– 2014 జూన్2 నాటికి కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని?
– 2023 జులై 2 నాటికి వారి ఆస్తులు ఎంతకు పెరిగాయో చర్చించేందుకు వారిద్దరూ సిద్ధంగా ఉన్నారా?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు ఓ సైకో మంత్రి ప్రయత్నం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం భారాస అవివేకమని అన్నారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం. మీలా అవినీతి కుటుంబం కాదు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసింది. రాహుల్ కంటే ఇంకెవరికైనా తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? అసలు రాహుల్ అర్హత గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది?’’ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్టీఐ, ఆహార భద్రత చట్టంతోపాటు హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు, ఫార్మా సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారని రేవంత్ విమర్శించారు. రీ డిజైన్ తర్వాత ఆయకట్టు ప్రాంతం పెరగకపోగా.. ఆ ప్రాజెక్టు రాష్ట్ర వనరులను కరిగిస్తోందని ఆరోపించారు.
‘‘ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు. ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు.. కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టుపై చర్చించేందుకు కాంగ్రెస్ నుంచి ఇద్దరం వస్తాం.. భారాస నుంచి హరీశ్‌రావు, కేటీఆర్ సిద్ధమా?’’ అని రేవంత్ సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని రేవంత్ విమర్శించారు. 2014 జూన్2 నాటికి కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? 2023 జులై 2 నాటికి వారి ఆస్తులు ఎంతకు పెరిగాయో చర్చించేందుకు వారిద్దరూ సిద్ధంగా ఉన్నారా? అని రేవంత్ ప్రశ్నించారు.