పల్లెదుఃఖం తెలిసిన కథకుడు బిజివేముల

ఒక నిర్దిష్ట ప్రాంతాన్నించి వచ్చిన కథకుడు తన కాళ్ల కింది నేలకు సొంత గొంతుక తొడిగి, దాని అనుభూతుల్ని కథలుగా చెప్పుకొంటూ పోతాడు. రాయలసీమ మెట్ట నేలల్లోంచి పుట్టుకొచ్చిన కథకులు ఎక్కువగా ఇక్కడి భూమి దుఃఖాన్ని గురించే గొంతెత్తారు.

కె.సభా, పులికంటి, కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, పి. రామకృష్ణ, సింగమనేని నారాయణ లాంటి కథకులు చిన్న కథను పల్లె మార్గం పట్టించారు. నాగలి దుక్కుల్నీ, రైతు చెమటల్నీ, అప్పుడప్పుడు రాలే పుల్లజినుకుల్నీ, కమ్ముకొచ్చే కరువుల్నీ, రైతు ఆత్మహత్యల్నీ కథలుగా మలిచి ఇక్కడి మట్టివేదనను లోకానికి పరిచయం చేశారు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళమే తర్వాతి తరానికి చెందిన స్వామి, దేవపుత్ర, పాలగిరి, దాదాహయాత్, ఓబుల్ రెడ్డి, బత్తుల ప్రసాద్, నేను వగైరా కథక మిత్రులమంతా.

ఆస్తులకు వారసులు లేకున్నా పర్లేదు. కథకులకు వారసులు ఉండాలని బలంగా కోరుకునే వాడిని నేను. ఒక కథ ఆగిపోయిన చోట కొనసాగింపుగా మరో కథ పుట్టుకు రావాలి. ఒక తరంలో సమస్యగా ఉన్న విషయం తర్వాతి తరంలో కూడా సమస్యగానే మిగిలివుందో, సమాధానం దొరికిందో తెలియాలంటే ఒకరి వెనుక ఒకరు కథకులు తయారుకావటం తప్పనిసరి. నాకైతే ప్రతి ఇరవై మైళ్ళ పరిధిలో ఒక కథకుడు పుట్టుకు రావాలని కోరిక. భాష పరిధి తెలుస్తుంది. మాండలికాల శక్తి బైటబడుతుంది. సంప్రదాయాల రహస్యాలు ఎరుకకొస్తాయి. ఒకరు అలిసిన చోట మరొకరు కొత్తగా లేచి సాగించిన నడకలు స్పష్టంగా కనిపిస్తాయి.

‘ఏటి జేడెలు’ కథల సంపుటి లోని కథలన్నీ మా కాడిగట్లల్లోని కథలే. మాపక్కూరి మనుషుల బతుకు చిత్రాలే. సగిలేరు, ఏటిజేడెలు, యేటి దొరువులు, ముగ్గుపిండి గనులు, ఇసుక చెలిమలు, జ్యోతివాగు, రేగడి చేలు, కనికెల గుండం, శివుని గుడి, పెనుగోని బండ, నరసాపురం చేలు వగైరాలన్నీ నాకు తెలిసిన తావులే. కథల్లోని పాత్రలు దాదాపుగా నేనెరిగినవే. ఇంచుమించు జరిగినవే. కథలు రాసిన రమణా రెడ్డి కూడా చిన్నతనాన్నుంచి నాకు తెలుసినవాడే.

వానలు కురిసినప్పుడు పొలాల్లో నీళ్లన్నీ పల్లానికి సాగి వంకల్లో, వాగుల్లో, ఏటిప్రవాహాల్లో కలుస్తుంటాయి. నీటి నడక ధాటికి నేల కోసుకుపోయి లోతు కాలువలుగా ఏర్పడి సన్నని నీటి వూటలుగా మారి జోము దిగుతూ ఉంటాయి. బురదతో కూడిన ఆ కాలువల్ని ‘జేడెలు’ అంటారు. రైతు ఏమారితే ఏటిదరి పొలాలన్నీ జేడెలుగా మారిపోతాయి. సారవంతమైన మట్టి కొట్టుకుపోయి సన్నని గులకరాళ్లు తేలి సదరు పొలమంతా వ్యవసాయ యోగ్యం కాకుండా పోతుంది. సమర్థుడైన రైతు తన పొలం జేడెలు పడకుండా సుద్ధమట్టి కట్టలు పోయించి గానీ, రాతి కట్టకం కట్టించి గానీ, కలబందలు మొలిపించి కట్టవ తయారు చేసి గానీ కాపాడుకుంటాడు.

ఈ కథా సంపుటిలో చాలా జీవితాలు కష్టాల వరదల ధాటికి జేడెలు పడ్డాయి. సారం కొట్టుకుపోయి బతుకులు గులకరాళ్ల మయమయ్యాయి. లచ్చిందేవి, మొద్దు నారాయణ, సరోజ, ఓబుల్ రెడ్డి, హేమ లాంటి వాళ్లు ధైర్యం కోల్పోకుండా జేడెలు పూడ్చి గెట్లు పోసి బతుకు పొలాన్ని ఏటిపాలు కాకుండా కాపాడు కొన్నారు. అందుకే వాళ్లు కథల్లో పాత్రలు అయ్యారు.

ఈ కథల్లోని పాత్రలన్నీ నాకు తెలుసు గాని కథలు తెలియవు. స్థలాలన్నీ తెలుసు గాని అక్కడ జరిగిన సంఘటనలు తెలియవు. కథలు చదివిన తర్వాత కథల్లోని మనుషులు నిజంగా ఎదురుపడినప్పుడు వాళ్ళు కొత్తగా కనిపించేవారు.

‘మావూరి దెయ్యం’ కథ లోని మొద్దు నారాయణ మావూరివాడే. మేమాయన్ను మూగి నారాయణ అంటాము. పాపిరెడ్డిపల్లెతోట సాగుజేసేది తెలుసు గానీ దాని వెనక అన్ని కష్టాలు ఉండేది తెలియదు. నీళ్ళతడి కోసం రాత్రుళ్ళు వెళ్ళేది తెలుసు గానీ దెయ్యమై అందర్నీ భయపెట్టింది తెలియదు.

పేరు మార్చినప్పటికీ సరోజ గురించి తెలుసు. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, మొగుడ్ని వదిలేసి కోరుకున్న వాడి వెంట వెళ్లిపోయింది తెలుసు. బిడ్డను బతికించుకోవడానికి, తను బతకడానికి ఆమె చేసిన సాహసం తెలీదు. తల్లి చనిపోయినప్పుడు అంత దూరం నుంచి వచ్చి దొంగచాటుగా చూసి వెళ్ళిన తెగింపు నాకు తెలీదు. బిడ్డ కోసం ఆత్మహత్య ఆలోచనను పక్కనపెట్టి ధైర్యంగా అడుగేసిన సంగతి తెలీదు.

‘ఆడపిల్ల’ కథలోని కొండారెడ్డి నాకు బాగా తెలిసిన వాడే. మంచి కోడిగపు మనిషి. బీడీ గుప్పుగుప్పున పీలుస్తూ, వచ్చే పోయే వాళ్లతో చెతుర్లాడుతూ వుండేవాడు. అతను కూడా ఆడపిల్లల బరువు మోయలేక సతమతమైన వాడే. కానీ ఎందుకో పెళ్లికి వెళ్లిన రాత్రి సుఖంగా పడుకోడానికి కేవలం పరుపు మంచం కోసం మరో ఆడపిల్ల తండ్రికి లేనిపోని ఆశలు చెబుతాడు. వినడానికి నవ్వు తెప్పించేట్లుగా వున్నా, ఏ చిన్న ఆశ దొరికినా పిల్లపెళ్లి అనే సముద్రాన్ని యీదేందుకు ప్రయత్నించే ఆ తండ్రి ఆరాటం పట్ల బాధ కలుగుతుంది. కొండారెడ్డి మీద కోపం రగులుతుంది. అతని కోడిగం వెనక ఇంత నిర్దయత ఉండేది నాకు తెలీదు.

భూమి కష్టసుఖాల్ని కథలుగా కొనసాగించేందుకు ముందు తరానికి వారసులు ఉండాల్సిందే. ఆ పని రమణారెడ్డి చేయగలిగాడు. భూమి దుఃఖాన్ని కథలుగా రాయగలిగాడు. నిన్నమొన్నటి దాకా దేవుడు దయజూపక పోవడం వల్లే కరువులొస్తున్నాయని, అప్పులు తీర్చలేక అవమానాలు పడటం కంటే ఆత్మహత్యలు మేలని, ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా సరే అధికారాన్ని సంపాదించటమే మగతనమని- ఇలాంటి పాతతరపు భావాలనుంచి ఈతరం వాళ్ళు బయటపడుతున్న విషయాన్నీ, వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చిన క్రమాన్ని ‘ఒక రైతు ఆత్మహత్య’, ‘మారిన చిత్రం’ కథల ద్వారా చెప్పాడు. కొత్తతరం ఆశల్నీ, ఆలోచనల్నీ కథలుగా మలిచాడు. ఇతర ప్రాంతాలలాగే మా పల్లెల్లో కూడా ఆశావహమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయనే విషయాన్ని గుర్తించి కథలు రాస్తున్నాడు.

మా తర్వాతి తరం కథలు ఇవి. మా కథలకు వారసత్వపు కథలు. వృత్తిరీత్యా నగరాల్లో ఉంటున్నప్పటికీ రమణారెడ్డి కాళ్లు ఇప్పటికీ పల్లె మట్టిలోనే పాతుకొని వున్నాయి. కాబట్టే అతను తడారిపోలేదు. తడారి ఎడారిగా మారలేదు. మనిషి లోపలికి వెళ్లి వెదకే మనిషితనాన్ని కోల్పోలేదు. అందుకే ‘ఊరికి బొయ్యొచ్చిన’, ‘మా ఊరి దెయ్యం’, ‘ఒక రైతు ఆత్మ కథ’, ‘అంతరం’, ‘ఆడపిల్ల’, ‘సరోజ’ వగైరా కథలు రాయగలిగాడు.

వాస్తవానికి రమణారెడ్డి నుంచి నేనాశించింది యీ కథలు మాత్రమే కాదు.
నాకు లేని ఉద్యమ జీవితం అతనికుంది.
నాకు లేని పాత్రికేయ జీవితం అతనికుంది.
నాకు లేని స్థానికేతర జీవితానుభవం అతనికుంది.
యవ్వన ప్రాయమంతా ఉద్యమాలతోనే గడిపాడు. జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి ఉద్యమ నాయకత్వం కాకున్నా తనున్న ప్రాంతంలోని ప్రజాసమస్యల సాధన కోసం ప్రభుత్వాధికారుల్నీ, ప్రభుత్వాన్నీ, రాజకీయ నాయకుల్నీ నిలదీయడంలో ఎప్పుడూ ముందుండే వాడు. తొంబయవ దశకంలో ‘తెలుగుగంగ సాధన సమితి’ ఏర్పాటు జేసి జిల్లా స్థాయి ఉద్యమం కూడా నడిపాడు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి బిజివేముల వీరారెడ్డిని ఢీకొన్నాడు. అడ్డగించాడు. నిలేశాడు.

హామీ ఇచ్చే దాకా పోనిచ్చేది లేదంటూ దిగ్బంధనం చేశాడు. లాఠీలు విరిగేలా కొట్టించుకొన్నాడు. జైలుపాలయ్యాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. ప్రభుత్వ దమనకాండ ప్రత్యక్షంగా తెలిసినవాడు. అణచివేత తెలిసినవాడు. బెదిరింపులు తెలుసు. ఎదిరింపులు తెలుసు. పోరాటం తెలుసు. ఈ చర్యలన్నింటినీ అక్షరీకరించడం తెలుసు.

ఆ అక్షరాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తెలుసు. చాలామంది కథకులకు లేని అనుభవాలున్న వాడు. అతని అనుభవాలన్నీ కథలుగా రావలసిన అవసరం ఉంది. రాయలసీమ నుంచి వచ్చిన కథల్లో రైతు కన్నీళ్ల గురించి చెప్పిన కథలే తప్ప రైతు కన్నెర్ర చేసిన కథలు చాలా తక్కువ. ఆ లోటు బిజివేముల రమణారెడ్డి తీర్చవలసి వుంది.

ప్రత్యేక రాష్ట్రం గురించిన ఆలోచనలతో ఈనాటి సీమ యువగళాలు ఎగిసి పడుతున్నాయి. వాటి ప్రతిధ్వనుల్ని బిజివేముల తన కథల్లోకి తీసుకు రావాలసిన అవసరం ఉంది. జిల్లాస్థాయి పాత్రికేయ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి అన్ని ప్రాంతాల భూమి దుఃఖం అతనికి తెలుస్తూ ఉంటుంది. కథకునిగా తను మరింత విస్తృతం కావాలసి ఉంది.

కథలు సహజంగానే ఉన్నప్పటికీ, సరళంగానే రాసినప్పటికీ, కొన్ని కథలు ‘చెప్పిన విధానం’ వల్ల కొత్తగా అనిపించాయి. ‘ఊరికి బొయ్యొచ్చిన’ కథలో పాడుబావి, బొక్కెన, వేపచెట్టు వగైరాలతో మాట్లాడించడం వల్లా, ‘ఒక రైతు ఆత్మకథ’లో రైతు ఆత్మతో మాట్లాడించడం వల్లా ఆ కథలకు బలం పెరిగింది.

ఈ కథలన్నీ చదివిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది – రాయలసీమ ప్రాంతపు బతుకు చిత్రాల్ని స్పష్టమైన గొంతుకతో బైటి ప్రపంచానికి తెలిపే మరో పదునైన స్వరం పుట్టుకొచ్చిందని.

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
బాలరాజుపల్లె
కాశినాయన మండలం
కడప జిల్లా

Leave a Reply