– పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసిన పాలక మండలి సమావేశం
– సంస్థ ఉన్నతికి విస్రృత కార్యాచరణ : ఆర్ పి సిసోడియా
విజయవాడ: ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఆప్కో ఉద్యోగులకు సైతం 2022 పిఆర్ సిని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది. బుధవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సంస్ధ ఛైర్మన్, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది.
చేనేత కార్మికుల అభివృద్దికి సంబంధించిన పలు విషయాలపై లోతుగా చర్చించిన పాలకమండలి కీలక అంశాలను అమోదించింది. ప్రధానంగా గత ప్రభుత్వ హాయాంలో ఆప్కో ఉద్యోగులకు పిఆర్ సి అమలు చేయకుండా కాలయాపన చేయగా, ప్రస్తుత బోర్డు ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఇప్పటి నుండి పెరిగిన జీతాలు మంజూరు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఆప్కో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పటికీ, సంస్ధ ఉన్నతికి ఒక పక్క ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తూ, మరోవైపు ఉద్యోగుల అంకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించామన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆప్కో శాశ్వత ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు. మరోవైపు ఉద్యోగుల సంపాదిత సెలవులో ప్రతి సంవత్సరం 15 రోజులు సెలవును నగదుగా మార్చుకునేందుకు సైతం పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.
ఆప్కో ఉన్నతికి సంబంధించి పలు నిర్ణయాలను సైతం పాలకమండలి ఆమోదించిందని సంస్ధ నిర్వహణా సంచాలకులు విశ్వ మనోహరన్ తెలిపారు. ఆప్కో పై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్ నిర్వహించిన అధ్యయనం నివేదికను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. సొసైటీలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.
విశ్వవ్యాప్త విక్రయాలను ప్రోత్సహించేలా ఆప్కో వెబ్ సైట్ ను ఆధునీకరించనున్నామని విశ్వ మనోహరన్ తెలిపారు. అప్కో , లేపాక్షి సంస్ధల ఉత్పత్తులు రెండు సంస్ధల షోరూమ్ లలో ఉండేలా తీసుకున్న నిర్ణయాన్ని పాలకమండలి స్వాగతించిందన్నారు. చేనేత, జౌళి శాఖ కమీషనర్ జి.రేఖారాణి మాట్లాడుతూ చేనేత కార్మికులకు మెరుగైన వేతనాలు లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
సమావేశంలో పాలకమండలి డైరెక్టర్లుగా ఉన్న నాబార్డు ఎజిఎం మిలింద్ చౌసల్కర్, ఆప్కాబ్ సిజిఎం నర్రా వెంకటరత్నం, ఎన్ సిడిసి ప్రాంతీయ సంచాలకులు స్నేహాన్హు గోస్వామి, ఆన్ లైన్ విధానంలో పరిశ్రమల శాఖ ఉప కార్యదర్శి నేతల వీర విజయ కుమారి పాల్గొన్నారు. ఆప్కో జిఎం నాగేశ్వరరావు, ఎజిఎంలు హరికృష్ణ, బేనహర్, సాయిబాబు, ఎఓ శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో ఉన్నారు.