‘ఏటి జేడెలు’ చదివిన్నబ్బా!
చేతికొచ్చిన ముద్ద మూతికాడకి రాకపోతే.. పచ్చని చెట్టు ఉన్నపళంగా మొదలంటా కూలిపోతే, కాని సుఖానికెళ్లి కాటికి కాళ్లు జాపితే.. నిన్నటి దాకా మన కళ్లముందు కదలాడిన మనిషి నిట్టనిలువునా కూలిపోతే.. ఏమవుద్ది? రాస్తే కథవుతుంది. లేకపోతే వార్తవుతుంది. వదిలేస్తే ఊళ్లో ముచ్చట్లవుతుంది.
రమణారెడ్డి చేయి తిరిగిన మంచి విలేఖరీ, సాక్షి ఉమ్మడి ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జనీ తెలుసు. మూలాలు మరవనోడనీ, మట్టివాసన చూసినోడనీ తెలుసు. నాలాగా ఊరి మనిషనుకున్నాగాని కథకుడని అస్సలు తెలియదు. వైఎస్ జగన్ మోహనరెడ్డి పాదయాత్రప్పుడు నేనో వారం ఒంగోల్లో రమణారెడ్డితో కలిసి కాపరం చేసిన గుర్తుంది. అప్పుడైనా ఈ పెద్దమనిషి తాను కథకుణ్ణని చెప్పలేదు. నేనూ అడగలేదు.
మా జర్నలిస్టుల్లో ఎక్కువ మందిమి మావార్త మేం చదువుకుంటామే గాని పక్కోడి వార్త కూడా చదవ్వం. వార్తే చదవనప్పుడు కథల్ని చదివే ఛాన్సే లేదు. ఒకవేళ ఆయనెప్పుడైనా చెప్పినా ఆ.. ఈయన కథేముందిలే అనే తుస్కారమున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
దీనికో బలమైన భ్రమో, భయంకరమైన మూఢ విశ్వాసమో బుర్రలోకి ఎక్కి ఉండడమూ కారణమై ఉండవచ్చు. కథంటే చేరా, కారా, రారా, కోకు, కేతులు తప్ప మిగతావేముందిలెమ్మనే ఓ మీడియోక్రసీ, ఓ సూడోఫిలాసఫీ మరికొంత హిపోక్రసీ నాటుకుపోవడం వల్ల కూడా బోలెడన్ని మంచి కథల్ని మిస్సయి ఉండవచ్చు. అలాంటి వాటిలో ఏటి జెడెలు ఒకటి. ఈ పుస్తకంలోని కథల్ని చాలాకాలం కిందటే రాసినవే. ఎక్కువ భాగం నేను పన్జేసిన పత్రికల్లో వచ్చినవే. అయినా చదవనందుకు కొంచెం సిగ్గేసింది. రమణారెడ్డికి ఫోన్ చేసి ఆమాటే చెప్పా.
ఇంత చలాగ్గా.. ఇట్లా కూడా రాస్తారా అన్పించింది. మన ఇళ్లలో ఈతి బాధలు రోజువారీ ఉండేవే. మొగుడు పెళ్లాలు, అత్తాకోడళ్లు, అబ్బాకొడుకులు, కొడుకులు కూతుళ్లు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చాడీలు చెప్పుకోవడం, రంకెలేసుకోవడం చాలా మామూలు విషయం. వాటిని మనలో ఎక్కువ మందిమి ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటాం. వాటినే కథలుగా మల్చాలని మాత్రం నాకెప్పుడూ అనిపించలా.
అదే రమణారెడ్డి మాత్రం వాటినే కథాంశాలుగా మార్చి రవి గాంచని చోటు కవి గాంచునన్నాడు. కరవు, కరోనా, కాడీ, మేడీ, ఎండ, వాన, చీకటి, వెన్నెల, చెట్టూ చేమలన్నింట్నీ ముడిసరకు చేసి తన భాషలో రాసుకున్నాడు. రాయలసీమ బతుకు చిత్రాన్ని వొడిసిపట్టాలని చూశాడు. మేథావులమని చెప్పుకునే వారితో ఎవర్నీ వదలకుండా ఎవరికి చెప్పాల్సింది వాళ్లకి చెప్పాడు.
వైతరణి కథలో…మేథావులమని విర్రవీగే వారిలో మార్పు సులభంగా రాదు. ఇప్పుడే వారిని నమ్మలేం. కొద్దికాలం భయం గుప్పిట్లో బందిద్దాం. మరి కొంతకాలం కరోనా మిషన్ కొనసాగిద్దాం.. అని చురకా వేస్తారు. మనుషుల స్వభావాన్ని బయట పెడతారు. మొత్తం 12 కథలు ఓ ఎత్తయితే ప్రజారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, రమణారెడ్డి పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన కొండపొలం నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి , మా పాత్రికేయమిత్రుడు పాలగిరి విశ్వప్రసాద్ ల ముందుమాటలు మరోఎత్తు.
ఏమైనా నేనూ రమణారెడ్డితో పోటీ పడాలనుకుంటున్నా.. రెండో కథల పుస్తకం తెచ్చేలోగా నేనూ కథలు రాయాలనుకుంటున్నా.. థ్యాంకూ రమణారెడ్డి.