అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు రావడం, 1995 ఆగస్టు సంక్షోభం గురించి మాట్లాడటంతో ఆనాటి సంఘటనలపై జోరుగా చర్చ జరుగుతోంది. లక్ష్మపార్వతిని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాజశేఖరరెడ్డి ప్లాంట్ చేశారని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. NTR లాంటి ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడటం కష్టం, అసలు ఆయన్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఏ గొడవా ఉండదు.. తెలుగు దేశం పార్టీనే ఉండదు అని YS, ఆయనతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు భావించడంలో వింతేమీ లేదు.
పైగా రాజశేఖరరెడ్డి చరిత్ర తెలిసిందే.. చేనేత వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త దగ్గర నుంచి మంగంపేట బరైటీస్ గనులను లాక్కోవడంతో మొదలుపెట్టి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి పాతబస్తీలో మతకలహాలు రేపెట్టడం, ఆపైన TRCCని ఏర్పాటు చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం, చంద్రబాబు ఎక్కడా కూడా పొరపాటున కూడా అనకపోయినా వ్యవసాయం దండగ అని అన్నాడని అదే పనిగా ఊదరగొట్టడం, మామకు వెన్నుపోటు అని చెప్పడం దాకా రాజశేఖరరెడ్డి చరిత్ర కుట్రలకు, కుతంత్రాలకు పెట్టింది పేరు.
రాజకీయ రంగంలో ఉన్న కుట్రలను NTR, 1984లో స్వయంగా అనుభవించిన తర్వాత కూడా లక్ష్మీపార్వతి తన జీవితంలోకి ఎందుకు వస్తోంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆ వచ్చిన వ్యక్తి.. ఇంటిని చూసుకోకుండా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఎందుకు అనుకుంటోంది? ఎమ్మెల్యేల్లో ఎందుకు అంత అసంతృప్తి వస్తోంది అన్న విషయాలను అంచనా వేసుకోలేకపోయారు. చివరకు 1995 ఆగస్టులో 171 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయకపోతే లక్ష్మీపార్వతి, కాంగ్రెస్‌తో కలిసిపోయే ప్రమాదం ముంచుకు వస్తోందని అంచనా వేసుకున్నారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించాలని చంద్రబాబును కోరితే ఆయన ఓ పట్టానా ఒప్పుకోలేదు.
మీరు ఒప్పుకోకపోతే అశోక్ గజపతి రాజు సారథ్యంలో తిరుగుబాటు చేస్తాం అని చెప్పారు. ఆఖరి ప్రయత్నంగా లక్ష్వీపార్వతిని దూరం పెట్టేలా NTRను ఒప్పిద్దామని చంద్రబాబు ప్రయత్నిస్తే, అందుకు NTR అంగీకరించలేదు. పైగా దూషణకు కూడా దిగారని తీగల కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లక్ష్మీపార్వతి కాకుండా NTR ఒక్కరే వైస్రాయి హోటల్‌కు రావాలని కోరితే.. అందుకు ఒప్పుకోకుండా ఆమెను వెంటపెట్టుకుని వచ్చారు. దీంతో అక్కడున్న కొంత మంది జనం ఆవేశంతో చెప్పులు వేశారు. చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి మీదనే కానీ, NTR మీద కాదని వేరే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత కాసేపటికి NTR వెళ్లిపోయారు. బయట ఇలా జరుగుతోందన్న విషయం, వైస్రాయ్ హోటల్ లోపల ఉన్న చంద్రబాబుకు తెలియదని కృష్ణారెడ్డి వెల్లడించారు.
ఇక ఆ తరువాత NTR.. చంద్రబాబును తిట్టడం, ఆవేశపడటం, ఆ ఆవేశంలో అనారోగ్యం పాలు కావడం జరిగాయి. కనీసం ఆ తరువాత అయినా NTR, లక్ష్మీ పార్వతిని దూరం పెట్టి ఉంటే 1996 నుంచి 1999 మధ్య కేంద్రంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ప్రధాని అయ్యే భాగ్యం కూడా దక్కి ఉండేది. కానీ లక్ష్మీ పార్వతి మైకం NTRను వాస్తవికంగా ఆలోచించేలా చేయలేదు. చంద్రబాబు కాదంటే నాడు TDP MLAలు అశోక్ గజపతి రాజును CMను చేసి ఉండే వారు. కాంగ్రెస్ కుట్రలను చంద్రబాబు తట్టుకున్నంతగా అశోకుడు తట్టుకుని ఉండే వారా? అన్నది ప్రశ్నార్థకమే.
చంద్రబాబు CM కావడం, TDP MPల మీద నాటి వాజ్‌పేయి ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి కూడా ఉండటం వల్ల తెలుగు నాట ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. అందులో సైబరాబాద్ అనే ఒక కొత్త నగరం నిర్మితం కావడం అన్నది మహా అద్భుతం. అంత స్వల్ప కాలంలో అంత పెద్ద నగరం, అంత ఆదాయం వచ్చే అవకాశం రావడం చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు.
నాటి చంద్రబాబు సమకాలికులు ఎవరూ ఈ అద్భుతాన్ని అంచనా వేయలేదు. 2004లో ఓడిన తర్వాత మాత్రం చంద్రబాబు క్రియేట్ చేసిన అద్భుతాన్ని తక్కువ చేసి చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎప్పుడో 1992లో దిగిపోయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1998లో వచ్చి హైటెక్ సిటీని కట్టారని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కట్టింది.. దానికి రిబ్బన్ కటింగ్ చేసిన రాజశేఖరరెడ్డి అని చెప్పుకున్నారు.
ఇంతగా తప్పుడు ప్రచారం చేసిన వారే మళ్లీ చంద్రబాబు, తన కులం వాళ్ల కోసం హైటెక్ సిటీని కట్టుకున్నారనే దుర్మార్గపు ప్రచారాన్ని కూడా చేశారు. అన్నీ వాళ్లే చెబుతారు. వినడానికి నమ్మడానికి కొంత మంది జనాలు ఉన్నారు కదా అనేది వాళ్ల ఉద్దేశం. బాలకృష్ణ చెప్పినట్లు అప్పటికి బాహుబలి లేదు కాబట్టి హైటెక్ సిటీని గ్రాఫిక్స్ అనలేదు. లేకపోతే ఇప్పుడు అమరావతిపై తప్పుడు ప్రచారం చేసినట్లే చేసేవారు. మెదడు పని చేసే వాడు, అన్నం తినే వాడు ఎవడైనా ఒక రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అని అంటారా?
ఒక చిన్న ఇంటిని నిర్మించుకోవాలన్నా ముందుగా ప్లాన్ గీసుకుంటాం. అడ్డదిడ్డంగా కట్టం కదా. అలాంటిది వెయ్యేళ్ల పాటు వర్ధిల్లాల్సిన రాజధానికి ప్లాన్లు, డిజైన్లు గీసుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు పోతారా? బుర్ర తక్కువ సన్నాసులే గ్రాఫిక్స్ అని అంటారు. జనాన్ని నమ్మించడానికి గ్రాఫిక్స్ అన్నారు కానీ చంద్రబాబు హైటెక్ సిటీ కంటే వంద రెట్లు శక్తిమంతమైన నగరాన్ని నిర్మించబోతున్నారని, ఆ నగరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరి అంచనాలకు అందనంతగా ఆదాయాన్ని ఇవ్వబోతోందనే సంగతిని మోదీ, KCRలు అర్థం చేసుకున్నారు.
జగన్‌ను ఎగదోశారు. కులాల కుంపట్లను రాజేశారు. ఇప్పుడు ఏమైంది? రాజధాని ఒకటేనా దెబ్బతిన్నది.. మొత్తం రాష్ట్రం దెబ్బతింది. ఏ ఊర్లో చూసినా దారుణమైన రోడ్లు. జనానికి నరకం కనబడుతోంది. రాష్ట్ర అప్పులను పది లక్షల కోట్ల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ అప్పుల ఊబిలో నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడటం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని.
– సుంకర వెంకట రమణ