– పేదల కడుపు నింపుతుంటే…బటన్ నొక్కుడంటూ అవహేళన చేస్తావా..?
– అవినీతి అని ఆరోపించడం కాదు…నిరూపించు
– ఇలాగే పిచ్చిగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు.
– ముద్రగడను చిత్రహింసలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు..?
– నన్ను చంపాలనుకున్నారు అన్న పార్టీతోనే తిరగడానికి పవన్ కి సిగ్గుండాలి
– జగన్ కి, ప్రజలకు మధ్య బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు
– మంత్రి కారుమూరి ఫైర్
యువతను రెచ్చగొట్టడం తగదు
జనసేన పార్టీ అధ్యక్షుడినంటూ వారాహీ యాత్ర చేస్తున్న పవన్‌కళ్యాణ్ తన ప్రసంగాల తీరును మార్చుకోవాలి. ఆయన యువతను మంచి మార్గంలో నడిపించే ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి గానీ.. తాటతీస్తాను.. తోలుతీస్తానంటూ మాట్లాడటం సబబుకాదు. నాయకుడే ఆ విధంగా మాట్లాడితే ఆయన్ను అభిమానించే యువత ఎంతగా రెచ్చిపోతారనేది పవన్‌కళ్యాణ్ అర్ధం చేసుకోవాలి. ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడంతో పాటు పూటకో మాట మాట్లాడటమనేది రాజకీయాల్లో సరైన పద్ధతికాదనేది ఆయన తెలుసుకోవాలి. రాజకీయం అంటే సినిమా డైలాగులు కొడతామంటే, ఆ ప్రయోగం వికటించకమానదని నేను పవన్‌కళ్యాణ్‌కు హితవు పలుకుతున్నాను.
బాబుతో నీ ప్రేమబాగోతం తెలియనిదెవరికి..?
ఈరోజు రాజకీయాల్లోనే కాకుండా ఏ ఇతర రంగాల్లో ఉన్నవారిని అడిగినా.. చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మధ్య జరుగుతున్న ప్రేమ భాగోతాన్ని చెబుతారు. కాసేపేమో ఇద్దరం కలిసే ఉన్నామంటూ.. పొత్తులపై మాట్లాడటం.. మరికాసేపేమో ఎవరికి వారు తామే ముఖ్యమంత్రులమంటూ చెప్పుకోవడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మరి, ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను నేను సూటిగా ప్రశ్నిస్తున్న విషయమేమంటే.. నువ్వు ప్రేమిస్తున్న చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏం చేశారు..? ఆయన హయాంలో ఆంధ్రరాష్ట్ర ప్రజలు అనుభవించిన కరువు కన్నీళ్లేంటి..? వీటిపై నువ్వు సమాధానం చెప్పగలవా..?
అదే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం నాలుగేళ్లలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో అన్నింటా ముందంజలో ఉంచారు. ఈ విషయం మేమే ప్రభుత్వంలో ఉండి చెప్పడం కాదు. స్వయంగా నువ్వు ప్రేమించే బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని మోదీగారు సైతం మెచ్చుకుంటూ అన్నమాటే. ఈ విషయాన్ని నువ్వెందుకు పరిగణలోకి తీసుకోవు పవన్‌కళ్యాణ్..? యాత్రలో నువ్వు చేసే సుదీర్ఘ ప్రసంగాల్లో మా ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీ పెద్దల అభిప్రాయం కూడా చెబితే బాగుంటుంది కదా..? అని గుర్తుచేస్తున్నాను.
ఇంగ్లీషు మీడియం వద్దని నాడు పోరాడింది బాబు, పవన్‌లే..
వైఎస్ఆర్సీపీ అధికారంలోకొచ్చాక మా జగన్‌గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 4 ఏళ్లలోనే ఆంధ్రరాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని అన్నివర్గాలు కితాబు ఇస్తున్నాయి. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఆధునీకీకరించి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనమైన ప్రభుత్వం మాది. పేద విద్యార్థులకు సైతం ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన అవసరమని మా జగన్ ప్రవేశపెడితే ఇదే పవన్‌కళ్యాణ్, చంద్రబాబు అడ్డుకున్నారు.
అప్పట్లో ఏకంగా కోర్టులకు కూడా ఎక్కిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుందికదా..? మరి, ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు విద్య నేర్చుకున్న విద్యార్థులు ఆణిముత్యాల అవార్డులు సైతం తీసుకున్నారు. ఇలాంటి మంచి వాతావరణాన్ని మెచ్చుకోవాలంటే ఎవరికైనా మానవీయ విలువలుండాలి. అయితే, ఈ చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మాత్రం ప్రభుత్వం చేసే మంచిని అంగీకరించలేని నిలువెల్లా విషం వీరిని ఆవరించి ఉంది.
బాబు హయాం అరాచకాలపై నోరువిప్పవే..?
వారాహీ యాత్ర మొత్తం కేవలం మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాత్రమే సాగుతుంది. పవన్‌కళ్యాణ్ నోరుతెరిస్తే వైఎస్ఆర్సీపీ అధికారం పోవాలంటూ.. మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై బురదజల్లే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఓట్లు అవసరమైన నాయకుడు ఏ విధంగా ప్రజలతో మాట్లాడాలో అనేది పవన్‌కళ్యాణ్‌కు తెలియడంలేదు. కేవలం, మా ప్రభుత్వంపై నిందలేయడానికే తప్ప.. మరి, బాబు హయాంలో చోటుచేసుకున్న సంఘటనలపై పవన్‌కళ్యాణ్ ఏమాత్రం నోరువిప్పకపోవడంలో ఆంతర్యమేంటి..?
నిజానికి, బాబు అధికారంలో ఉన్నప్పుడే రిషితేశ్వరి హత్యకు గురైతే.. విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ నడిస్తే.. విజయవాడలో 41 గుడుల్ని కూల్చితే ఈ పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరువిప్పలేదు..? అని సూటిగా అడుగుతున్నాను. ఇందుకు ఆయన సమాధానం చెప్పాలి.
ముద్రగడను వదిలేసి బాబుతో అంటకాగుతావా…?
అదేవిధంగా కాపులకు అండగా ఉండి ఆ సామాజికవర్గ పెద్దగా ఉన్న ముద్రగడ పద్మనాభంను ఇదే చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఈ పవన్‌కళ్యాణ్ ఏం చేశాడు..? అప్పట్లో ముద్రగడ కొడుకును లాఠీలతో కొట్టినప్పుడు.. ఆయన కుటుంబాన్ని హీనాతిహీనంగా హింసించినప్పుడు ఈ పవన్‌కళ్యాణ్ ఎక్కడికి పోయాడంటూ ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజికవర్గం మొత్తం ముద్రగడ గారి నాయకత్వానికి మద్ధతు పలుకుతుంటే.. మరి, ఈ పవన్‌కళ్యాణ్ మాత్రం ఆయన్ను పక్కనబెట్టి చంద్రబాబు చంకనెక్కి తిరగడమేంటో.. అనేది ఆ సామాజికవర్గ సోదరులే ఆలోచించాలి.
తిట్టినోళ్ల చంకనెక్కిన పవన్‌కళ్యాణ్
ఈరోజు పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో ఎందుకు వారాహీ యాత్ర చేస్తున్నాడో.. ఈ యాత్ర ద్వారా ఇతను లబ్ధిపొందే విషయమేంటో అనేది ఆయనకే తెలియాలి. ఎవరి కోసం ఆయన అంతగా ఆవేశంగా మా ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నాడో ప్రజలకు తెలుసు. నాడు ఎవరైతే తనను, తన కుటుంబాన్ని నీచాతీనీచంగా తిట్టారో.. మళ్లీ వాళ్ల చంకనే ఎక్కి తిరగాలనేది పవన్‌కళ్యాణ్ తాపత్రయంగా అర్థం చేసుకోవాల్సిందే.
గతంలో ఇదే చింతమనేని ప్రభాకర్ జనసేన జెండాను కాలికిందేసి తొక్కుతూ.. పవన్‌కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని నానా దుర్భాషలాడారు. అప్పట్లో నా తల్లిని తిడతారా..? అని స్వయంగా పవన్‌కళ్యాణ్ కూడా బాధపడింది నిజంకాదా..? మరి, మళ్లీ అలాంటి టీడీపీ నేతల చంకనెక్కి తిరగడంలో అర్ధమేంటి..? ప్యాకేజీ మహిమ అని ప్రజలు అర్ధం చేసుకోవాల్నా..? అని సూటిగా అడుగుతున్నాను.
పవన్ యాత్రను ఆపే అవసరం మాకేంటి..?
ఇప్పుడేదో.. తనకు ప్రాణహాని ఉందని, సుపారీ మాట్లాడేసుకుంటున్నారంటూ పవన్‌కళ్యాణ్ చెబుతున్నారు. మరి, అచ్చంగా ఇదే మాట గతంలో టీడీపీతో వైరం వచ్చినప్పుడు కూడా మాట్లాడాడు కదా..? అతన్ని చంపాలనుకున్న పార్టీతోనే మళ్లీ చెట్టపట్టాలేసుకుని తిరగడానికి పవన్‌కళ్యాణ్‌కు సిగ్గుండాలి కదా..? అసలు, పవన్‌కళ్యాణ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటి..? అని అడుగుతున్నాను. ఇంకా, ఆయనే మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
బటన్ నొక్కడాన్ని అవహేళన చేస్తావా..?
ఈరోజు రాష్ట్రప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తుంది. ఆ విధంగా ఇప్పటికీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి డీబీటీ కింద రూ.2.16 లక్షల కోట్లు నేరుగా జమచేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా ఈ పవన్‌కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడటం ఏమైనా సమంజసంగా ఉందా..? ఎక్కడైనా ఇందులో అవినీతి జరిగినట్టు మీదగ్గర ఆధారాలుంటే వచ్చి నిరూపించాలి.
అలా నిరూపించే దమ్మూధైర్యం మీకుందా..? పవన్‌కళ్యాణ్ అని అడుగుతున్నాను. అత్యంత పారదర్శక విధానంతో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను మెచ్చుకోవాల్సింది పోయి మా ప్రభుత్వంపై నిందలేయడం నీకు తగదని.. భవిష్యత్తులో ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలే నీకు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను.
మచ్చలేని నాయకుడు మా జగన్
ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఆరాధ్యదైవంగా నిలిచారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఇప్పటికే 99 శాతం హామీల్ని నిలబెట్టిన మచ్చలేని నేత మా జగన్‌గారు అని .. వారి నాయకత్వంలో మేమంతా మంత్రులుగా పనిచేయడం మా అదృష్టంగా మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. రైతులకు అన్ని విషయాల్లోనూ పెద్దపీట వేశాం.
రాజకీయపార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందిసున్నాం. ఎక్కడా చిన్నపాటి అవినీతి మచ్చలేకుండా పరిపాలన చేస్తున్న జగన్‌గారు పేదోళ్లకు పెద్దబిడ్డగా, విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న చిన్నారులకు మామయ్యగా ఉన్నారు. ఆ బంధాన్ని చంద్రబాబు గానీ పవన్‌కళ్యాణ్ గానీ వేరెవ్వరూ విడదీయలేరని స్పష్టంగా చెబుతున్నాను.
ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్నివర్గాలు వైఎస్ఆర్సీపీ వెంటనే ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాల్ని మేం కైవసం చేసుకుంటామని ధీమాగా చెబుతున్నాను.