• క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి
• కోనసీమ అల్లర్ల కేసు తీసివేయడంలో వైసీపీ నిజాయతీగా వ్యవహరించాలి
• అమలాపురం జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు విన్న పవన్ కళ్యాణ్
నాడు – నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని పాలకుల ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో కనీసం ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కూడా లేవని, ఇది ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పాఠశాలలో నాలుగేళ్ల క్రితం మరుగుదొడ్లు కూల్చేసి ఇప్పటి వరకు నిర్మించలేదని ఆ పాఠశాలకు చెందిన బాలికలు పవన్ కళ్యాణ్ ఎదుట మొరపెట్టుకున్నారు. టాయిలెట్స్ లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురంలో “జనవాణి- జనసేన భరోసా” కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చి వారి సమస్యలను పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. తొలుత తపస్వి భగవాన్ బాలయోగీశ్వరులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పవన్ కళ్యాణ్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజాసమస్యలను స్వయంగా విన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కోనసీమ అల్లర్ల సమయంలో దాదాపు 250 మంది అమాయకులపై కేసులు పెట్టి వేధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా యువతను అరెస్టు చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టి తీవ్రంగా వేధించారు. కేసులు తీసేశామని ఇటీవల ప్రకటించిన వైసీపీ ప్రభుత్వ మాటలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అప్పటి కేసుల వల్ల ఇంకా చాలామంది ఇబ్బందుల్లోనే ఉన్నారు.
దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, రకరకాల నిబంధనల పేరు చెప్పి పెన్షన్లు పీకేస్తున్నారు. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం… ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం నోటిఫికేషన్లు ఇవ్వలేకపోయార”ని వైసీపీ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. పార్టీ నేత డి. వరప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
జనవాణి కార్యక్రమంలో వచ్చిన ముఖ్యమైన సమస్యలు
•ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. పాస్ పోర్టు విషయంలో తేడాలు జరిగి గల్ఫ్ కఠిన చట్టాల వల్ల జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరికోసం కచ్చితంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి: నండు వెంకటేశ్వరరావు
• నిరుద్యోగ యువత కోసం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తో పాటు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులు చదువుకునే బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్ కూడా మూసేశారు : సతీష్, నిరుద్యోగి
• రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కాంట్రాక్టు వర్కర్స్ 26 వేల మంది ఉన్నాం. నెల వారీ జీతాలు ఇవ్వడం లేదు. ఏళ్ల తరబడి పనులు చేస్తున్నా ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదు : కర్రి లక్ష్మణ్
• పి. గన్నవరం నియోజకవర్గంలోని ప్రభుత్వాసుపత్రిలో కనీస మౌలిక సదుపాయలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ముఖ్యంగా సరిపడ వైద్య సిబ్బంది లేక గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత ఆస్పత్రికి వెళితే అమలాపురం ఆస్పత్రికి పంపించేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో 20 కిలోమీటర్లు ప్రయాణించడం గర్భిణీలకు ఇబ్బందిగా మారుతోంది : యడ్ల లక్ష్మీదుర్గ