– పోలీసులు, ఐటీ మెరుపుదాడి
– అవి పొంగులేటి కంపెనీవే
– ముగ్గురిపై కేసు నమోదు
ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లకు డబ్బు పంచేందుకు ఖమ్మం రూరల్ మండల పరిధి, వరంగల్ క్రాస్ రోడ్డులోని శ్రీరామ్ నగర్, ఇంటి నెంబర్ 6-156/7/1 లో భారీ మొత్తంలో నగదు ఉంచినట్లు సమాచారంతో ఆదివారం రాత్రి 23:40 గంటల సమయంలో పోలీస్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో ఆ ఇంటికి వెళ్లగా, వారిని గమనించిన ఇద్దరు వ్యక్తులు వెనుక వైపు గోడ దూకి తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ ఇంటికి చేరుకున్నారు. వారందరూ ఇంటిలోకి ప్రవేశించారు. ఇంట్లో ఒక మహిళ ఉండటంతో ఆమె సమక్షంలోనే ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలో డబ్బులతో కూడిన మూడు బ్యాగులు కనుగొన్నారు. ఐటి శాఖ వారు ఇద్దరు మధ్యవర్తులను పిలిపించి పంచనామా నిర్వహించారు.
విచారణలో మహిళ తన పేరు చుండు కరుణ (48) అని, తన బంధువులు అయిన ప్రాజెక్ట్ మేనేజర్ జగ్గవరపు శ్రీకాంత్ రెడ్డి (రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), కాంగ్రెస్ పార్టికి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ పొంగులేటి ప్రసాద రెడ్డిలు అక్టోబర్ నెలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం కోసం ఓటర్లకు పంచడానికి 3 కోట్ల రూపాయలతో కూడిన మూడు సంచులను తమ ఇంట్లో ఉంచారని, కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆ డబ్బును తన ఇంట్లో పెట్టుకోవడానికి అంగీకరించినట్లు అమె వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి డబ్బు తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, పోలీసు పార్టీని చూసిన వారు ఇంటి నుండి తప్పించుకున్నారని అమె తెలిపారన్నారు. డబ్బులతో కూడిన బ్యాగులు, కాంగ్రెస్ పార్టీ తువ్వాలు, జెండాలను ఐటి అధికారులు పరిశీలించారు. ఆదాయపు పన్ను శాఖ వారు మధ్యవర్తుల సమక్షంలో డబ్బులు లెక్కపెట్టి రూ. 3 కోట్ల రూపాయలుగా నిర్ధారించి, మధ్యవర్తుల సంతకాలు తీసుకొని, డబ్బును స్వాధీనం చేసుకుని సంబంధిత పత్రాలను వారికి అందజేశారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి విచారణ చేపట్టి, చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు..