ఊహించనిది ఏమీ కాదు.. అయినా కాస్త ముందుగానే పేలింది బాంబు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి సంచలన జోడీ చేయి చేయి కలిపి తెరపైకి రాబోతున్నట్టే..
ఒకే కుటుంబం…
అన్నదమ్ముల అనుబంధం..
ఒకే పార్టీ..ఒకే జెండా..
ఒకటే ఎజెండా..
అంటూ మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఇటు అధికార వైసిపి..అటు తెలుగుదేశం పార్టీతో ఢీ అంటే ఢీ అనబోతున్నట్టే..!
తమ్ముణ్ణి పొగుడుతూ..ఏమో వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తానేమో..పవన్ సిఎం అవుతాడేమో అని చిరంజీవి అన్న మాటలు ప్రకంపనలు సృష్టించాయి.రానున్న రోజుల్లో ఏర్పడనున్న పెను మార్పులకు ఆ మాటలు సంకేతమే..!
అగ్నికి ఆజ్యం అన్నట్టు.. ఈ ఇద్దరి వెనక ఇప్పటికే పవన్ పార్టీతో జత కట్టిన భారతీయ జనతా పార్టీ లేక తెలుగుదేశం ఏదో ఒకటి పక్కా..ఉంటే రెండూ కూడా..!
ఈ శక్తులన్నీ 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగితే రాష్ట్రంలో లెక్కలు మారే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉంటాయా..!?
తెలుగుచిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సాధించుకున్న మెగాస్టార్ చిరంజీవి అదే ఎన్టీఆర్ బాటలో రాజకీయాల్లోకి వచ్చి సేవ చెయ్యాలనే సంకల్పంతో 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీకి పురుడు పోశారు.తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో అరంగేట్రం చేసి ఎన్టీఆర్ సంచలనం సృష్టిస్తే సామాజిక న్యాయం అనే స్లోగన్ తో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఆయనపై అభిమానులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ ఘోర పరాజయాన్ని చవిచూశారు.ఆ కారణాలపై ఇప్పుడు విశ్లేషణ అనవసరం.
అయితే చిరంజీవి 2012లో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పెద్ద తప్పు చేశారు.అలా కాకుండా ఆనాడు కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు బయటి నుంచి మద్దతు ఇచ్చి ఉంటే అదో లెక్క..కానీ ఏకంగా విలీనం చేసి చిరంజీవి రాజకీయాల్లో తన ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నారు.అలా చెయ్యకుండా ఉంటే 2014 ఎన్నికల్లో కథ ఎలా ఉండేదో..
చిరంజీవి తర్వాత మళ్లీ సినిమా రంగంలో అంతటి ఊపు సాధించిన ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నలాగే పొరపాట్లు చేసి 2019లో దారుణంగా చెయ్యి కాల్చుకున్నారు.అయితే ఆయన తన అన్న చిరంజీవిలా కాకుండా తన ఉనికిని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎక్కడా ఏ దశలోనూ తన క్రేజ్ తగ్గకుండా నిలబెట్టుకుంటూ వస్తున్నారు..అదే సమయంలో తన ఇమేజ్ పోకుండా నటన కూడా కొనసాగిస్తూ తన కత్తికి అన్ని రకాలుగా పదును పెట్టుకుంటున్నారు. ఆయనకు గల మరో పెద్ద ప్లస్ పాయింట్ వాగ్ధాటి..దానికి తోడు యువతలో అన్నను మించిన ఫాలోయింగ్…ఒకరకంగా చెప్పాలంటే 2009 లో చిరంజీవి ప్రజారాజ్యానికి మించి 2019 లో పవన్ జనసేన దారుణ ఓటమి చవి చూసింది.అయినా ఆయన చిరంజీవిలా మనోధైర్యం కోల్పోలేదు..ప్రజలకు దూరం అయిపోలేదు.. మరొకరి పంచన చేరిపోలేదు..మళ్లీ తన రోజు కోసం ఎదురు చూస్తూ రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.. ఉద్దానం..రాజధాని..
దేవాలయాలపై దాడులు..ఉద్దానం..
రైతు సమస్యలు..ధరలు..
పోలవరం..ఏ సమస్య అయినా ముందు నిలబడి మాటాడుతున్నారు..అలాగే ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న తప్పుడు విధానాలు..తప్పుగా మాటాడితే అవతల ఉన్నది ఎవరైనా నిర్భయంగా నిలదీయడం ఆయన నైజం..ఇదే ఆయనను చిరంజీవిని మించి ప్రత్యేకంగా నిలబెట్టింది..అయితే పవన్ కళ్యాణ్ కు నిలకడ ఉండదనేది ఆయనపై ప్రధాన విమర్శ..ఆయన ఎప్పుడు ఎటు వెళ్ళిపోతారో చెప్పలేమన్నది ఆయన గురించి రాజకీయవర్గాల్లోనే గాక ప్రజల నుంచి కూడా తరచూ వినిపించే మాట..ఒకరకంగా పవన్ నైజం జనసేనకు ఎంత ప్లస్సో అంటే స్థాయిలో మైనస్ అని కూడా చెప్పక తప్పదు..
అదే సమయంలో దిగువ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరపకుండా 2019 ఎన్నికలకు పవన్ వెళ్ళడం పెద్ద దెబ్బ కొట్టింది…చిరంజీవి ఈ విషయంలో 2009 లో కొంత పర్వాలేదు అనిపించుకున్నా టికెట్లు ఇచ్చే వ్యవహారంలో పకడ్బందీగా వ్యవహరించక పోవడం ఆయనను బాగా దెబ్బతీసింది..ఈ విషయంలో ఆయన పూర్తిగా బావమరది అల్లు అరవింద్ పై ఆధారపడిపోవడం అత్యంత ఇబ్బందికర అంశంగా పరిణమించింది..ఈ కోణంలో తమ్ముళ్లు నాగబాబు..పవన్ కళ్యాణ్ కూడా మనస్తాపానికి గురైన విషయం కాదనలేనిది..
ఏదిఏమైనా చిరంజీవికి ప్రజల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన అలాగే ప్రజారాజ్యం ముద్రతో కొనసాగి ఉంటే కథ ఎలా ఉండేదో.. గతం గతః..!
అటు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి..చిరంజీవి నిష్క్రమణ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన రెడ్డి ప్రభంజనంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అల్లాడిపోగా అటు సుదీర్ఘ అనుభవం..అపారమైన క్యాడర్ బలం ఉన్న తెలుగుదేశం గజగజలాడింది.
ఇప్పుడు పవన్ అన్ని రకాలుగా ఎదిగాడు.సాక్షాత్తు ప్రధాని మోడీ ఆయనతో జత కట్టడం ఆసక్తికర పరిణామం.అది జనసేనకు ఎన్నికల సమయంలో కలిసి వచ్చే అంశం…
ఇక బిజెపి..పవన్ తో కలిసినా..తెలుగుదేశంతో జత కట్టినా ఈ రాష్ట్రంలో బిజెపి ఒక పార్టీగా బలం పుంజుకుని అధికారంలోకి రావడం కల్ల.. కాని జనసేనకు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ను తెర ముందు నిలబెడితే పవన్ బలం పుంజుకుని వైసిపిని బలంగా ఎదుర్కోగలుగుతారనేది నిస్సందేహం..మరి ఈ కాంబినేషన్ కు చిరంజీవి తోడైతే మరింత ఊపు వస్తుంది.ఇది రానున్న ఎన్నికల్లో ఒక ప్రభంజనంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..అయితే పవన్,బిజెపి ఆచితూచి అడుగులు వేయాలి..చిరంజీవి వీరితో జత కడితే ఖచ్చితంగా ఏ సమయంలో తెరపైకి రావాలనేది ప్రణాళికాబద్ధంగా జరపాలి.ఆ పరిణామం ఒక విస్ఫోటనంలా ప్రజల్లోకి వెళ్ళాలి..ఇప్పుడు ఉన్న పరిస్ధితులను బట్టి విశ్లేషిస్తే 2024 ఎన్నికల నాటికి ఒక శూన్యం ఏర్పడుతుంది అని ఇతమిత్థంగా చెప్పలేకపోయినా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.ఆ ప్రత్యామ్నాయం బిజెపి మాట ఎలా ఉన్నా బిజెపి..జనసేన,లేదా తెలుగుదేశం.. జనసేన… కాకుంటే మూడు పార్టీలు..కుదరకపోతే ఎటూ చిరంజీవి వస్తారు గనక అన్నదమ్ములు ఇద్దరే జతగా పోటీకి వెళ్తారో..ఇవన్నీ ఆసక్తికర ప్రశ్నలు..?
ఈలోగా జరగాల్సినవి చాలా ఉంటాయి..బిజెపి వరకు పెద్దగా ఉండకపోయినా జనసేన చెయ్యాల్సింది ఎంతో ఉంటుంది…బిజెపి కేంద్రంలో తిరుగులేని అధికార శక్తిగా ఉంది గనక జగన్ సర్కార్ గుండెల్లో ఎప్పుడు ఏ బాంబు ఎలా పేల్చాలనేది కమలం పార్టీకి కరతలామలకం అయిన వ్యవహారం..ఇక మిగిలిందంతా జనసేన వంతే..2019 నాటి తప్పులు పునరావృతం కాకుండా పవన్ జాగ్రత్త పడాలి..పార్టీ నిర్మాణంపై ఇప్పటి నుంచే జాగ్రత్తగా దృష్టి పెట్టాలి..చిరంజీవి ఎంట్రీపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి..సీట్ల సర్దుబాటు..ఎవరు ఎంత..రేపు గెలిస్తే ఎవరు ఏమిటి అనే కీలక విషయాల్లో ఖచ్చితమైన అవగాహన ఉండాలి..ఎంతటి వారికైనా ఢక్కి మొక్కీలు తినిపించ గలిగే బలమైన శక్తిగా జాతీయ స్థాయిలో ఉన్న బిజెపితో పవన్ ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది..అదే సమయంలో జనసేన అధినేత నేనే మోనార్క్ అనే విధానం నుంచి బయటకు రావాలి..మాటలు పదునుగా ఉండడం తప్పదు గాని కొన్ని సందర్భాల్లో మెచ్యూరిటీ లోపం ఉంటుంది.. దానిని అధిగమించాలి.. వీటన్నిటికి తోడు జనసేనపై..పవన్ కళ్యాణ్ పై..ఆమాటకొస్తే రేపు రాబోయే చిరంజీవిపై ఉండే కులం ఇమేజ్ ను కూడా దూరం చేసుకునే విధంగా బలమైన అడుగులు పడాలి.
2009లో ప్రజారాజ్యంపై..2019లో జనసేనపై కులం ముద్ర బలంగా పడినా కులం బలం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రెండు ఎన్నికల్లో అన్నదమ్ముల పార్టీలు రెండూ బలమైన శక్తిగా రుజువు కాలేకపోయిన విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి..
ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సన్నద్ధమైతే 2024..అన్నట్టు ఈలోగానే జమిలి ఎన్నికల పేరిట ముందుగానే యుద్ధం ముంచుకొచ్చినా అందుకు సిద్ధంగా ఉండి అనుకున్న ఫలితం సాధించే అవకాశం ఉంటుంది..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286