వికాసాన్ని చిదిమేసే
విజ్ఞానాన్ని అణిచేసే
శాస్త్రీయతను ఛిద్రం చేసే
ఒరేయ్ ఇదేం బుద్ధిరా
ఆదిమ యుగంలోకి వెళ్తావా
చీకటి గుహలో కుచించుకుపోతావా
అంధకారబంధురంలో బందీవవుతావా
ఒరేయ్, ఒరేయ్ ఇదేం ఆలోచనరా
ఆధునిక యుగంలో ఉంటూ
సదుపాయాలన్నీ చంకలో పెట్టుకుంటూ
సాంకేతికతను ఎంచక్కా వాడుకుంటూ
సిగ్గయినా లేకేండా ఇవేం మాటలురా
బ్రూనోను చంపేసి
కోపర్నకస్ను హతమార్చేసి
ప్రశ్నించేవారిని పాతరేసిన
మెదడులేని మూర్ఖుల్లారా
సైన్స్ రంగంలో ఇచ్చే
అవార్డులు రద్దేమిటి…?
శాస్త్ర సాంకేతిక శాఖే
ప్రకటించడమేమిటిరా
శాస్త్రీయత రాజ్యాంగ హక్కు
ఆర్టికల్ 51 ఎ(హెచ్) అదే చెబుతోంది
ఉష్ట్రపక్షుల్లా భూమిలో తలలుపెట్టుకున్నారా
గబ్బిలాల్లా నిరంతరం నిద్రపోతున్నారా
ఉదయాన్ని చూడలేని
వెలుగును భరించలేని
నిజాన్ని వినే ధైర్యం లేని
మీరెందుకురా మా మధ్య
వివిధ మతగ్రంథాల్లో అన్నీ ఉంటే
అందులోనే విజ్ఞానముంటే
మీ పిల్లలచే అవే చదివించుకోండి
నమ్మకముంటే ఆ బాటలోనే నడుచుకోండి
కరెంటు వెలుగులు మీకెందుకు
ఏసీ, కూలర్లకు దూరం జరగండి
విమానాల విహారాలను విరమించండి
నపుంసక నంగనాచితనాలు మానండిరా
(పాఠ్యాంశాల నుంచి పలు సైన్స్ పాఠాలు తొలగింపులు, శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు రద్దు చేయడాలు, ప్రశ్నించేవారిని వేధించడాలకు పాల్పడుతున్న బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా … నా వేదన…ఇలా కవితాక్షరాల్లో…)
చింతాడ కృష్ణారావు, శ్రీకాకుళం, 80086 79666