-బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యల ద్వారా, ఇక జగన్ ప్రభుత్వానికి అప్పు పుట్టనట్టే లెక్క…
-అప్పు పుట్టకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో జగన్… అసెంబ్లీని రద్దు చేయడం మినహా మరో దారి లేదు
-తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు ఖాయం
-అందుకే విరివిగా దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ … ప్రతిపక్షాలు అప్రమత్తంగా లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం
-రాష్ట్రంలో స్కీములు లేవు అన్ని స్కాములేనన్న నడ్డా
-రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను అధోగతి పాలు చేసిన జగన్ ప్రభుత్వం
-అమరావతి కే తమ సంపూర్ణ మద్దతన్న నడ్డా…
-హవ్వ…రాజకీయ విమర్శలు కాకుండా నడ్డా జీ పై వ్యక్తిగత విమర్శలా పేర్ని నాని గారు…! ఇదెక్కడి చోద్యం
-రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్లు ఆదా చేశామని చెప్పి… 7500 కోట్లు ముంచిన జగన్ ప్రభుత్వం
-లోకేష్ పాదయాత్రకు మాదిరే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆటంకాలా?
-ప్రజల మధ్య ప్రతిపక్షాలు ఉంటామంటే స్వాగతించాల్సింది పోయి ఆంక్షలు విధిస్తారా?? ఇదెక్కడి విడ్డూరం…
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమే. ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశాలు కనిపించడం లేదు. అప్పు లభించకపోతే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేరు. దీనితో చేసేది లేక, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే ఆయన ముందున్న మార్గం. ఆగస్టులో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తో పాటే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముందస్తు ఎన్నికల కోసమే మా పార్టీ ప్రభుత్వం చాప కింద నీరులా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయిస్తోంది . గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాగే విశాఖపట్నం తూర్పు లోను ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులకు చెందిన 30 వేల ఓట్లను అక్రమంగా తొలగించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇండ్లలో లేని వారి పేరిట దొంగ ఓట్లను నమోదు చేస్తూ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను ఎత్తివేస్తున్నారు.
ఈ విషయంలో ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండి ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే. ప్రజలు కూడా ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది పరిశీలించి, ఒకవేళ లేకపోతే… వెంటనే నమోదు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, నిర్ణీత సమయానికే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని మా పార్టీ నాయకత్వం ప్రతిపక్షాలను మభ్య పెట్టే ప్రయత్నాన్ని చేస్తోంది. ఈ లోగానే దొంగ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేసి, అసెంబ్లీని రద్దు చేయాలన్నది మా పార్టీ నాయకత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది.
అసెంబ్లీ రద్దయిన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. గుళ్ళల్లో ఉండవలసిన వారు ప్రసాదాలను పట్టుకొని, పూజారులను వెంటబెట్టుకొని ఢిల్లీలో ఎన్నికల కమిషన్ వద్దకు, న్యాయమూర్తుల ఇండ్లకు వెళ్లి వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగవంతుడి చిత్రపటాలను బహుకరిస్తూ, ఢిల్లీ పెద్దల మెప్పును పొందేందుకు ఆరాటపడుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఖాయమని, తమ ఓటు హక్కు విషయములో ప్రజలని అప్రమత్తం చేయడానికి ఆదివారం రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు.
కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా జగన్ ప్రభుత్వం పై నడ్డా విమర్శలు
కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . మా పార్టీ ప్రభుత్వంపై జేపీ నడ్డా విమర్శలు క్షిపని దాడి మాదిరిగా ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి, తనని ఎవరూ చూడడం లేదని భావించినట్లుగానే సాక్షి దినపత్రికలో అబద్దాలను రాసుకుంటూ, తమ తప్పులను ఎవరూ గుర్తించడం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ బ్యూరో నివేదికలు ఎప్పటికప్పుడు అందుతాయని మా పార్టీ ప్రభుత్వ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఐ బి నివేదికల ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను జేపీ నడ్డా పూస గుచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని భూ, ఇసుక, మద్యం మాఫియాల గురించి ప్రస్తావించిన ఆయన, రాష్ట్రంలో స్కాములు తప్ప స్కీమ్ లు లేవని ఎద్దేవా చేశారన్నారు .
కేంద్ర ప్రభుత్వ పథకాలకు , తమ పేరు తగిలించుకొని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుందని నడ్డా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మార్జిన్ మనీ చెల్లించకుండా, ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం అటకెక్కించిందని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన జేపీ నడ్డా, రాష్ట్ర రాజధానిగా అమరావతి కే తమ పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని వెల్లడించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అవినాష్ రెడ్డి కేసు తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా, పోలవరం నిధుల కోసం అంటూ ఢిల్లీ పెద్దలను కలిసిన జగన్మోహన్ రెడ్డి తమ మధ్య అన్యోన్య సంబంధాలే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. నడ్డా వ్యాఖ్యల ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది స్పష్టం అయ్యింది. సోమవారం నాడు అమిత్ షా సభ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఎన్ని విమర్శలు చేస్తారో?!. నిప్పులు చెరుగుతారో చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
జేపీ నడ్డా వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో సమయమునము కోల్పోయి ఏక వచనంతో సంబోధించడం విచారకరం. రాజకీయాలలో రాజకీయ విమర్శలే ఉండాలి తప్పితే, వ్యక్తిగత విమర్శలకు తావులేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తగదు. కర్ణాటక ప్రజలు బిజెపి మోహన ఉమ్మి వేస్తే, ఆ రాష్ట్ర డిజిపిగా వ్యవహరించిన పోలీసు అధికారిని ఢిల్లీకి తీసుకువెళ్లి సిబిఐ లో స్థానం కల్పించారని, ఆ సిబిఐ ఎలా పనిచేస్తుందో తెలిసిందేనని పేర్ని నాని విమర్శించడం విస్మయాన్ని కలిగించింది. నాలుగేళ్లుగా మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోయినా, సిబిఐ మౌనంగానే ఉంది. నాలుగేళ్లలో మూడేళ్లు గడిచిన తరువాత హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న అప్పీల్ కు వెళ్లకుండా పరోక్షంగా సహకరించింది. అలాగే గత మూడేళ్ల పాటు ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోయినప్పటికీ తన సిబిఐ తన అభ్యంతరాన్ని తెలియజేయలేదు.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా చూసి చూడనట్టే వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు, కోర్టు ఎలా చెబితే అలా నడుచుకుంటామని చెప్పి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కే సహకరించింది. అటువంటి సీబీఐపై విమర్శలు గుప్పిస్తే, వారికి కనుక ఆగ్రహం కలిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుర్తించాలని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కనికరిస్తున్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. రాష్ట్రంలో మధ్య నియంత్రణ చేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచామని పేర్ని నాని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.
మద్యపాన ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని, గతంలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు విక్రయిస్తోంది. అలాగే నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచకుండా, కేవలం జే బ్రాండ్లను మాత్రమే మద్యం దుకాణాలలో అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉండే 20 రకాల బ్రాండ్లన్నీ జే బ్రాండ్ లేనన్నది జగద్విదితం. దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లను గత ప్రభుత్వ హయాంలో మద్యపాన ప్రియులకు అందుబాటులో ఉంచేవారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుందని చెబుతున్నప్పటికీ, నగదులోనే మద్యం విక్రయాలను ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.
రాష్ట్రంలోని మూడు వేల మద్యం దుకాణాలలో 3000 స్వైపింగ్ మిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లారీ 5 వేల రూపాయల లోపుగానే ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ, మా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒకరికి టార్గెట్లను నిర్దేశించి ఇసుక తొవ్వుకునే అవకాశాన్ని కల్పించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న వారి వద్ద నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత ఆదాయం వస్తుందో, జేపీ నడ్డా వద్ద కూడా లెక్కలు ఉన్నట్టుంది. నిన్నటి వరకు ఎంతో స్నేహంగా ఉన్నవారు ఈరోజు కర్కశంగా మాట్లాడుతున్నారంటే, మన విధానాలను కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి, ప్రతి విమర్శలు చేయడం సరైన విధానం కాదన్నారు.
1800 కోట్లు వెచ్చించి పోలవరం పనులు పూర్తి చేసి ఉంటే… పదివేల కోట్ల రూపాయలు దుబారా చేయాల్సిన అవసరం ఉండేది కాదు
పోలవరం ప్రాజెక్టు పనులను ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేసి ఉంటే, ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉండేది కాదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చివరి దశలో మరో ఆరు నెలలు ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని అందరూ ఆశించారు. హెడ్ వర్క్స్ పనుల కోసం 1790 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణరంగంలో అనుభవమున్న నవయుగ సంస్థ ను కాదని, ఆ రంగంలో ఏమాత్రం అనుభవం లేని మెగా ఇంజనీరింగ్ సంస్థకు రివర్స్ టెండరింగ్ పేరిట 1548 కోట్ల రూపాయలకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టారు.
1548 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచడం జరిగింది. ఏడు రెట్లు వ్యయాన్ని ఎక్కువ పెంచారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలు కాపాడామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ, ఏకంగా 5500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ముంచేశారు. గతంలో పూర్తి చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల రెండు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. డయాఫ్రం వాల్ రిపేర్లు, సేఫ్టీ బండ్ కు పగుళ్లు ఏర్పడడం వల్ల అంచనాలను 10 వేల కోట్ల రూపాయలకు పెంచుకుంటూ వెళ్తున్నారు.
గతంలో 1800 కోట్ల రూపాయలను వెచ్చించి పూర్తి చేసి ఉంటే, ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అగత్యం ఏర్పడి ఉండేది కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఉంటే 2021 లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. ఇప్పుడు మరో రెండేళ్లయిన పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయో లేదో తెలియని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే, రాష్ట్ర జిడిపి ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల,ఇప్పుడు ఆ జీడిపి అంతా నష్టపోయినట్లే. పోలవరం ప్రాజెక్టును ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టిడిఎల్పి ఉపనేత డాక్టర్ నిమ్మల రామానాయుడు తో పాటు ఆ పార్టీ నేతలు సందర్శిస్తామని అంటే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు. అసలు ప్రాజెక్టు వద్ద ఏమైనా ప్రగతి ఉంటే కదా , ప్రతిపక్ష పార్టీలకు సందర్శించడానికి అవకాశం ఇచ్చేది అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
పోలీస్ చట్టం 30ని అమలు చేస్తారట…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఉభయగోదావరి జిల్లాలో పోలీస్ చట్టం 30ని అమలు చేస్తామని చెప్పడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని న్యాయస్థానం కొట్టివేసింది. అన్నవరం నుంచి భీమవరానికి తలపెట్టిన వారాహి యాత్రకు, గతంలో నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రకు కల్పించినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలను కల్పించాలని చూస్తుందని రఘురామకృష్ణం రాజు ధైర్యమెత్తారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల మధ్య ఉంటామని చెబితే స్వాగతించాల్సింది పోయి, అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ఉండేవారా?. వారాహి యాత్ర లక్షలాది మంది అభిమానుల హర్షద్వానాల మధ్య, స్వాగత తోరణాల మధ్య విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నేను చేస్తున్న సూచనలు ముఖ్యమంత్రికి నచ్చినందుకు ధన్యవాదాలు
రచ్చబండ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను చేస్తున్న సూచనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కుడి ఎడమల ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లతో పాటు, పార్టీలోని మరింత మంది రెడ్లకు నచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పార్టీ అధ్యక్షుడిని పొగడడం లేదు… అలాగని తిట్టడం లేదు. పార్టీ శ్రేయస్సు కోరి నాలుగు మంచి మాటలు చెబుతున్నాను. నన్ను స్క్రాప్ అని సంబోధించడం లేదంటే నన్ను నేను బంగారమని భావిస్తున్నాను. మేము స్క్రాప్ అని తీసివేసిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలను చంద్రబాబు నాయుడు తన పార్టీలో చేర్చుకొని సంబరపడిపోతున్నారని మా పార్టీ నాయకత్వం విమర్శలు గుప్పించిందని గుర్తు చేశారు.