దశాబ్ద కాలంలో నీచ స్థితికి దిగజారిన ఉన్నత విద్య

దశాబ్దం కిందట దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నేడు పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్లు కనిపిస్తుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇంతటి అధోగతికి కారకులెవరు? రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లో విద్య ప్రమాణాలు నీచ స్థితి చేరుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల వీసీల నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. 2014 సంవత్సరంలో పూర్వపు వీసీల కాలపరిమితి తీరిపోతే రెండు సంవత్సరాల వరకు, ఐఏఎస్‌ ఆఫీసర్లు ఇంచార్జి వీసీలుగా విశ్వవిద్యాలయాల పరిపాలన నత్తనడకన సాగింది. 2016లో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో వీసీల నియామకం జరిగి , వీరి కాలపరిమితి 2019తో ముగిసింది. మళ్లీ ఇంచార్జి వీసీల పాలనతో ఉన్నతవిద్య ఎదుగు బొదుగు లేకుండా సాగింది.

రెండేళ్ల తర్వాత 2021 మే నెలలో పూర్తికాలపు వీసీల నియామకం జరిగింది. యూనివర్సిటీ నిధుల వినియోగంలో జరిగిన అవకతవకల సందర్భంలో కానీ, హేతుబద్ధత లేని తాత్కాలిక నియామకాలు జరిగినప్పుడు కానీ, స్పందించకుండా మౌనంగా ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వివాదం జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి నుంచి, కనీస స్పందన లేదు. ఏదైన ఒక ప్రభుత్వ శాఖలో సమస్య వస్తే, వివాదం ఏర్పడితే, అవినీతి జరిగితే సదరు శాఖకు సంబంధించిన మంత్రి వెంటనే స్పందించడం పార్లమెంటరీ సంప్రదాయం.

పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పేపర్‌ లీకేజీ సందర్భంలో.. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేసిన చరిత్ర మనకు ఉంది. మొన్నటికి మొన్న గ్రూప్‌–1 పేపర్‌ లీకేజీ విషయంలో మంత్రిగా కేటీఆర్‌ మాట్లాడారే కానీ, అధికారులు నోరు విప్పలేదు. మరి తెలంగాణ యూనివర్సిటీ విషయంలో మాత్రం మౌనం ఎలా? అధికారుల అతి జోక్యం ఎందుకు?

అన్ని విశ్వవిద్యాలయాలు అనేక సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఐఏఎస్‌ అధికారుల అవాంఛనీయ జోక్యం వలన విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గత పాలకులు ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యను సంక్షోభంలోకి నెట్టి, విద్యార్థులు అనివార్యంగా కార్పొరేట్‌ విద్య వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వ విధానాల రూపకల్పన చేశారు.

ఇవ్వాల్టి సందర్భంలో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సంక్షోభంలోకి ప్రవేశిస్తున్నాయంటే, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు మార్గం సుగమమైనట్లేనని కొత్తగా చెప్పనక్కర్లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలోనైనా , విద్యారంగం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విజన్‌, మిషన్‌ ఉండేటట్లు సమాజం ఒత్తిడి చేయవల్సి ఉంది.

గత పదిహేను సంవత్సరాలుగా అధ్యాపక నియామకాలు చేపట్టకపోవడం, రీసెర్చు గ్రాంటులు పూర్తిగా నిలిపివేయడం, పరిశోధనలు పక్కదారి పట్టి చివరికి అధఃపాతాళానికి చేరింది. వంద సంవత్సరాల ఘన కీర్తి గడించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట 45 కు పైగా విభాగాలు 650 పైచిలుకు అధ్యాపక్షులు ఉండే విశ్వవిద్యాలయం ఇపుడు కేవలం 24 భాగాలు పైచిలుకు అధ్యాపకులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200 కోట్లకు పైగా రెసెర్చ్ గ్రాంట్లు రాలేదు. 2014 లో రెసెర్చు ఎంట్రన్సు పరీక్ష నిర్వహించి 2015 లో ఫలితాలు విడుదల చేసి 2016 లో లిస్టు వేసి, 2017 లో అడ్మిషన్ చేపట్టిన ఘనత మన విశ్వవిద్యాలయానికి దక్కుతుంది.

నగరం నడిబొడ్డున ఉన్న ఉస్మానియా పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో వెలసిన కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ మరో వైపు వీటిని శాశ్వితంగా మూసివేసేందుకు కుట్ర జరుపుతున్నారు.

తెలంగాణాలో పెద్ద ఎత్తున ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా సీట్లు పెంచుకొని, బహుజన వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయకుండా లక్షలలో ఫీజులు కట్టించుకొని పేద మధ్యతరగతి ప్రజలను నిండా ముంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐఐసిటి, ఎన్జిఆర్ఐ, సిడిఎఫ్డి, జిఐఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, జీనోమ్ ప్రాజెక్ట్ అన్నింటిలో శ్మశాన ప్రశాంతత నెలకొంది. యూజీసీ నిధులు, కేంద్ర సంస్థల నుంచి నిధులు ప్రాజెక్టులు లేక నిరసించాయి.

దశాబ్దం క్రితం ఉన్న ఫార్మా కళాశాలల్లో ఇప్పుడు పది శాతం కూడా లేవు. ఫార్మా హబ్ అని చెప్పుకుంటున్న నాయకులు , మూతపడిన ఫార్మా కంపెనీలను పునరుద్ధరించే పని చేపట్టలేదు. ఎంసెట్ తో లీకైన ప్రస్థానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చివరికి జెఇఇ మాస్ కాపీయింగ్ వరకు విరాజిల్లుతుంది. డ్రగ్ నార్కోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగింది. మద్యపానం వినియోగం దాదాపు రెట్టింపయింది.

పంచాయితీ కార్యదర్సుల సమ్మె, అంగన్వాడీ, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం, కేవలం 130000 డబుల్ బెడ్ రూములు కట్టించి ఇళ్లులేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టినట్లు ప్రచార ఆర్భాటాలకు పరిమితమైనది. ప్రభుత్వ ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని మరియు నేచురోపతి కళాశాలల్లో పట్టుమని ఐదుగురు శాశ్వత అధ్యాపకులు లేరు.

కుక్కలు స్వైర విహారం చేస్తున్న, చెరువులు కబ్జాకు గురైన, చిన్నపాటి వర్షాలకు రహదారులు వరద కాలువులను తలపిస్తున్నా, పారిశుధ్యం పడకేసినా, నాళాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నా నగరం ఎట్లుండే – ఎట్లాయే అని ప్రచారాలకు పరిమితమైనారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా కార్పొరేటు ప్రైవేటు కళాశాలలకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించలేదు, కీలకమైన పర్యాటకాన్ని పూర్తిగా విస్మరించారు.

ఔటర్ రింగ్ రోడ్డు అనుకోని ఉన్న హైవే లపై బ్రిడ్జి పనులు నత్తనడక జరుగుతున్నా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. సైబర్ నేరాలు, బెట్టింగు, అమ్మాయిలపై భౌతిక దాడులు ఎక్కువవుతున్నాయి, యువత పెడ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు ప్రభుత్వ కొలువుల ఎండమావిగా మారాయి. దళిత బహుజన పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు, సర్కారు బడులలో సకల వసతులు అని ప్రచార హోర్డింగులు ఉన్నాయి.

వచ్చే వారం బడులు ప్రారంభించనున్నారు దాదాపు పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, కీలక పరీక్షా విభాగం, కాన్ఫిడెన్షియల్ సెక్షన్, ముద్రణ విభాగాలలో కూడా శాశ్విత నియామకాలు లేక పదిహేను సంవత్సరాలవుతుంది.

దొంగ సర్టిఫికెట్లు, నకిలీ విశ్వవిద్యాలయాలకు కొదవే లేదు. రెండు లక్షలకు పైగా ప్రైవేటు కళాశాలల అధ్యాపకులకు భరోసా లేదు. అసంఘటిత కార్మికుల కన్నా హీనంగా ఉన్నాయి వీరి బతుకులు. కొన్ని కళాశాలల్లో నెలల తరబడి జీతాలు ఇవ్వకున్నా విద్యా మంత్రి పట్టించుకున్న పాపాన పోలేదు. విద్య ప్రభుత్వ ఆధీనంలో లేకుండా చేస్తూ నైపుణ్యం లేని సమాజాన్ని నిర్మిస్తున్నది. చైతన్యం పొందిన తెలంగాణ వాదులు, పౌర ప్రజా సంఘాలు మౌనం వహిస్తే బహుజనులకు విద్యను దూరం చేసినట్లు.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply