Suryaa.co.in

Editorial

మాయ్య.. పెళ్లికి పోలేదా?

– మేనల్లుడి పెళ్లికి వెళ్లని జగన్
– ఎంగేజ్‌మెంట్‌కు హాజరుతోనే సరి
– రాష్ట్రంలో అందరికీ మేనమామ అని చెప్పిన జగన్
– అసలు మేనల్లుడి పెళ్లికి మాత్రం డుమ్మా
– పెళ్లికి గైర్హాజరుపై సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
– ‘స్వామీ నదికిపోలేదా’ స్థానంలో ‘మాయ్య పెళ్లికిపోలేదా?’ డైలాగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన రాష్ట్రంలోని కొన్ని కోట్ల మంది చెల్లెమ్మలకు అన్న కాని అన్నయ్య. మరెన్నో లక్షలమంది మేనళ్లలకు మామయ్య కాని మేనమామ. మరి అసలు మేనల్లుడి పెళ్లికి ఆ మేనమామ హడావిడి ఏ రేంజ్‌లో ఉండాలి? ‘ముద్దుల మామయ్య’ సినిమాలో బాలకృష్ణ రేంజ్‌లో, మేనల్లుడి పెళ్లికి ఆ మేనమామ హడావిడి ఉండొద్దూ?

‘‘మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
కమ్మగా పాడనా చంటిపాప గోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
రెప్పగా నిను కాచనా.. పాపగా నిను చూడనా
ఇది అరుదైన ఒక అన్న కథ
ఇది మురిపాల ఒక చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నన్ను కన్న తల్లి’’
అంటూ చెల్లి-బావ-మేనల్లుడిని ఆలింగనం చేసుకుని, గ్రూప్ ఫొటోలో స్మైల్ ఇస్తూ సాంగేసుకోవద్దూ?!

మరి మాయ్య ఏంటి?… ముద్దుల మేనల్లుడి పెళ్లికే పోలేదూ? ముద్దుల ‘పాప’ కొడుకు పెళ్లికి, డుమ్మా కొట్టేశారేంటీ? రాజస్థాన్ వెళ్లాల్సిన మేనమామ, అనంతపురం వెళ్లారెందుకు? రాష్ట్రంలోని లక్షలాదిమంది మేనల్లుళ్లకు ఈ సంగతి తెలిస్తే, మాయ్య పరువేమవుతుంది?.. ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ.

‘స్వామీ నదికిపోలేదా?’.. ఇది పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేదీ’ సినిమాలో డైలాగ్. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో దారి మారి, ‘మాయ్య… పెళ్లికి పోలేదా?’ అని టర్నింగిచ్చుకుంటోంది. కారణం.. ఏపీ సీఎం జగన్ తన మేనల్లుడు-చెల్లి షర్మిల కొడుకయిన రాజారెడ్డి పెళ్లికి డుమ్మా కొట్టడమే! రాజస్థాన్‌లో బంధుమిత్ర సపరివార

సమేతంగా.. క్రైస్తవమత పద్ధతిలో జరిగిన తన మేనల్లుడి పెళ్లికి, మేనమామ జగన్ వెళ్లకపోవడం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు ఒక రేంజ్‌లో మాయ్యపై సెటైర్లు వేస్తున్నారు. మధ్యలో ‘ముద్దులమామయ్య’ సినిమాలో బాలకృష్ణ, ‘మామయ్య అన్న పిలుపు’ అనే సాంగేసి, షర్మిల కొడుకు పెళ్లి వీడియోను ఉంచుతున్నారు. అంతటితో ఆగకుండా.. ‘ మీ మేనమామ’నంటూ జగన్, గతంలో చెప్పిన సెంటిమెంటు డైలాగుకు.. అసలు మేనల్లుడి పెళ్లికి హాజరుకాని ఆయింట్‌మెంటు పూసి, సోషల్‌మీడియాలో వదులుతున్నారు. కొసరు మేనల్లుళ్ల సంగతి సరే, అసలు మేనల్లుడి పెళ్లికి పోలేదేంటి మాయ్య అని కొందరు…‘మాయ్యా పెళ్లికి పోలేదా’ అని ఇంకొందరు, తెగ సెటైర్లు సంధిస్తున్నారు.

నిజానికి అన్న జగన్- చెల్లి షర్మిల మధ్య ఎన్ని రాజకీయ స్పర్థలున్నప్పటికీ.. వైఎస్ మాదిరిగా, జగన్ కూడా వాటిని పక్కనపెట్టి.. రాజకీయాన్ని రాజకీయంగానే, బంధుత్వాన్ని బంధుత్వంగానే చూస్తారని వైఎస్ అభిమానులు ఆశించారు. ఆ ప్రకారంగా జగన్.. తన మేనల్లుడు రాజారెడ్డి పెళ్లికి సతీసమేతంగా వెళ్లి, చెల్లి కుటుంబాన్ని నిండుమనుసుతో ఆదరిస్తారని ఆశించారు.‘ పాప’ షర్మిల కూడా, అన్న రాకతో సంతోషిస్తుందని వైఎస్ సన్నిహితులు భావించారు.

అదే ఆశతో జగనన్న తన మేనల్లుడి పెళ్లికి వెళ్లారా? లేదా అని తెలుసుకునేందుకు, చాలామంది న్యూస్ వెబ్‌సైట్లను తెగ సెర్చ్ చేశారు. కానీ చెల్లి కొడుకు పెళ్లికి వెళ్లాల్సిన జగన్ మాయ్య… అనంతరపురం జిల్లా పర్యటనకు వెళ్లారని తెలుసుకుని, యమా ఫీలయ్యారట.

దానితో సోషల్‌మీడియాలో విమర్శల వరద మొదలయింది. మాయ్యపై చాలామంది మేనల్లుడ్స్.. ‘మాయ్యా పెళ్లికి వెళ్లలేదా?’ అని అత్తారింటికి దారేదీ సినిమాలో మాదిరిగా, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా మేనమామ ప్రచారం తెచ్చుకున్న జగనన్న ఇమేజీకి, ఇది పెద్ద డ్యామేజీనే అన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

LEAVE A RESPONSE