జగన్‌ జగమొండి.. చెప్పినా వినలేదు చంద్రబాబు గారూ…

– వైసీపీకి 40 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు
– రెడ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు
– రెడ్డి సర్పంచులు వైసీపీకి ఓటు వేయించరట
– ప్రజాప్రతినిధుల ఫోన్లపై నిఘా వేస్తున్నారు
– నాపేరు చెప్పి ఎమ్మెల్యేలను మారుస్తున్నారు
– ఎమ్మెల్యేల మార్పు సొంత మీడియా, సమన్వయకర్తల పనే
– జనంలో ఉండాలని చెప్పినా వినలేదు
– పరదాలు వద్దని చెప్పినా లెక్కచేయలేదు
– టీడీపీ ఆఫీసుపై దాడితోనే వైసీపీ పతనం ప్రారంభం
– తనను చూసి జనం ఓట్లేస్తామన్నదే జగన్‌ ధీమా
– లబ్ధిదారులంతా వైసీపీకే ఓటేస్తారన్న నమ్మకం
– అది ఎక్కడా జరగలేదని చెప్పినా వినలేదు
– ఒకచేత్తో ఇచ్చి ఇంకో చేతితో లాక్కుంటున్న నిజాన్ని జనం గ్రహించారు
– వాలంటీర్లతో గెలవాలనుకుంటున్నారు
– కొందరు అధికారులతో కావలసినవి చేస్తున్నారు
– తాను దైవాంశ సంభూతుడినన్నది జగన్‌ భావన
– ఎంపీ-ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని అప్పుడే చెప్పా
– జగన్‌కు అభద్రతాభావం ఎక్కువ… అందుకే ఎవరితో మాట్లాడరు
– ప్రత్యర్ధులపై దాడులు వద్దని చెప్పా
– ఉద్యోగులతో పెట్టుకోవద్దని చెప్పినా వినలేదు
– ఉద్యోగులు అవినీతిపరులన్నది జగన్‌ భావన
– వారిని ప్రోత్సహిస్తే పార్టీకి చెడ్డపేరని జగన్‌ ఉద్దేశం
– ఉద్యోగ సంఘ నేతలు తమ అదుపులో ఉన్నారన్న ధీమా
– ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న ధీమా
– అందుకే వారు సిఫార్సు చేసిన బిల్లులు ఇవ్వడం లేదు
– భేటీలలో వాటిని చూపించే ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు
– మీరు జైలుకు వెళ్లిన తర్వాతనే మీ గొప్పతనం అందరికీ తెలిసింది
– టీడీపీ-జనసేన పొత్తు జనంలోకి వెళ్లింది
– లోకేష్‌ పాదయాత్రతో క్యాడర్‌లో పెరిగిన చైతన్యం
– గ్యారంటీ పథకాలు మరింత వేగంగా వెళ్లాలి
– బాబుతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ సారాంశం ఇదే
-‘సూర్య’ ప్రత్యేక కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ స్వయంకృతాపరాధంతో తన ఓటమి తాను కొనితెచ్చుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 40 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవని, జగన్‌ మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారట. తన పేరు చెప్పి ఎమ్మెల్యేలను మారుస్తున్నారని, తాను ఐప్యాక్‌ నుంచి వెళ్లిపోయి బీహార్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని పీకే చెప్పారట. వైసీపీ సొంత మీడియా-సమన్వయకర్తలే జగన్‌కు చెప్పి అభ్యర్ధుల నియోజకవర్గాలు మారుస్తున్నారని వెల్లడించారని సమాచారం.

ఉద్యోగులంతా అవినీతిపరులన్నదే జగన్‌ అభిప్రాయమని, పర్యటనల్లో పరదాలు వద్దని చెప్పినా వినలేదని, ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలు వద్దన్నా వినకుండా, జగన్‌ అప్రతిష్ఠ మూటకట్టుకున్నారని పీకీ స్పష్టం చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి తర్వాతనే వైసీపీ గ్రాఫ్‌ పడిపోవడం ప్రారంభించిందని, చంద్రబాబు అరెస్టుతో ఆ గ్రాఫ్‌ మరీ దిగజారిందని వెల్లడించారట. మీ అరెస్టు తర్వాతనే మీకున్న ప్రజాభిమానం వెలుగులోకి వచ్చిందని బాబు బృందానికి పీకే విశ్లేషించారట. లోకేష్‌ పాదయాత్రతో పార్టీ క్యాడర్‌లో చైతన్యం పెరగడంతోపాటు, జనంలో ఉన్న వ్యతిరేకను లోకేష్‌ పాదయాత్ర ప్రజలకు చాటిందని వివరించారట. టీడీపీ-జనసేన పొత్తు క్షేత్ర స్థాయికి వెళ్లిందని, పార్టీ హామీలు మరింత పకడ్బందీగా చేరాల్సిన అంశంపై దృష్టి పెట్టాలని, ఆయన చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. బాబు బృందంతో పీకే భేటీకి సంబంధించిన వివరాలు ‘సూర్య’ సంపాదించింది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… తన పేరు వాడుకున్న జగన్‌, తన సూచనలు-సలహాలు పాటి ంచలేదని, పీకే టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. జగన్‌ తన సొంత మీడియా ప్రతినిధులు-సమన్వయకర్తల సిఫార్సుల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారని, పర్యటనల సందర్భంగా పరదాలు కూడా, ఒక ఐపిఎస్‌ అధికారి చేసిన సూచన మేరకే అమలుచేస్తున్నారన్నారు.

పరదాలతో వెళితే జనాలు దూరమవడంతోపాటు, వారు పడే ఇబ్బందులతో వ్యతిరేకత పెరుగుతుందని చె ప్పినా జగన్‌ వినలేదన్నారు. కొందరు అధికారులతో తాను అనుకున్న పనులు చేస్తున్నారని, చాలామంది ఐపిఎస్‌లు కూడా అయిష్టంగా పనిచేస్తున్నారని చెప్పారు.

చివరకు సీనియర్‌ మంత్రులు-ఎమ్మెల్యేలు కూడా సమన్వయకర్తల పెత్తనంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. తమ సీనియారిటీలో సగం అనుభవం కూడా లేని వారంతా సమన్వయకర్తల రూపంలో తమపై పెత్తనం చేస్తున్న తీరుపై మంత్రులు సహచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, బాబు బృందానికి పీకే వెల్లడించారట. ప్రధానంగా తమ ఫోన్లపై నిఘా ఉందన్న అనుమానంతో ఎమ్మెల్యేలు తమ అటెండర్లు, భార్యల ఫోన్ల నుంచి మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందని పీకే వెల్లడించారట.

జగన్‌కు ఎమ్మెల్యేలంటే ఏమాత్రం గౌరవం లేదని పీకే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముతో బలోపేతమయ్యారని, దానికి సంబంధించిన చిట్టా అంతా దగ్గర ఉంచుకున్నారని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్యేలను బుజ్జగించే సందర్భంలో మాటవినని ఎమ్మెల్యేలకు భూముల కొనుగోలులో జరిగిన అవినీతి చిట్టాను వారికే ఇస్తున్నారన్నారు. తనకు-జనాలకు మాత్రమే సంబంధాలుండాలని, అందుకే వాలంటీర్లతో ఎమ్మెల్యేలను జీరో చేశారని వివరించారు. అందుకే వారు సిఫార్సు చేసే కాంట్రాక్టర్ల బిల్లులు కూడా ఇవ్వవద్దని సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు.

ప్రజలు తనను చూసి, తన పథకాలను చూసి ఓట్లేస్తారన్న భావనలో జగన్‌ ఉన్నారని, అయితే అది ఎక్కడా సాధ్యం కాదని తాను స్పష్టం చేశానన్నారు. ఆయన తానొక దైవాంశ సంభూతిడినన్న భావనలో ఉంటారని, అభద్రతాభావం-భయం ఉన్నందుకే జగన్‌ ఎవరితో తన అభిప్రాయాలు-వ్యూహాలు పంచుకోరని పీకే స్పష్టం చేశారట.

తాను నలుగురితో కలసి మాట్లాడితే అవి ఎక్కడ బయటకు వెళతాయన్న భయంతోనే జగన్‌.. పార్టీ-ప్రభుత్వ నిర్ణయాలపై, ఎవరితో చర్చించరని పీకే అసలు విషయం తేల్చేశారట. చివరకు సమన్వయకర్తలతో కూడా జగన్‌ ఒక్కొక్కరితోనే మాట్లాడతారని పీకే వెల్లడించారట. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపడం వల్ల, అభివృద్ధి ఆగిపోతుందని తాను చెప్పినప్పటికీ.. డబ్బులిస్తే వారు టీడీపీ-జనసేనకు ఆర్ధిక సాయం చేస్తారన్న భయంతో బిల్లులు ఆపేశారన్నారని పీకే టీడీపీ అధినేత, ఆయన బృందానికి వివరించారట.

ప్రభుత్వానికి సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా ముఖ్యమని ఎన్నోసార్లు సూచించానన్నారు. సంపద పెంచే నిర్ణయాలు తీసుకోకుండా, పంచడం వల్ల ప్రజలు అప్పుల పాలవుతారన్న తన సూచన పెడచెవిన పెట్టారన్నారు. జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే, ఉద్యోగులు-పెన్షనర్లు వైసీపీకి వ్యతిరేకం కావడానికి ప్రధాన కారణమన్నారు.

జగన్‌కు ప్రభుత్వ ఉద్యోగులంటే చులకన అని, ఆయన దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులని పీకే టీడీపీ అధినేతకు వివరించారట. ఉద్యోగులతో వైరం పెట్టుకోవద్దని తాను చేసి సూచనను జగన్‌ పట్టించుకోలేదన్నారు. ‘వారికి భయపడి ప్రోత్సహిస్తే పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది. ఉద్యోగుల పట్ల మనమే సరైన విధంగా వ్యవహరిస్తున్నామని ప్రజలు సంతోషంగా ఉన్నార’న్నది జగన్‌ అభిప్రాయమన్నారు. అంత చేసిన చంద్రబాబుకే ఓటేయని ఉద్యోగులు మన పార్టీకి ఎందుకు వేస్తారన్న అభిప్రాయం జగన్‌లో ఉందన్నారు. అందుకే ఉద్యోగులను పట్టించుకోవాల్సిన పనిలేదన్న అభిప్రాయంతో ఉన్నారట.

ఎమ్మెల్యేలు-లీడర్లు కాకుండా.. నేరుగా జనంతో సంబంధాలు ఉండాలన్నదే జగన్‌ అభిప్రాయమని, అందుకే ఎమ్మెల్యేలను పక్కనపెట్టి వారికి పోటీగా వాలంటీర్లను ప్రోత్సహిస్తున్నారని పీకే చెప్పారట. జనం తనను చూసి ఓటు వేస్తారే తప్ప, ఎమ్మెల్యేలను చూసి కాదన్నది జగన్‌ నిశ్చితాభిప్రాయమట. ఎన్నికల్లో డబ్బులిచ్చి గెలిపించే తన మాట, ఎమ్మెల్యేలు వినాల్సిందేనన్నది జగన్‌ వైఖరి అని విశ్లేషించారు.

సీనియర్ల అసంతృప్తి జగన్‌కు తెలుసని, వారి సలహాలు వింటే మునిగిపోతామన్నది జగన్‌ మనోగతమట. అందుకే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని పీకే చెప్పారట. ‘‘ఏం చేయాలో నాకు తెలుసు. నాకు అన్ని రిపోర్టులూ వస్తాయి. నేను చెప్పింది మీరు చేయండి’’ అని సలహాదారులు, మంత్రులకు జగన్‌ స్పష్టం చేస్తుంటారట. అందుకే ఆయనకు ఎవరూ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరని పీకే విశ్లేషించారట.

తాను నేరుగా లబ్ధిదారులకు డబ్బులు నేరుగా ఇస్తున్నందున, ఎన్నికల్లో వారంతా తనకే ఓటు వేస్తారన్న ధీమా జగన్‌లో ఉందని పీకే చెప్పారట. అయితే తమకు 10 వేలు ఇచ్చి 20 వేలు మరో మార్గంలో వసూలు చేస్తున్నారన్న నిజాన్ని, ప్రజలు గత రెండేళ్ల నుంచే గ్రహించడం ప్రారంభించిన విషయం, జగన్‌కు తెలియదని పీకే వెల్లడించారట.

ఇక ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం కూడా.. జగనపై వ్యతిరేకతతో ఉందన్న విషయాన్ని, పీకే టీడీపీ అధినేత దృష్టికి తీసుకువచ్చారట. సర్పంచుల్లో 70 శాతం ఉన్న రెడ్లు.. ఈసారి వైసీపీకి వేయమని స్పష్టం చేశారని, ఆ విషయం సీఎంఓ దృష్టిలో కూడా ఉందన్నారు. అయితే రెడ్లు టీడీపీకి వేయరు. చచ్చినట్లు తమకే వేస్తారన్న ధీమా జగన్‌లో ఉందన్నారట. టీడీపీ ఉన్నప్పుడే తమకు గౌరవం ఉందన్న భావనలో ఉన్న రెడ్లు.. జగన్‌ వచ్చిన తర్వాత గ్రామాల్లో తాము పనికిరాకుండా పోయామన్న ఆగ్రహంతో ఉన్నారట.

గతంలో ప్రజలు తమ ఇళ్ళకు వచ్చేవారని, ఇప్పుడు వాలంటీర్లను తెచ్చి తమ గౌరవం-ప్రతిష్ఠ దెబ్బతీశారన్నదే, రెడ్లకు జగన్‌పై అసలు కోపమని విశ్లేషించారు. కొద్దిమంది రెడ్లు కులాభిమానంతో వైసీపీకి ఓటు వేసినా, వారు ఎలక్షన్‌ చేయరని పీకే స్పష్టం చేశారట. జగన్‌ చుట్టూ ఉన్న కొద్దిమంది రెడ్లు మాత్రమే లాభపడుతున్నారే తప్ప, తమకెలాంటి లబ్థి కలగడం లేదన్నది మెజారిటీ రెడ్ల మనోగతమని వెల్లడించారట. పైగా వందల కోట్ల పెండింగ్‌ బిల్లులలో.. రెడ్ల వాటానే ఎక్కువ అని, జగన్‌పై రెడ్ల అసంతృప్తికి అది కూడా ఒక ప్రధాన కారణమని పీకే విశ్లేషించారట. తెలంగాణ ఫలితాలు చూసి ఏపీలో కూడా, అభ్యర్ధులను మార్చాలని జగన్‌ సొంత మీడియానే సూచించిందని పీకే చెప్పారట. అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు నియోజకవర్గాలు మార్చినా ఎలాంటి ఫలితం ఉండదని పీకే స్పష్టం చేశారట.

టీడీపీ-జనసేన పొత్తు క్షేత్రస్థాయికి వెళ్లిందని, ఇది మీకు ఉపయోగమేనని పీకే చెప్పారట. అభ్యర్ధుల ఎంపిక-నిధుల పంపిణీ-ప్రచార వ్యూహాలపై జాగ్రత్తగా ఉండాలని పీకే సూచించారట. బాబు షూరిటీ ప్రచారాన్ని క్షేత్రస్ధాయికి చేర్చాలని, దానిపై వైసీపీ ఎక్కువ భయపడుతోందని పీకే చెప్పారట. ఈసీకి ఫిర్యాదు చేయడం వెనుక వైసీపీ భయమే కారణమని పీకే విశ్లేషించారట.

వైసీపీ ఒక్కో అభ్యర్ధికి 30 కోట్ల వరకూ ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయరని పీకే స్పష్టం చేశారట. తన సొంత మీడియా ఇచ్చే నివేదికల్లో.. అభ్యర్ధులపై వ్యతిరేక ఫలితాలు వస్తే, వారికి నిధులు ఇవ్వకుండా జగన్‌ జాగ్రత్తపడే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారట. కాగా ఎన్నికలకు నెలముందే జగన్‌, నియోజకవర్గాలకు నిధులు పంపిణీ చేసే అవకాశం ఉందని, దానిపై దృష్టి సారించాలని పీకే సూచించారట.

విజయనగరం జిల్లాలోనే వైసీపీ కొద్దిగా బలం కనిపిస్తోందని, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళంలో వైసీపీకి ఐదుకి మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారట. గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి, పదికి మించి వచ్చే వాతావరణం లేదని స్పష్టం చేశారట. రాయలసీమలోని కడపలో ఐదుసీట్లు వైసీపీ ఖాతా నుంచి టీడీపీలోకి పోవడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారట. నెల్లూరు-కర్నూలు-చిత్తూరు జిల్లాల్లో టీడీపీ-వైసీపీ బలం సరిసమానంగా ఉన్నప్పటికీ, వైసీపీ అభ్యర్ధులను మార్చకపోతే అవికూడా వచ్చే అవకాశాలు లేవని విశ్లేషించారట. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి 6-7 స్థానాలు మించి వచ్చే అవకాశాలు లేవని, అనంతపురంలో ఒక్క స్థానంలో మాత్రమే బలం ఉందని వివరించారట.

Leave a Reply