ఎంపీ మోపిదేవికి నిరసన సెగ
గ్రామస్తుల ఆగ్రహంతో వెనుదిరిగిన మోపిదేవి
ఉప్పలవారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు
బాపట్ల : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని ఒక యువకుడు పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన ఘటన రాజోలులో శుక్రవారం ఉదయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. జిల్లాలోని ఉప్పలవారిపాలెంలో బాలుడి అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణకు నిరసన సెగ తగిలింది. గ్రామంలోకి రావొద్దంటూ బాలుడి బంధువులు, స్థానికులు ఎంపీని అడ్డుకున్నారు. కనీసం బాధిత కుటుంబం ఉంటున్న ఇంటివద్దకు కూడా ఎంపీని వెళ్లకుండా అడ్డుకున్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగితే తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా? అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే, తాను వ్యక్తిగతంగా కలిసి రూ.లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పగా..
”మేమే మీకు రూ.లక్ష ఇస్తాం. దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక మోపిదేవి అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి పికెట్ ఏర్పాటు చేశారు.