Suryaa.co.in

Andhra Pradesh

శ్రీపాద శ్రీనివాస్ అంటే మరో శ్రీ శ్రీ అని

-వినూత్న రీతిలో శ్రీపాద రచన ” మనసున ఉన్నది” పుస్తక ఆవిష్కరణ
-శ్రీపాద శ్రీనివాస్ మరిన్ని రచనలు చేయాలి
-మనసున ఉన్నది పుస్తకావిష్కరణలో వక్తల ఆకాంక్ష

రాజమహేంద్రవరం: సమాజంలోని పరిస్థితులకు అద్దంపడుతూ రచనలు చేస్తున్న శ్రీపాద శ్రీనివాస్ తన రచనలను కొనసాగించి మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తేవాలని పలువురు ఆకాంక్షించారు. శ్రీపాద శ్రీనివాస్ అంటే మరో శ్రీ శ్రీ అని కొనియాడారు. శ్రీపాద శ్రీనివాస్ రచించిన కథ, కథానికల సమాహారం ‘మనసున్న ఉన్నది’ పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకు హాలులో నిర్వహించారు. శ్రీనివాస్ మిత్రులు, శ్రేయోభిలాషుల నడుమ ఆత్మీయ పూరిత వాతావరణంలో సాగిన ఈకార్యక్రమానికి నాగరాజు స్వాగతం పలుకగా, సీనియర్ పాత్రికేయులు వి ఎస్ ఎస్. కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ‘మనసున్న ఉన్నది’ పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, శ్రీనివాస్ గురువులు సంయుక్తంగా ఆవిష్కరించారు.

రాష్ట్ర విభజన సమయంలో అంశాలపై పుస్తకం తేవాలి :ఉండవల్లి
ఈసందర్బంగా ఉండవల్లి అరుణకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలపై ఓ పుస్తకం తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. విభజన సమయంలో ఎవరూ ఏమీ అడగలేదని అంటున్నారని, అయితే విభజన అనివార్యమైతే ఏమేమి కావాలో 292 ఎమెండ్ మెంట్స్ చేసారని ఆసమయంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో కూడా తెల్సు కనుక ఒక పుస్తక రూపంగా తెస్తే బాగుంటుందని శ్రీనివాస్ కి సూచించారు. రాయడం అనే వ్యసనాన్ని వదులుకోవద్దని సూచించారు.

శ్రీపాద వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం : రౌతు
పదేళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించదలచిన అంశాలు అందించి తన ఉన్నతికి శ్రీపాద శ్రీనివాస్ దోహదం చేసాడని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ఇటీవల ఆ అంశాలను క్రోడీకరించి చట్టసభల్లో గోదావరి గళం పేరిట పుస్తకం తీసుకు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రచయిత, కవి అయిన శ్రీపాద వంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని ఆయన పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలన్నారు. సంపద కన్నా ఆప్త మిత్రులు ఉన్నవాడే గొప్పవాడని అలాంటి ఆప్త మిత్రులున్న శ్రీపాద శ్రీనివాస్ అభినందనీయుడని అన్నారు.

సీనియర్ న్యాయవాది చింతపెంట ప్రభాకర్ పుస్తకం సమీక్ష చేస్తూ ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ , కామన్ మ్యాన్ , అమ్మవడి , అంతరాత్మ పరమాత్మా , పండుటాకు, ఆత్మవేదన, వందేభారత్ ట్రైన్ లో తొలిప్రయాణం ఇలా శ్రీపాద శ్రీనివాస్ ఏ రచన తీసుకున్నా అందులో సందేశం, ప్రశ్న, గోదావరి వ్యంగ్యం… అన్నీ మేళవించి చదివించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలన్న తాపత్రయం ఈ రచనల్లో కనిపిస్తోందని విశ్లేషించారు. వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ శ్రీపాద శ్రీనివాస్ తన అనుభూతికి అక్షర రూపం కల్పిస్తున్నాడని అభినందించారు. నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ శ్రీపాద శ్రీనివాస్ రచనల్లో భావుకత కన్పిస్తుందన్నారు.

ప్రతిభ మూర్తి మాట్లాడుతూ వీరభద్రపురం టౌన్ హైస్కూల్లో శ్రీపాద శ్రీనివాస్ అందరం కల్సి చదువుకోవడం, అందరూ మంచి స్థానాల్లో ఉండడం ఆనందదదాయకమని, ఇందుకు అప్పటి హెడ్మాస్టర్ ఆర్వీ చలపతి, ఉపాధ్యాయ బృందం కారణమని విశ్లేషించారు. ఉపాధ్యాయులు తమ అనుభవాలను క్రోడీకరించి చదువుతో పాటు క్రమశిక్షణ అలవరిచి , విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయడం వంటివి చేసారని గుర్తుచేసుకున్నారు. శ్రీపాద శ్రీనివాస్ రచయితగా ఉండడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. మహాలక్ష్మీరావు మాస్టారు మాట్లాడుతూ ఆరోజుల్లో టీమ్ వర్క్ తో పనిచేశామని, విద్యార్థులు కూడా మేము చెప్పింది వంటబట్టించుకున్నారని అన్నారు. ఈరోజుల్లో అలాంటి వాతావరణం లేదని వాపోయారు. మణి టీచర్ మాలిక్ మాస్టారు మాట్లాడుతూ శ్రీపాద శ్రీనివాస్ రచనలు బాగున్నాయని అభినందించారు. బుడ్డిగ రవి, ఏ నాగరాజు తదితరులు మాట్లాడుతూ శ్రీపాద వంటి మిత్రుడు ఉన్నందుకు తమకెంతో గర్వంగా ఉందన్నారు.

అనంతరం శ్రీపాద శ్రీనివాస్ ని మాజీ ఎమ్మెల్యే రౌతు పక్షాన ఉండవల్లి దుశ్శాలువతో సత్కరించారు. అలాగే బెజవాడ రంగారావు , మాస్టర్లు, స్నేహితులు కూడా శ్రీపాదను సత్కరించారు. అల్లు బాబి, షేక్ అసదుల్లా అహ్మద్, ప్రసాదుల హరినాధ్, పసుపులేటి కృష్ణ, ముళ్ళా మాధవ్, పిల్లా సుబ్బారెడ్డి, బండారు మధు, వాకచర్ల కృష్ణ, శ్రీనివాస్ మిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE