-ఈ ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం నిర్మాణం పూర్తి చేయడం ఖాయం
-వైఎస్ భాస్కర్ రెడ్డి కి బెయిలు ఖాయమే… ఆలస్యం అయినా న్యాయం జరుగుతుంది
-టిడిపి మేనిఫెస్టోకు మహిళలు బ్రహ్మరథం…
-సేద తీరే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తామని హామీ ఇస్తే వైకాపాకు ఒక్క సీటు కూడా దక్కదు
-మహిళల గురించి అభ్యంతర కరంగా మాట్లాడితే మహిళా లోకం తిరగబడుతుందని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
తమది లక్షల కోట్ల రూపాయల బడ్జెటని గొప్పలు పోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేవలం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోలవరాన్ని ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదా ?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకపోవడం అన్నది ముమ్మాటికీ ఈ ప్రభుత్వ వైఫల్యమేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు.
శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే, అయ్యా… ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు కావాలని జోలె పట్టుకొని అడుక్కుని ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చి ఉండేవారు. కేఏ పాల్ కు చెప్పిన విదేశాల నుంచి నిధులు తెచ్చి ఇచ్చి ఉండేవారేమో .
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకపోవడం అన్నది ఈ ప్రభుత్వ వైఫల్యమే… బటన్ నొక్కి అన్ని వర్గాల ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడమన్నది ఆయన ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. 2024 జూన్ మాసానికి పూర్తి చేయమని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షేకావత్ చెబుతుంటే, 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీ అయిన ఒక నాయకుడు 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని తొడలు కొట్టి సవాల్ చేశారు. కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రికి నోటి పారుదలే తప్ప, నీటి పారుదల గురించి తెలియదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పై విమర్శలు చేయడానికి ఆయనకు సమయం ఉన్నది కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతి గురించి మాట్లాడడానికి మాత్రం సమయం లేదని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వ పెద్దలు సర్వనాశనం చేశారు. తమకు కావలసిన వారికి కాంట్రాక్టును కట్టబెట్టేందుకే, రివర్స్ టెండ రింగ్ పేరిట నాటకాలు ఆడారు. పదివేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే పోలవరం నిర్మాణ పనులు, ఈ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఇప్పుడు అంచనాలు 15 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఈనాడు దినపత్రిక వార్తా కథనాన్ని రాస్తే, ఈనాడు దినపత్రికను కార్నర్ చేసే విధంగా సాక్షి దినపత్రికలో వార్తా కథనం రాయడం సిగ్గుచేటు.
గతంతో పోలిస్తే, పోలవరం నిర్మాణ పనుల అంచనాలు పెరిగింది నిజం కాదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కేవలం 41. 5 మీటర్లే నని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని 2024 జూన్ మాసం నాటికి పూర్తి చేయమంటే, 2025 జూన్ మాసానికి పూర్తి చేస్తామని చెప్పడం అర్ధరహితం. ముందస్తు ఎన్నికల అంటూ జరగకపోతే వచ్చే ఏడాది మే నాటికి ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిసిపోతుంది.
పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉంటే, గత ఎన్నికల్లో నేను ఓడిపోయి ఉండేవాడినేమో కానీ రాష్ట్రానికి మేలు జరిగి ఉండేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మిగిలిన 25% పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారనడం లో ఎటువంటి సందేహం లేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే రాష్ట్ర జి డిపి అనూహ్యంగా పెరుగుతుంది. కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల తెలంగాణ జిడిపి వృద్ధి చెందింది. పోలవరం ప్రాజెక్టు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే కాదు, రాష్ట్రానికి అంతటికి మేలు చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టా ప్రాంత స్థిరీకరణ చేపట్టవచ్చు. శ్రీశైలం నుంచి డెల్టా ప్రాంతానికి నీటి విడుదలను నిలుపు చేసి రాయలసీమ ప్రాంతానికి తరలించవచ్చు. దీనితో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. పోలవరం జలాలను ఉత్తరాంధ్ర వరకు వినియోగంలోకి తీసుకొని రావడం ద్వారా రాష్ట్రం బంగారుమయం అవుతుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
జగన్ బ్రాండ్లు కాదు… దేశంలోని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్లు అందుబాటులో ఉంచాలి
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మద్యం బ్రాండ్లను కాకుండా దేశంలోని ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్ల క్వార్టర్లను మద్యపాన ప్రియులకు అందుబాటులో ఉంచాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ మద్యం బ్రాండ్ల క్వార్టర్ సీసా 70 నుంచి 80 రూపాయలకే లభించేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను విపరీతంగా పెంచేసి, నాసిరకమైన ఊరు పేరు లేని బ్రాండ్లను విక్రయిస్తూ మద్యపాన ప్రియుల జేబులను గుల్ల చేయడమే కాకుండా, వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మినీ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. టిడిపి మేనిఫెస్టోలో మహిళలకే అన్నీ ప్రకటించిన చంద్రబాబు నాయుడు, పురుషులను విస్మరించారని కడప జిల్లా వాసి ఒకరు, నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం పాలసీని కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొనగా, మహిళలకు నచ్చదు కదా అని నేను సమాధానం ఇచ్చాను.
దానికి ఆయన స్పందిస్తూ… మహిళలకు అర్థమయ్యే రీతిలో మద్యం పాలసీ గురించి వివరిస్తే, వారేమి అభ్యంతరం చెప్పరన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాసిరకమైన మద్యం విక్రయిస్తూ, మద్యపాన ప్రియుల జేబులకు చిల్లు పెట్టడమే కాకుండా, వారి ఆరోగ్యాలతో ఆడుకుంటుంది. సంక్షేమ పథకాల పేరిట 20వేల రూపాయలు ఇచ్చి, మద్యం ద్వారా ఒక్కొక్క కుటుంబం నుంచి 50 వేల రూపాయలు లాగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ మద్యం దోపిడీని అరికట్టే విధంగా, నాణ్యమైన సేదతీరే మద్యం సేవించి పేదవారు
కొంత కాలం తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని సదరు వ్యక్తి చెప్పారు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, మద్యం సేవించే అలవాటును అంత త్వరగా ఎవరు మార్చుకోలేరు. అందుకే, నాణ్యమైన మద్యం ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తే, రానున్న ఎన్నికల్లో మహిళలతోపాటు, పురుషులు కూడా టిడిపికే ఓటు వేస్తారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదు. పులివెందులలోను బీటెక్ రవి గెలిచే అవకాశాలు ఉంటాయని కడప జిల్లా వాసిగా పేర్కొన్న సదరు వ్యక్తి వివరించారు. అయితే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడనని, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కి నేరుగా చెప్పలేనని, కానీ మీడియా ముఖంగా ప్రస్తావిస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.
హైకోర్టు తీర్పుని లోయర్ కోర్టులు అనుసరిస్తాయి
హైకోర్టు తీర్పులను లోయర్ కోర్టులు అనుసరిస్తాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం, స్టే విధించడం చేయకపోతే న్యాయవాదులు కూడా లోయర్ కోర్టులలో, హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, తమ క్లైంట్ కు ముందస్తు బెయిల్ ఇవ్వమని కోరుతారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి కి కూడా బెయిల్ లభించడం ఖాయమే.
హైకోర్టులో అవినాష్ రెడ్డికి బెయిల్ లభించగానే, సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే కోర్టు విచారణకు స్వీకరిస్తూ, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని నేను కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. కానీ ఎన్నో వాయిదాల అనంతరం నేను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు స్వీకరించి కొట్టివేశారు.
సాక్షి దినపత్రికలో ముందే తీర్పు వచ్చిన తర్వాత సీబీఐ కోర్టు తన తీర్పును వెలువరించింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరీ చేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీం కోర్టులో సవాలు చేస్తే ఆ తీర్పును పక్కన పెడుతుందన్నది నా విశ్వాసం. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించే లోపే భాస్కర్ రెడ్డి కి బెయిల్ లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు – నేడు కార్యక్రమం తరహా లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లకు లభించిన, లభించనున్న బెయిల్ మంజూరిని భావించవచ్చు.
బెయిల్ పొందిన ఇద్దరు నిందితులు అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మికి సేవలు చేసుకునే అవకాశం లభిస్తుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అనంతరం కొంతమంది విదేశాల నుంచి నాకు ఫోన్ చేసి బాధపడ్డారు. అయితే నిరుత్సాహ పడవద్దని వారిని సముదాయించాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ధర్మానికి న్యాయానికి టైం బాగాలేదు. ఈ దరిద్రులకు దూరంగా ఢిల్లీలో నేను తలదాచుకోవలసిన పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో ప్రస్తుతం నిరుత్సాహకర పరిస్థితులే ఉన్నాయి. సత్యం వద… ధర్మం చర అన్నట్లుగా పరిస్థితులు ఉన్నప్పటికీ, దేవుడు, ప్రకృతి అనేది ఉంది. విష్ణుమూర్తి ప్రత్యేకంగా 11వ అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. విష్ణుమూర్తి రకరకాల రూపాలలో మన మధ్యలోనే ఉన్నారు. న్యాయమనేది జరుగుతుంది. కానీ కాసింత ఆలస్యం కావచ్చు. అయినా నష్టం లేదు. రాష్ట్రంలో అడుగు పెట్టమని కొంతమంది నన్ను సవాల్ చేస్తున్నారు. అయినా నేను వారి సవాల్ స్వీకరించేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేను.
రాబోయే మంచి రోజుల కోసం నా వంతు కృషి నేను చేస్తున్నాను. ప్రస్తుతం చెప్పలేను చెప్పకూడదు. కానీ, భవిష్యత్తులో దాని ఫలితాలు కనిపిస్తాయి. వెనువెంటనే ఫలితాలను ఆశించడానికి అల్లోపతి వైద్యం చేయడం లేదు. ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలల వ్యవధిలోనే అన్యాయంగా వ్యవహరించిన వ్యక్తులకు బుద్ధి చెప్పి తీరుతామని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
జులై రెండవ తేదీ సుప్రీం కోర్టు వేసవి సెలవులు ముగియగానే వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశించవచ్చు. ఈ లోగానే హైకోర్టు తీర్పు పై సిబిఐ, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్న నమ్మకం నాకైతే లేదన్నారు.
మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడితే చెప్పుతో కొట్టండి
మహిళల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందిమాగదులు అభ్యంతరకరంగా మాట్లాడితే వారిని చెప్పుతో కొట్టాలని మహిళా లోకానికి రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు. విదేశాల నుంచి తిరిగి రాగానే మార్గదర్శి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజను అరెస్టు చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.
ముఖ్యమంత్రి వారి చేత ఇలాంటి దరిద్రపు రాతలు రాయిస్తున్నారేమో. ముఖ్యమంత్రి స్థాయిలో మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడించడం సిగ్గుచేటు. మార్గదర్శి సంస్థ ఎం డి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అంటే, అది కేవలం ఆమెను అవమానించినట్లే కాదు… యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్లు. సిఐడి అనుమతి తీసుకొని శైలజా విదేశీ పర్యటనకు వెళ్లారా? అని న్యాయవాది లలితా గాయత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
సిఐడి నమోదు చేసిన కేసు కోర్టులో పెండింగులో ఉండగా అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం శైలజాకు ఏముందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక నేరాభియోగ కేసుల లో బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ అనుమతి తీసుకోవాలి. ఆయన సిబిఐ అనుమతి తీసుకోవాలి కాబట్టి, మిగిలిన వారంతా దర్యాప్తు సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని కోరుకోవడం విడ్డూరంగా ఉంది .
జగన్మోహన్ రెడ్డి 32 కేసులలో A 1 నిందితుడని, ఆయనలాగే అందరూ A 1 నిందితులు కావాలని కోరుకోవడం కూడా కరెక్టు కాదు. వేసవి సెలవుల అనంతరం న్యాయస్థానం కార్యకలాపాలు ప్రారంభించిగానే సిఐడి జప్తులు, ఈ కేసు లేవి కోర్టు ముందు నిలబడవు. ఈ కేసులను న్యాయస్థానం కొట్టి వేస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో, అభివృద్ధిలో ముందంజలో ఉండగా, గత నాలుగేళ్లలో వెనుకంజ వేసింది. తెలంగాణలో అభివృద్ధి జరిగి ఆదాయం పెరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నష్టపోతుందని భావించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరికాదని గతంలో న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుండడం అభినందనీయమని అన్నారు.