసం
– రైతుబంధు పరిమితులపై చర్చకు భయపడుతున్న సర్కార్
– అభిప్రాయసేకరణకు అవకాశం ఇవ్వని పాలకులు
– ఉమ్మడి రాష్ట్రంలో మద్యనిషేధంపై చర్చ పెట్టి నిర్ణయం తీసుకోలేదా?
– రైతుబంధు పరిమితులపై మేధావులు, విద్యావంతులు, రైతుసంఘాలతో చర్చ పెట్టరా?
– ఇంతకూ రైతుబంధు పేద రైతులకా? ధనిక రైతులకా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎంత చేసినా తక్కువే. ఎంతిచ్చినా తక్కువే. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకష్టం వర్ణనాతీతం. ప్రకృతి కరుణిస్తేనే రైతుకు సుఖం. ప్రకృతి సకాలంలో సహకరించకపోతే, పురుగుల అన్నమే పెరుగన్నమవుతుంది. ఎంత కష్టపడినా రైతు సంపాదన గోరంతే. కానీ కష్టాలు కొండంత! ఇక కౌలు రైతు కష్టం హిమాలయమంత!! సర్కారు ఏ పథకం పెట్టినా దానిని అనుభవించేది భూస్వాములే తప్ప కౌలురైతు కాదు. భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే కౌలురైతు తన భూమిమీదే నిలబడ్డ ఓ అనాధ. రాష్ట్రాలు ఏవైనా.. ప్రాంతాలు ఏమైనా ఇదీ.. రైతన్న విషాద జీవిత ప్రస్థానం.

మరి అలాంటి రైతుకు పెట్టుబడి సాయం ఇస్తే తప్పేంటి? కచ్చితంగా ఇవ్వాల్సిందే! కానీ… ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచే ఎంపీలు.. 50 కోట్లు ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు.. వందలకోట్లున్న పారిశ్రామికవేత్తలు.. లక్షలు జీతం తీసుకునే అధికారులు… భూమి అమ్ముకుని కోట్లు సంపాదించే రియల్టర్లకు పెట్టుబడి సాయం చేస్తే ఎలా ఉంటుంది? పన్నుల రూపంలో పాలకులు, ముక్కుపిండి వసూలుచేసే ధనాన్ని.. పప్పు బెల్లాల మాదిరిగా బలిసిన వారికి ధారాదత్తం చేస్తే ఎలా ఉంటుంది? అది అచ్చం రైతుబంధులా ఉంటుంది!

ఆదాయపన్ను చెల్లించే వారికీ పెట్టుబడి సాయం కింద కోట్లాదిరూపాయలు పుణ్యానికి దానం చేసే ఎలా ఉంటుంది? కడుపు రగిలిపోదూ? చిన్న-సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం కావలసిన, సర్కారు పెట్టుబడి సాయం.. సీఎం నుంచి మంత్రులు, ధనవంతులూ అప్పనంగా తీసుకుంటే, పన్నులు చెల్లించే వారి గుండె మండదూ? ఇప్పుడు తెలంగాణలో రైతుబంధు పేరుతో సర్కారు చేస్తున్న పెట్టుబడి సాయం కూడా అంతేనన్నది రైతు సంఘాలు-సామాన్యుల వాదన.

రైతుకు ఏడాదికి రెండు పంటల పెట్టుబడి సాయం కింద నాటి సీఎం కేసీఆర్ .. 10 వేల రూపాయల నగదును ఇస్తామని, 2018 ఫిబ్రవరి 25న రైతు సమన్వయసమితి సదస్సులో ప్రకటించారు. చెప్పినట్లుగానే అదే ఏడాది మే 10న కరీంనగర్‌లో ప్రారంభించారు. ఒక రైతుకు 49 వేల కంటే ఎక్కువ బకాయి ఉన్నంత పొలం ఉంటే, మిగిలిన మొత్తాన్ని రెండో చెక్కు వస్తుంది. దీనికోసం 2018-19 బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

తెలంగాణలో మొత్తం వ్యవసాయభూమి 1.43 కోట్ల ఎకరాలు. రైతుల సంఖ్య 58.33 లక్షలమంది. వరి, సోయాబీన్, బటానీ, పత్తి, మిరియాలు, భాస్వరం, మొక్కజొన్న, చెరకుగడ పండించే రైతులకు, రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ప్రతి పంట సీజన్‌లో 5 వేలు ఇస్తున్నారు. అంటే రెండు సీజన్లలో మొత్తం 10 వేల రూపాయలు, రైతుల ఖాతాలో జమ అవుతున్నాయన్నమాట. మొత్తం 31 జిల్లాల్లో 1.43 కోట్ల ఎకరాలకు ఈ పధకం వర్తింపచేశారు. 2023 జూన్ 26న 11వ విడత పెట్టుబడి సాయం కింద 7,624 కోట్లు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ కారణంతో విడుదల చేయాల్సిన నిధులను నిలిపి వేసింది. ప్రభుత్వం ఇప్పటివరకూ 11 విడతల్లో ఈ పథకం కింద 72,910 కోట్లు ఖర్చు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కాగా తెలంగాణలో వ్యవసాయభూముల వివరాలు పరిశీలిస్తే రైతుబంధు పథకం అర్హులకు అందుతోందా? అనర్హులకు అందుతోందా? సంక్షేమం పేరుతో దుబారా జరుగుతోందా? పన్ను చెల్లింపుదారుల జేబు దోపిడీ చేసి, బలిసిన వారికి దోచిపెడుతున్నా? అన్న ఆలోచన-అనుమానం రావడం సహజం.

– ఒక ఎకరం లోపున్న రైతులు 18 లక్షల మంది.
– 1 నుంచి 2 ఎకరాల లోపున్న రైతులు 24 లక్షలమంది.
– 3 నుంచి 5 ఎకరాలలోపు ఉన్న రైతులు 11 లక్షలమంది.
– 5-10 ఎకరాలున్న రైతులు 44 లక్షలమంది.
– 10 ఎకరాలున్న రైతులు 94 వేల మంది అన్నమాట.
– 50 ఎకరాలున్న రైతులు 298 మంది.
– 10 ఎకరాలున్న రైతులు 94 వేల మంది
– 25 ఎకరాలకంటే ఎక్కువ ఉన్న రైతులు 6,488 మంది
– రైతుబంధు పంటల పెట్టుబడి సాయం కింద లబ్దిపొందిన జిల్లాల్లో నల్లగొండ ప్రథమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లాలో 4,32,059 మంది రైతులు, ఈ పథకం కింద లబ్ధిపొందారు. సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇదీ కేసీఆర్ సర్కారు అమలు చేసిన రైతుబంధు కథ!

ఇప్పటివరకూ రైతుబంధు కింద సర్కారు అంచనా ప్రకారం.. 20 కంటే ఎక్కువ ఎకరాలున్న రైతుకు, 319 కోట్లు చెల్లించిందని స్పష్టమయింది. రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఖాయిలాపడి, సాగులో లేని భూములకూ, రైతుబంధు 13 కోట్లు 30 వేలరూపాయలు చెల్లించింది. ఇలాంటి వారికి సైతం పెట్టుబడి సాయం చేయడం న్యాయమా? అన్యాయమా? దుబారానా? పన్నుచెల్లింపుదారులపై భారమా? అన్నది సమీక్షించుకోవాల్సిన అంశం.

కేవలం 5 నుంచి 10 ఎకరాలున్న వారికే రైతుబంధు ఇవ్వాలన్నది మేధావులు-విద్యావంతులు-రైతుసంఘాల సూచన. 10 ఎకరాల పైనున్న వారు పేదరైతులు ఎలా అవుతారన్నది ప్రశ్న. నగరాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, ఖరీదైన కార్లు, కంపెనీలు, పరిశ్రమలున్న వారికి రైతుంబంధు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం?

నిజానికి అసలు వీరెవరూ సొంతంగా వ్యవసాయం చేయడం లేదు. కౌలురైతులే చేస్తున్నారన్నది, మనం మనుషులం అన్నంత నిజం. ఇప్పటికే ఈ పథకం కింద ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఉన్నతాధికారుల వరకూ లబ్థిపొందుతున్నారు. అసలు ఆదాయపన్ను చెల్లించేవారికి కూడా, రైతుబంధు వర్తింపచేయడం అసమంజసమన్నది రైతుసంఘాల వాదన.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కో రైతుకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తానని, ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అంటే కేసీఆర్ సర్కారు ఇచ్చిన 10 వేల రూపాయలకు, మరో 5వేల రూపాయలు అదనం! 2018-19లో ఈ పథకం కింద నాటి ప్రభుత్వం 12 వేల కోట్లు కేటాయించింది. నిజానికి కోటిన్నర ఎకరాలున్న తెలంగాణలో రైతుబంధు కింద.. 22,500 కోట్లు కేటాయించాల్సిన ఉంది.

అంటే రేవంత్ కొత్త హామీ ప్రకారం.. మరో 750 కోట్ల రూపాయలు దానికి అదనంగా కేటాయించాల్సిన అనివార్య పరిస్థితి. ఖాజానాను కేసీఆర్ సర్కారు ఇనుప చీపురుతో ఊడ్చిపారేసిన నేపథ్యంలో, ఖాళీగా ఉన్న బొక్కసాన్ని నింపడమే కష్టంగా మారింది. దానిని పూడ్చుకునేందుకు తాజాగా ట్రాఫిక్ చలానా రాయితీలు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి రాయితీలు, ఇంకా చాలా చూడబోతున్నామనడంలో ఎలాంటి సందేహం. లేకపోతే ఖజానా బండి నడపటం కష్టం. ఇవికాక ఉద్యోగులకు జీతాలు, తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపు, కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు సమకూర్చాల్సిన అనివార్య పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఒక్కోరైతుకు అదనంగా ఇస్తామన్న 5వేల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? దానికి సంబంధించి 750 కోట్ల రూపాయల అదనపు నిధులు, రైతుబంధుకు ఏవిధంగా సమకూరుస్తారన్నది ప్రశ్న. ప్రజాధనానికి పాలకులు ధర్మకర్తలు మాత్రమే. పొదుపు పాటించకుండా-అవసరమైన సంక్షేమం మాత్రమే కాకుండా.. ఓట్ల కోసం.. కీర్తి కోసం అమలుచేసే పథకాలు, ఖజానాపై ఎప్పుడూ పెనుభారమే అవుతాయి. అందుకు కేసీఆర్ సర్కారు ఖాళీ చేసిన ఖజానా నిలువెత్తు నిదర్శనం.

రైతుబంధు రెండోవిడతను ఫలితాల తర్వాత, పాత పద్ధతిలోనే లాగించేసిన రేవంత్ సర్కారుకు, మరో విడత అమలు ముళ్లబాటనే. ఈ సమస్యకు 5-10 ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతుబంధు అమలు చేయడమే ఏకైక పరిష్కారమన్నది రైతుసంఘాలు-మేధావుల సూచన. ఆ ప్రకారం చూసినా 9లక్షల 40 వేల ఎకరాలకు.. 94 వేల మంది పేద-మధ్య తరగతి రైతులు లబ్థిపొందుతారు.

అందుకు భిన్నంగా 50 ఎకరాలున్న… 298 మందికి కూడా రైతుబంధు వర్తింపచేయడమంటే, ప్రజాధనాన్ని ధనికులకు అప్పనంగా దోచిపెట్టడమే లెక్క. పన్నులు చెల్లించే ప్రజలకు, 50 ఎకరాలున్న బడారైతులను మేపడం అవసరమా? అని పన్ను చెల్లింపుదారులు సంధిస్తున్న ప్రశ్న. జవాబు చెప్పే ధైర్యం పాలకులకు ఉందా?

అసలు పరిమితులు-నియంత్రణ-ప్రాతిపదిక లేని రైతుబంధుపై… బహిరంగచర్చ-పథకం పరిమితులపై అభిప్రాయసేకరణకు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నది ప్రశ్న. లక్షల్లో ఆదాయపన్ను చెల్లించే వారికి.. వందలకోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఆర్ధికస్తోమత ఉన్న రాజకీయ నాయకులకు.. వేలు-లక్షలు జీతంగా తీసుకునే ప్రభుత్వోద్యోగులకు సైతం, రైతుబంధు ఇవ్వడమంటే.. పన్నుచెల్లింపుదారులను లూటీ చేయడమేనన్నది, మెజారిటీ ప్రజల అభిప్రాయం.

ఉమ్మడి రాష్ట్రంలో మద్యపాన నిషేదం కొనసాగించాలా? తొలగించాలా? అన్న అంశంపై అప్పటి సీఎం చంద్రబాబునాయుడు సర్కారు, బహిరంగ చర్చ నిర్వహించింది. వివిధ వర్గాలతో అభిప్రాయసేకరణ చేశారు. చివరకు ఆర్ధికవేత్తలు, జర్నలిస్టులు, లాయర్లు, ప్రజాసంఘాలతో బహిరంగచర్చలు నిర్వహించి..మెజారిటీ వర్గాల అభిప్రాయం ప్రకారం, మద్యనిషేధం తొలగించాలని నిర్ణయించారు.

ఇప్పుడు అనర్హులే ఎక్కువమంది ఉన్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న రైతుబంధు పైనా.. అలాంటి చర్చ నిర్వహించేందుకు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ఎందుకు వెనుకడుగు వేస్తోందన్నది ప్రశ్న. బహిరంగచర్చ.. అభిప్రాయసేకరణ ద్వారా.. అసలైన-అర్హులైన రైతుల లెక్క తేల్చే అవకాశాన్ని, కాంగ్రెస్ సర్కారు ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదెందుకన్నది ప్రశ్న.

LEAVE A RESPONSE