ఒక ట్రాప్‌.. వంద ప్రశ్నలు!

– అసలు పట్టుబడిన డబ్బెంతో చెప్పని పోలీసులు
– అవి ఎక్కడివో తేల్చారా?
– డబ్బు తీసుకువచ్చిన వాహనం సీజ్‌ చేశారా?
– పోనీ అసలు డబ్బులే దొరకలేదా?
-అసలు కేసును జీడీలో ఎంటర్‌ చేశారా?
– ఆ ఇద్దరు పీఠాథిపతుల ఫోన్లలో ఏ నెంబర్లున్నాయి?
– అమిత్‌షా పీఏకు ఫోన్‌ చేస్తే అది డిస్‌ప్లేలో కనబడదా?
– ఎమ్మెల్యేలను పోలీసుస్టేషన్‌కు ఎందుకు తీసుకువెళ్లలేదు?
– విచారణ ప్రక్రియ పూర్తికాకుండానే ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా పంపించారు?
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకోలేదేం?
– నిందితులు-ఫిర్యాదుదారుల ఫోన్‌ కాల్‌లిస్ట్‌ తీశారా?
– రేవంత్‌రెడ్డి కేసు మాదిరిగా పట్టుబడిన డబ్బు వీడియోలో చూపించలేదేం?
-వీడియోలు స్వాధీనం చేసుకుంటే అవి ఎలా లీకయ్యాయి?
– పోలీసులే మీడియాకు ఆ వీడియోలు లీక్‌ చేశారా?
– మరి లీక్‌ చేసిన ఆ అధికారిపై చర్యలుంటాయా?
– అసలు కెమెరాలు పెట్టిందె వరు? ఆపరేట్‌ చేసిందెవరు?
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొను‘గోల్‌మాల్‌’ కేసులో అన్నీ ప్రశ్నలే
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొను‘గోల్‌మాల్‌’ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. బుధవారం రాత్రి వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో జరిగిన బేరసారాల వ్యవహారం ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? అది మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావితం చూపిస్తుందా? లేదా? ప్రజలు ఏ పార్టీ వాదనను విశ్వసిస్తారు అన్న లెక్కలు పక్కనబెడితే.. అసలు జరిగిన పరిణామాలపైనే న్యాయ-రాజకీయ వర్గాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ నాయకత్వం తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆరోపిస్తోంది. అయితే జరిగిన పరిణామాలతో తమకెలాంటి సంబంధం లేదని, వచ్చిన వారిలో తమ పార్టీ వాళ్లెవరూ లేరని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. నందకుమార్‌ హోటల్‌ ప్రారంభోత్సవానికి మాత్రమే తాను వెళ్లానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు, నిందితుడు నందకుమార్‌ ఫొటోలు విడుదల చేశాయి. విచిత్రమేమిటంటే.. రెండు పార్టీలు విడుదల చేసిన ఫొటోల్లో, నందకుమార్‌ ఉండటం ఆశ్చర్యం. అంటే ఆయన ఇద్దరికీ కావలసినవాడేనని మెడ మీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అయితే టీఆర్‌ఎస్‌-బీజేపీ దాడి, ఎదురుదాడి నేపథ్యంలో… కీలకమైన ప్రశ్నలు, ఎన్నో జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి.

ఫాం హౌస్‌లో పట్టుబడిన నందకుమార్‌, ఆయనతో వచ్చిన సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, సింహయాజులును ట్రాప్‌ చేసిన.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ సంభాషణల ఆడియో రికార్డులను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? లేదా? ఇది ఒక అధికార పార్టీని కూలదోసే కుట్రకు సంబంధించిన కేసు కాబట్టి.. మరి బేరసారాలకు గురైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? లేదా అన్నది ప్రశ్న.

సాధారణంగా ఈ తరహా కేసులకు సంబంధించి, పోలీసుల దర్యాప్తు కోణం అలాగే ఉంటుంది. ఫోన్‌ చేసిన వారితోపాటు, అవతల వ్యక్తి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటారు. మరి ఆ దర్యాప్తు ప్రక్రియ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విషయంలో పాటించారా? లేదా? అన్నది మరో సందేహం. గతంలో నిందితుడిగా ఉన్న రేవ ంత్‌రెడ్డి ఫోను కూడా పోలీసులు ఇలాగే స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారుడయిన ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌ ఫోను కూడా స్వాధీనం చేసుకుని, వాటిని కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో మాత్రం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, పోలీసుల ప్రకటనలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్యేల ఫోన్లే కీలకం అన్న విషయాన్ని పోలీసులు విస్మరించడమే ఆశ్చర్యమని న్యాయ-రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రాత్రి సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు పీఠాథిపతులు, వారిని తీసుకువచ్చిన నందకుమార్‌ను పోలీసులు తమతో తీసుకువెళ్లారు. కానీ అక్కడే ఉన్న నలుగురు బాధిత ఎమ్మెల్యేలను మాత్రం, విచారణ ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రగతిభవన్‌కు ఎలా పంపించారన్న విమర్శలకు జవాబు లభించడం లేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితులు- ఫిర్యాదుదారులను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి, వారితో వాంగ్మూలం తీసుకోవడం రివాజు.

ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకూ నిందితులు-ఫిర్యాదుదారులను పోలీసుస్టేషన్‌లోనే ఉంచుతారు. బాధితుల వద్ద వాంగ్మూలం నమోదుచేసుకుని, పిలిచినప్పుడు హాజరుకావాలని చెబుతుండటం ఎక్కడయినా జరిగే తంతు. కానీ రోహిత్‌రెడ్డి సమాచారం మేరకే రంగంలోకి దిగిన పోలీసులు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి అదేరోజు రాత్రి వాంగ్మూలం తీసుకున్నారా? అన్నది మరో ప్రశ్న.

ఇక రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగామని చెప్పిన పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఆ విషయాన్ని జనరల్‌ డైరీలో నమోదు చేశారా అన్నది మరో ప్రశ్న. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత పంచనామా నిర్వహించే పోలీసులు, సంఘటనా స్ధలంలో ఏమేమి లభించాయన్నది లెక్కలతో సహా పేర్కొంటారు. కానీ ఫాంహౌస్‌ ఘటనలో ఎన్ని కెమెరాలు లభించాయి? ఎంత డబ్బులు దొరికాయన్నది పంచనామాలో నమోదు చేశారా? లేదా? అన్నది ప్రశ్న.

బేరసారాల నేపథ్యంలో ఇద్దరు పీఠాథిపతులు, వారిని తెచ్చిన నందకుమార్‌.. తమను బీజేపీ ప్రలోభపెట్టిందని ఫిర్యాదు చేసిన, రోహిత్‌రెడ్డి- మరో ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిని కోర్టుకు హాజరుపరచడం విచారణ ప్రక్రియలో భాగం. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పరీక్షకు పంపించి, నివేదిక తెప్పించుకుంటారు. గతంలో రేవంత్‌రెడ్డి కేసులో కూడా ఇదే జరిగిన విషయాన్ని విస్మరించకూడదు. ఆ విచారణ పద్ధతిని ఫాంహౌస్‌ కేసులో పాటించారా? లేదా అన్నది మరో ప్రశ్న. ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్లు.. ఢిల్లీ స్వామి కేంద్రహోంమంత్రి అమిత్‌షా కార్యదర్శితో మాట్లాడిందే నిజమైతే, ఆ నెంబరు డిస్‌ప్లే అయి ఉంటుంది. దానిని పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదన్నది మరో ప్రశ్న.

ఫాంహౌస్‌లో ఒక మీడియా సంస్థ సౌజన్యంతో.. కొన్ని డజన్ల కెమెరాలు, ఆడియో బగ్స్‌ అమర్చారన్నది ఒక కథనం. ఆ ప్రకారంగా గదిలో వారి సంభాషణ, వీడియాలను గంటన్నర సేపు చిత్రీకరించారని తెలుస్తోంది. అదే నిజమైతే.. వాటిని పోలీసులు నేరుగా కోర్టుకు స్వాధీనం చేయాలి. కానీ, సంఘటన జరిగిన వెంటనే.. ఆ దృశ్యాలు మీడియాకు ఎలా లీక్‌ అయ్యాయన్నది ప్రశ్న. వాటిని పోలీసులే లీక్‌ చేశారా? లేక పోలీసులతో పాటు మరికొన్ని ప్రైవేట్‌ చానెళ్లు కలసి, ఈ ఆపరేషన్‌ చేశాయా అన్నది మరో సందేహం. వాటిని లీక్‌ చేసిన అధికారిపై.. భద్రతారహ స్యాలు కాపాడనందుకు చర్యలకు సిఫార్సు చేస్తారా? లేదా అన్నది మరో ప్రశ్న. దానితోపాటు.. వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసిందెవరు? ఆ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఆపరేట్‌ చేసిందెవరు? పోలీసులా? లేక ప్రైవేటు వ్యక్తులా అన్నది మరో ప్రశ్న.

ఇక ఫాంహౌస్‌లో పోలీసులు నిర్వహించిన దాడిలో, డబ్బు ఎంత పట్టుబడిందన్నది మరో ప్రశ్న. అసలు వాటిని ఏ వాహనంలో ఎవరు తెచ్చారు? ఆ వాహనం ఎవరిది? ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? హైదరాబాద్‌ జాతీయ రహదారి సహా, అన్ని దారుల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు, మరి ఆ డబ్బు తెచ్చిన వాహనం కనిపించలేదా? ఒకవేళ కనిపించినా వదిలేశారా? అన్నది మరో ప్రశ్న. రేవంత్‌రెడ్డి కేసులో డబ్బు ఎంత పట్టుబడిందన్న దృశ్యాలు, పోలీసులు లీక్‌ చేసిన వీడియోలో స్పష్టంగా కనిపించాయి. కానీ ఈ కేసులో మాత్రం డబ్బులు కనిపించకుండా, మూటలు మాత్రమే కనిపించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చివరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆఫర్‌ గురించి ఉందే తప్ప, అసలు గురించి లేదు. సాధారణంగా పేకాట ఆడేవారిపై దాడి చేసే పొలీసులు, ఎంత డబ్బు స్వాధీనం చేసుకున్నారో వెల్లడిస్తారు. మరి ఇంత కీలకమైన కేసులో మాత్రం, డబ్బు స్వాధీన ప్రస్తావన ఎందుకు చేయలేదన్నది మరో ప్రశ్న.

ఒకవేళ ఆ డబ్బు ఇద్దరు పీఠాథిపతులే తెచ్చారనుకుంటే.. ఏపీ-తెలంగాణ సరిహద్దులో పటిష్టమైన తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారు? పోనీ ఢిల్లీ నుంచి వచ్చిన స్వామి డబ్బు తీసుకువచ్చారనుకుంటే.. ఎయిర్‌పోర్టులో తనిఖీలను తప్పించుకుని, అంత డబ్బు తీసుకురావడం అసాధ్యం. మరి ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్నది మరో కీలకమైన ప్రశ్న.

Leave a Reply