Suryaa.co.in

Andhra Pradesh

20 ఏళ్ల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఫలితమివ్వని తొలి ‘సానుభూతి’ నాటకం

-చంద్రబాబు ‘అనారోగ్య’ జైలు జీవితంతో నిండిన నేటి కొత్త డ్రామా రక్తికట్టిస్తుందా?
-ఆంధ్రులు ఎప్పుడూ అమాయకులు కాదు! దోషులపై కనికరం చూపించరు!
-రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2003 సెప్టెంబర్‌ లో తన అస్తవ్యస్థ పాలనకు తొమ్మిదేళ్లు నిండాక నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జనం ముందు ‘సానుభూతి’ నాటకం ఆడే అవకాశం వచ్చింది. ఆ ఏడాది అక్టోబర్‌ ఒకటిన తిరుపతి–అలిపిరి వద్ద టీడీపీ అధినేత కాన్వాయి పోతుండగా అప్పటి పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల బృదం మందుపాతర పేల్చింది. ముఖ్యమంత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ పాలనలో జనం పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి అప్పటికే జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు 11 జిల్లాల మీదుగా సాగిన 1475 కిలోమీటర్ల పాదయాత్రను 68 రోజుల్లో పూర్తిచేశారు.

చేవెళ్లలో మొదలయి, ఇచ్చాపురంలో ముగిసిన రాజన్న పాదయాత్ర తెలుగు ప్రజలను చైతన్యవంతుల్ని చేసింది. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అనే జనవాక్యం ప్రచారంలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తనపై నక్సలైట్లు జరిపిన దాడిని రాజకీయంగా వాడుకోవాలని చూశారు చంద్రబాబు. అలిపిరి మందుపాతర పేలుడులో తనకు చాలా స్వల్ప గాయాలే తగిలినాగాని ఈ సంఘటనను తనపై జనం నుంచి సానుభూతి కురిపించేలా ‘మలుపు’ తిప్పాలనుకున్నారు. ప్రజల్లో ఉప్పొంగే ‘సానుభూతి’ని అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకుని మరో ఐదేళ్లు తన పాలన కొనసాగించడానికి గట్టి ప్రయత్నమే చేశారు.

అక్టోబర్‌ 1న జరిగిన అలిపిరి దాడి తర్వాత నెలా 14 రోజులకు 2003 నవబంర్‌ 14న ముఖ్యమంత్రి హోదాలో నారా వారు కేబినెట్‌ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా గారితో రద్దుచేయించారు. నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడి, స్వల్పంగా గాయపడిన కారణంగా ఏపీ ప్రజలు తనపై ‘సానుభూతి చూపించి’ సైకిల్‌ గర్తుపై ఓట్ల వర్షం కురిపిస్తారని అనుకున్నారాయన. ఈ అంచనాతో వెంటనే ఏపీ అసెంబ్లీ రద్దు ప్రక్రియను చంద్రబాబు పూర్తిచేయించారు. అయితే, శాసనసభ రద్దయిన ఐదు నెలలకు గాని (2004 ఏప్రిల్‌ 20, 26) తెలుగునాట ఎన్నికలు జరగలేదు.

టీడీపీ పాలనపై జనంలో వ్యతిరేకతేగాని, ఓటర్లలో సానుభూతి ఉప్పొంగిపోలేదు!
ఏపీ శాసనసభ పన్నెండో ఎన్నికల్లో టీడీపీ పాలనపై జనంలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తమైందేగాని, ఓటర్లలో సానుభూతి ఉప్పొంగిపోలేదు. ఫలితంగా తెలుగుదేశం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి నాయకత్వాన బరిలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీతో అధికారం కైవసం చేసుకుంది. టీడీపీ 1989లో పార్టీ స్థాపకుడు ఎన్‌.టి.రామారావు గారు ఉండగా మొదటిసారి పరాజయం పాలైనప్పుడు 74 సీట్లు గెల్చుకోగా, చంద్రబాబు గారి ఎనిమిదిన్నరేళ్ల అక్రమ పాలన తర్వాత ఈ పార్టీ కేవలం 47 స్థానాలే గెల్చుకుంది.

నారా వారి ఏలుబడి చివరి నాలుగేళ్లలో ఎంత అధ్వానంగా సాగిందో దీన్ని బట్టి అర్ధమౌతుంది. 2003 తర్వాత 20 సంవత్సరాలకు అంటే ఇప్పుడు 2023లో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో, ఒక అవినీతి కేసులో నిందితునిగా ఉండి కూడా– ఐదారు నెలల్లో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త నాటకానికి తెరతీశారు. ఏపీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కేసులో తీవ్ర అభియోగాలతో రాజమండ్రి జైలుకెళ్లిన మాజీ సీఎం బాబు తన వయసు, అనారోగ్యం అనే అంశాల ఆధారంగా న్యాయస్థానాల్లో బెయిలు సంపాదించారు.

అంతటితో ఆగకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అరెస్టు, నిర్బంధం, అనారోగ్యం కారణాలుగా చూపించి సాధించిన బెయిలు ఆధారంగా ఆంధ్రా ఓటర్ల సానుభూతి పొందాలని గట్టి పథకాలే రచిస్తున్నారు. తగిన కారణంతో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలోకి తీసుకోవడం వల్ల ప్రజల నుంచి బాబు గారికి ఎలాంటి మద్దతుగాని, సానుభూతి గారి రాలేదు. అయినా, తన పార్టీకి, తనకు, తన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగినట్టు చంద్రబాబు అండ్‌ కంపెనీ ఆడుతున్న నాటకాలను తెలుగు ప్రజలు చక్కగా అర్ధం చేసుకుంటున్నారు.

తానేదో సత్యహరిచంద్రుడు అయినట్టు, ఈ పురాణ పురుషుడిలా ఇతరుల కుట్రల వల్ల కష్టాల పాలైనట్టు ప్రజలను నమ్మించి వారి సానుభూతి పొందడానికి చంద్రబాబు గారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. విజ్ఞలైన రాష్ట్ర ఓటర్లు టీడీపీ తాజా నాటకం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో గ్రహిస్తున్నారు. అందుకే, బాబు గారి ‘సానుభూతి’ డ్రామా ఇక ముందు బాకా రక్తికట్టించి ప్రజలను ఆకట్టుకోలేదని ఏ టీనేజీ కుర్రాడిని అడిగినా చెబుతాడు.

LEAVE A RESPONSE