Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న ఇళ్ల స్థలాల్లో 15 వేల కోట్ల అవినీతి

-ఇళ్ల నిర్మాణానికి కేంద్రం లక్ష 80 వేల రూపాయల సహాయం
-జగన్మోహన్ రెడ్డి బ్యాంకు ద్వారా 35 వేల రూపాయలు అప్పు ఇప్పిస్తారట..!
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుండగా, 30 వేల కోట్ల రూపాయల ఇళ్ల స్థలాల కొనుగోలులో 15 వేల కోట్ల అవినీతి జరిగినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల సెంట్ల ఇళ్ల స్థలాలలో 15 నుంచి 16 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ అభియోగాన్ని మోపుతున్నారన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలులో ఎకరా ఐదు లక్షలకు కొని 10 లక్షలు గా, 10 లక్షలకు కొనుగోలు చేసి 20 లక్షలు గా, 20 లక్షలకు కొనుగోలు చేసి తమ పార్టీ వారు 50 లక్షలు గా చూపెట్టడం జరిగిందన్నది జగమెరిగిన సత్యమేనన్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ అభియోగాలు నిజమేనన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజమండ్రిలోనూ భూముల కొనుగోళ్ల లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు . ఇళ్ల స్థలాల కొనుగోలు అవినీతే తప్ప, ఎక్కడ పారదర్శకత లేదన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలులో అవినీతి జరిగిందంటే కాళ్లు కట్టేసి కొడుతారన్నారు. కొంకలమం లోని జగనన్న కాలనీలలో 16 మంది లబ్ధిదారులే సొంతంగా ఇళ్లను నిర్మించుకుంటే, మంత్రి అమర్నాథ్ మాత్రం 12 వేల ఇళ్లను నిర్మించినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకవైపు జగనన్న కాలనీలు, నగరాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూనే, మరొకవైపు రాష్ట్రంలో ఐదంటే ఐదు గృహాలను నిర్మించినట్లుగా పార్లమెంటులో పేర్కొనడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయంగా లక్ష 80 వేల రూపాయలు అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బ్యాంకు నుంచి 35 వేల రూపాయలు అప్పు ఇప్పిస్తుందట అని అపహాస్యం చేశారు. ఇక కాలనీల లేఅవుట్ అభివృద్ధి కూడా ఎన్ జీ ఆర్ ఎస్ నిధులతోనే చేశారన్నారు. 30వేల కోట్ల రూపాయలతో స్థల సేకరణ చేసి, మూడు లక్షల కోట్ల సంపద సృష్టించినట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీలలో భాగంగా పట్టణ ప్రాంతాలలో ఇచ్చిన సెంటు స్థలం 7 లక్షల రూపాయలు పలుకుతుందట అని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. రాజమండ్రిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు తాటి చెట్టు లోతు గోతిలో ఉన్నాయని, వాటిని కప్పెట్టాడానికి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. కప్పెట్టడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, వాటిని కూడా మింగేయడానికి తమ పార్టీ స్థానిక నేతలు రెడీగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే మూడు లక్షల ఇళ్లకు గాను రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే , గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లకు తమ పార్టీ రంగులు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆ ఇళ్లకు చంద్రబాబు నాయుడు బిల్డర్ అయితే… జగన్మోహన్ రెడ్డి పెయింటర్ అని అపహాస్యం చేశారు. ఒకరు నిర్మించిన ఇళ్లకు మన పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబు నాయుడు అలా పెట్టుకోలేదనిగుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటికి రంగులు వేసి, సాక్షి దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ప్రజలు నమ్మరని అన్నారు. ఆ ఇళ్లను ఎవరు నిర్మించారో ఇళ్లలో నివసిస్తున్నారు వారికి తెలుసునని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తే, తమ ప్రభుత్వం కనీసం పదివేల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కష్టపడింది ఒకరైతే, బొమ్మ వేసుకునేది మరొకరంటూ ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 31 లక్షల ఇళ్ల నిర్మాణానికి వచ్చేసరికి హృదయం ఉన్నవారిని తెచ్చిపెట్టి కట్టి పెట్టమని చెబుతాడట అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. జగనన్న కాలనీలను పవన్ కళ్యాణ్ సందర్శించి, లోటుపాట్లను ఎత్తిచూపడం మంచి పరిణామంగా రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా జగనన్న కాలనీలను సందర్శించి లోపాలని ఎత్తిచూపితే ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని అన్నారు.

ఆరు నిమిషాల ప్రసంగంలో… 23 సార్లు సార్ అని సంబోధించడమా?
విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆరు నిమిషాల ప్రసంగంలో 23 సార్లు ” సార్ ” అని సంబోధించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. పెద్దలను గౌరవించడం తప్పులేదని కానీ ముఖ్యమంత్రి సాగిలపడడమే ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ లోక్ సభ సభ్యుడు హరిబాబులు ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా చేయమని ఎప్పుడు అడుగుతుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో పేర్కొనడం ద్వారా , జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అడగలేదని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు. ఇక ప్రతి పబ్లిక్ మీటింగులో కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఈసారి కూడా జనంగాలు అంటూ కొత్త పదాన్ని సృష్టించారని అపహాస్యం చేశారు. తెలుగు భాషలో ఆ పదం లేనే లేదని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం అది బూతు పదమని అంటున్నారన్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రతిపక్ష నేతగా ఆనాటి పాలక పక్షాన్ని ఉత్తర కుమారులతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాను చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ప్రధానిని అభ్యర్థిస్తూ హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడి ఉంటే బాగుండేది అన్నారు. పాతికమంది ఎంపీలను ఇవ్వండి… ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చేసింది ఏమిటని నిలదీశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కనీసం పోలవరం గురించి కూడా ప్రస్తావించకపోవడం విస్మయాన్ని కలిగించిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ను నిర్మిస్తామని కేంద్రమే హామీ ఇచ్చిందని ప్రధానికి గుర్తు చేయాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి దేనిని రఘురామకృష్ణంరాజు అన్నారు. పార్టీలకతీతంగా తమ స్నేహం కొనసాగనుందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీలకతీతంగా మీకు మీకూ స్నేహం ఉంటే ప్రత్యేక హోదా, పోలవరం గురించి ప్రశ్నించరా?అంటూ ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ప్రజలు ఎంతగానో ప్రేమించే నాయకుడు మోడీ అని, మోడీ పాల్గొన్న సభ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సభ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇక విమానాశ్రయం, రైల్వే జోన్ ప్రారంభించనున్నారని ముందే తొందరపడి పేర్కొన్న విజయసాయి రెడ్డి అపహాస్యం పాలయ్యారన్నారు. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో భాష ఉచ్ఛరణలో తడబడిన నారా లోకేష్ ప్రస్తుతం చక్కగా మాట్లాడుతున్నారన్నారు. తొలు త బాగానే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు భాష ఉచ్ఛరణలో దోషాలు కన్పిస్తున్నాయని అన్నారు.

వర్చువల్ గా సమాధానం చెప్పే అవకాశం కల్పించాలి
రాష్ట్రంలో సిఐడి పోలీసుల అరాచకాలు శృతిమించడంతో ప్రజలు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. వర్చువల్ గా అడిగితే సమాధానం చెప్పమా? ముష్కరుల వద్దకు వెళ్లి కొట్టించుకోవాలా?? అని కోర్టులకు విన్నవించుకోవాలని ఉందన్నారు.. తనని గతంలోనే చిత్రహింసలకు గురి చేశారని, ఇప్పుడు టీవీ5 మూర్తిని కూడా చిత్రహింసలకు గురి చేయాలన్నదే సిఐడి పోలీసుల పథకమని అన్నారు. తప్పులు చేయవద్దని నాలుగు మంచి మాటలు చెప్పినందుకు, దేవుని భూములు అమ్మకానికి పెట్టినప్పుడు అది తప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తే… ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రఘురామకృష్ణంరాజు కుట్ర చేస్తున్నారని తనని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. తాను నాలుగు మంచి మాటలు చెబితేనో, రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితేనో, లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు డి బి టి విధానం ద్వారా అందజేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం కూలిపోతుందా?అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిపై ఐపిసి 153 A సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. నాదెండ్ల బ్రహ్మం ప్రైవేటు కేసు వేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. పోలీసుల చేత చిత్రహింసలకు గురైన వారు, తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారు ప్రైవేట్ కంప్లైంట్ చేయాలని సూచించారు. ఇప్పుడు న్యాయం జరగకపోయినా, రానున్న ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తాను ఉంటానని, దొంగ పోలీసుల భరతం పడదామని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజలలోనే ఉంటున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజల మధ్యకు వెళ్తున్నారని, సిపిఐ సిపిఎం పార్టీలు ప్రజా పోరాటాలను చేస్తున్నాయన్నారు. ప్రజలకు ప్రతిపక్షాలు అండగా ఉన్నాయని, పోలీసుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రైవేటు కంప్లైంట్లు చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

ఎమ్మెల్యేలు మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లు ట్యాప్
ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆడియో సంభాషణ తనది కాదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారన్నారు. అసలు ఆ ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఆ వాయిస్ ఎవరిదో నిర్ధారించాల్సిన… సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అవంతి శ్రీనివాస్ కానీ, అతనితో సంభాషిస్తున్నట్లుగా చెబుతున్న కాలేజీ ఉద్యోగిని కానీ తమ సంభాషణను బయటపెట్టే అవకాశం లేదన్నారు. అంటే ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు దీని ద్వారా స్పష్టమవుతుందని అన్నారు.

అరబిందో ఫార్మాకు అరబిందో రియాల్టీకి సంబంధం లేదు
అరబిందో ఫార్మా కు, రాష్ట్రంలో పెట్టు బడులను పెట్టిన అరబిందో రియాల్టీ కి సంబంధం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అరబిందో ఫార్మా లిస్టెడ్ కంపెనీ అని దాంట్లో 48 శాతానికి పైగా షేర్ హోల్డర్లు ఉన్నారన్నారు. అరబిందో ఫార్మా ప్రమోటర్లలో ఒకరైన ఆ రాంప్రసాద్ రెడ్డి కుమారులు రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయన్నారు. అరబిందో రియాల్టీ, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ట్రైడెంట్ కెమ్ ఫర్, అడాన్ డిస్టలరీస్ కంపెనీల వెనుక ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీలో వేలకోట్ల మార్కెట్ కలిగిన శరత్ చంద్రారెడ్డి తుచ్చమైన, నీచమైన సారా వ్యాపారం లోకి వచ్చారంటే తాను నమ్మనని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే సారా వ్యాపారంలో శరత్ చంద్రారెడ్డి సంపాదించింది ఎంత?, పోగొట్టుకున్నది ఎంత అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 200 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చి పేపర్ల ప్రకారం నిందితుడుగా నిలిచారన్నారు. ఆడాన్ డిస్టలరీస్ ను వెనుక నుంచి నడిపిస్తున్నవారే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా వెనక ఉండి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE