బాబాలా? బ్రోకర్లా?

– భగవంతుడి బదులు పార్టీ నేతల సేవ
– భగవంతుడి బదులు పార్టీలకు బ్రాండ్‌ అంబాసిడర్లా?
– ‘రాజకీయ హోమాల’తో రచ్చ
– పాలకులకు రాజగురువులుగా మారారన్న విమర్శలు
– మొయినాబాద్‌ ఫాంహౌస్‌కు ఆ ఇద్దరు స్వాములు ఎందుకెళ్లినట్లు?
– వారిని పురమాయించింది ఎవరు?
– బేరసారాలకు ఆదేశించింది ఎవరు?
– పూజలు చేయాల్సిన స్వాములకు నేతలతో పనేమిటి?
– ఆ ఇద్దరికీ బీజేపీతో సంబంధాలున్నాయంటున్న టీఆర్‌ఎస్‌
– కర్నాటకలో పార్టీల సొమ్ము మఠాలకు మళ్లింపు?
– కన్నడ మఠాథిపతులతో ఢిల్లీ నేతల సన్నిహిత సంబంధాలు
– యుపీలో స్వాములే పార్టీల ఎంపీ-ఎమ్మెల్యేలు
– ఏపీ-తెలంగాణ ఆశ్రమాల్లోనూ నేతల పెట్టుబడుల డబ్బులు?
– పాలకులకు పదవుల సిఫార్సు చేస్తున్న పీఠాథిపతులు
– తెలంగాణలో పాలకుల వద్ద తగ్గిన జీయరు స్వామి హవా
– ఏపీలో చక్రం తిప్పుతున్న విశాఖ స్వరూపానంద
– నేతల వద్దకు స్వయంగా వెళుతున్న స్వాములు
– ఓపెనింగ్‌ ఫంక్షన్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ప్రారంభోత్సవాలకూ స్వాములే
( మార్తి సుబ్రహ్మణ్యం)

భక్తులకు మార్గదర్శనం చేసి.. భగవంతుడి ప్రతినిధులుగా ఉండాల్సిన బాబాలు, రాజకీయ బ్రోకర్ల అవతారమెత్తడం హిందూ సమాజంలో విమర్శలకు దారితీస్తోంది. లోకకల్యాణం కోసం హోమాలు చేయాల్సిన బాబాలు-మఠాథిపతులు-పీఠాథిపతులు, ‘రాజకీయ హోమాలు’ చేయడం భక్తుల ఆగ్రహానికి గురవుతోంది. భగవంతుడి సేవలో తరించి, ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని వెళ్లదీయాల్సిన స్వాములు, రాజకీయ పార్టీల బ్రాండ్‌ అంబాసిడర్లుగా అవతరించడం, హిందూ సమాజాన్ని ఆవేదనకు గురిచేస్తోంది. తాజాగా మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఇద్దరు స్వాములు.. రాజకీయ ప్రలోభాలకు గురిచేస్తూ పట్టుబడిన వైనం, సర్వసంగ పరిత్యాగుల జీవనశైలిని మకిలిగా మార్చాయి. ఆ వ్యవహారం స్వాముల అసలు రంగును బయటపెట్టింది. ఇప్పుడిదే హిందూ సమాజంలో హాట్‌టాపిక్‌.

వేదాధ్యయనం చేయాల్సిన స్వాముల నోళ్లు, ఇప్పుడు రాజకీయ నేతలను కీర్తిస్తున్నాయి. వేదాశీర్వచనం ఇవ్వాల్సిన చేతులు, ఇప్పుడు నేతలను పార్టీలు మార్చేందుకు పనిచేస్తున్నాయి. భక్తులకు దిశానిర్దేశం చేయాల్సిన స్వాముల మేధస్సు, ఇప్పుడు రాజకీయ పార్టీలకు పనిముట్టుగా మారుతోంది. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, బీజేపీలోకి చేర్పించేందుకు వచ్చిన ఇద్దరు స్వాముల తెంపరితనం.. ‘బాబాలు బ్రోకర్ల’నే ముద్ర వేసేందుకు కారణమయింది.

ఘజియాబాద్‌కు చెందిన సతష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజులు కలసి.. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్పించే, ‘పొలిటికల్‌ సుపారీ’కి ఒప్పుకున్నారన్న సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వ్యాఖ్యలు, ఆధ్మాత్మికలోకాన్ని సిగ్గుతో తలవంచుకునే చేశాయి. బీజేపీలోకి మారితే వంద కోట్ల రూపాయలతోపాటు, ఢిల్లీలో కాంట్రాక్టులు ఇప్పిస్తామన్న ఆఫర్‌ పరిశీలిస్తే.. బాబాలు ఆధ్యాత్మిక బాట వదిలి, రాజకీయ బ్రోకరిజం బాట పట్టారన్న విమర్శల్లో తప్పులేదనిపిస్తుంది.

అసలు ఆశ్రమాల్లో ఉండి భక్తులకు ఉపదేశాలివ్వాల్సిన ఈ స్వాములు, ఫాంహౌస్‌కి ఎందుకు వెళ్లారన్నది ప్రశ్న. ఫాంహౌసులంటే పెద్దలు ‘అన్ని విధాలా’ సేదతీరే ఓ ఖరీదైన కేంద్రం. అది శారీరక-మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు పెద్దలు ఎంచుకునే ఓ విలాసవంతమైన పొదరిల్లు. యువతరం గుట్టుగా నిర్వహించుకునే రేవ్‌ పార్టీలకు ఫాంహౌసులే అడ్డా.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. సర్వసంగ పరిత్యాగులైన పీఠాథిపతులు-మఠాథిపతులు-బాబాలు అక్కడకు వెళ్లకూడని ప్రదేశం. మరి ఇన్ని తెలిసి కూడా ఆ ఇద్దరు స్వాములు ఫాంహౌసుకు ఎందుకు వెళ్లినట్లన్నది ప్రశ్న. పోనీ ఫాంహౌసుకు వచ్చిన ఆ ఇద్దరు స్వాములు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏమైనా మంత్రోపదేశం-ఆశీర్వాదం ఇస్తున్న వీడియోలేమైనా కనిపించాయా అంటే అదీ లేదు. పోనీ అక్కడేమైనా హోమాలు, శాంతిపూజలేమైనా జరిగాయా అంటే అదీ లేదు. మరి ఏ లక్ష్యంతో ఆ ఇద్దరు స్వాములు, అక్కడికి వెళ్లారన్న ప్రశ్నలకు జవాబు లేదు.

ఆ ఇద్దరు స్వాములతో తమ సంబంధం లేదని బీజేపీ నేతలు ఓవైపు స్పష్టంగా ప్రకటిస్తుంటే, మరోవైపు వారిద్దరూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, బీజేపీలో చేర్పించే పని కోసమే ఫాంహౌసుకు వచ్చారని, పోలీసు కమిషనర్‌ స్పష్టంగా చెబుతున్నారు. ఇందులో ఎవరి మాట నిజం? అసలు సతీష్‌ శర్మ ఘజియాబాద్‌ నుంచి రావల్సిన అవసరమేమిటి? ఆయనేమైనా హైదరాబాద్‌లో యాగాలు చేశారా? తిరుపతిలో ఉండాల్సిన యాజులుకు హైదరాబాద్‌ ఫాంహౌస్‌లో ఏం పని? టీఆర్‌ఎస్‌-బీజేపీతో అంటకాగే వ్యాపారి నందకుమారే స్వాములపై ట్రాప్‌ వేశారా? అన్న చర్చలు భక్తలోకంలో స్వాముల పరువు పలచన చేస్తున్నాయి.

కర్నాటకలో మఠాలు అత్యంత శక్తివంతమైనవి. ఒక్కో కులానికి ఒక్కో మఠం ఉంటుంది. ఎన్నికల్లో మఠాలే విజయాన్ని శాసిస్తాయన్నది బహిరంగ రహస్యం. ఏ పార్టీకి ఓటెయ్యాలో, మఠాథిపతులే నిర్దేశిస్తుంటారు. అందుకే జాతీయ-ప్రాంతీయ పార్టీ నేతలు, అధినేతలంతా మఠాధిపతుల ఆశీర్వాదం కోసం తరలివస్తుంటారు. అయితే.. మెజారిటీ మఠాలలోనే, రాజకీయ పార్టీ నేతలు తమ డబ్బు దాచిపెడుతుంటారన్న ప్రచారం రహస్యమేమీ కాదు. వాటితో ఇతర రాష్ర్టాల్లో వ్యాపారాలు చేస్తుంటారన్న చర్చ, కొన్ని దశాబ్దాల నుంచి వినిపిస్తున్నదే. ఇక ఉత్తరప్రదేశ్‌లో స్వాములంతా ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యే-ఎంపీలుగా గెలుస్తూనే ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాధ్‌ కూడా సాధువు కావడం విశేషం. కాబట్టి యుపీలో రాజకీయాలు-స్వాములు-సాధువులు వేర్వేరు కాదు.

ఇక తెలుగు రాష్ర్టాల్లో కొందరు పీఠాథిపతులు, రాజకీయ స్వాముల సంఖ్య తక్కువే అయినప్పటికీ, వారు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండటాన్ని విస్మరించకూడదు. ఇటీవలి కాలం వరకూ చినజీయర్‌ స్వామి, తెలంగాణ పాలకులకు ఇష్టదైవం. కంటి వెలుగు, ఇంటి దైవం కూడా! అలాంటి చిన జీయరును పాలకులు కొద్దికాలం క్రితం దూరం పెట్టారు.

అంత వరకూ జీయరు ఆశ్రమం.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రియల్లర్లు, రాజకీయ నాయకులు, సినీతారలతో కళకళలాడేది. ఇతర రాష్ర్టాల ప్రముఖులు, జాతీయ స్థాయి ప్రముఖులు ఆశ్రమానికి వచ్చినప్పుడు, ఈ భక్తులంతా అక్కడే కనిపించడం విశేషం. స్వామివారే తన భక్తులయిన వ్యాపారులను, ఆశ్రమానికి వచ్చిన ప్రముఖులకు పరిచయం చేస్తుంటారు. చివరకు కాసినో కేసులో చిక్కుకున్న ప్రవీణ్‌ సైతం, తన కొత్త కారులో జీయరు స్వామిని పక్కన కూర్చోబెట్టుకున్న వీడియో వైరల్‌ అయి, జీయరు ప్రతిష్ఠ దెబ్బతినేందుకు కారణమయింది.

ఇక ఏపీలో విశాఖ శారదాఫీఠాథిపతి స్వరూపానంద సరస్వతి మాట, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి శిలాశాసనం. తన తపశ్శక్తులను ధారపోసి, జగన్‌ను సీఎం చేశానని స్వామివారే ఓసారి నిర్భీతిగా సెలవిచ్చారు. జగన్‌ను అందరూ చూస్తుండగనే ముద్దు పెట్టుకున్న పీఠాథిపతి ఆయన. శారదా పీఠాథిపతి చల్లనిచూపుతో చాలామందికి పదవులు లభించాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరిన శారదాపీఠాథిపతి ఆశ్రమం ఇప్పుడు మంత్రులు-ఎమ్మెల్యేలు-వైసీపీ నేతలు- అధికారులతో కిటకిట లాడుతోంది. ఎండోమెంటు శాఖ కమిషనర్‌ నుంచి ఈఓల వరకూ ఆయన చెప్పిందే వేదం. డీజీపీలు, డీఐజీలు, పోలీసు కమిషనర్లు, ఐఏఎస్‌లు సైతం విశాఖకు వెళ్లి స్వామి వారి సేవలో తరిస్తున్నారంటే.. స్వరూపానంన శక్తి ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే.. సాధుపరిషత్‌ అధ్యక్షుడయిన శ్రీనివాసానంద స్వామి.. అది శారదాపీఠం కాదని, వైసీపీ ఆఫీసు అంటూ గతంలో చేసిన వ్యాఖ్య, స్వరూపానంద ఇమేజీని డామేజీ చేసింది.

Leave a Reply