హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ సాంస్కృతిక శాఖ,సుమేధస (సంస్కృతి ద్వారా మేధస్సు) ఆధ్వర్యంలో జులై 2023 నుండి తెలంగాణలోనే అతిపెద్ద బాలబాలికల సాంస్కృతికోత్సవమైన ‘హెరిటేజ్ ఫెస్ట్’ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం మాకెంతో హర్షణీయంగా వుంది.
ఆత్రుత, నిస్పృహ, న్యూనతా భావాలు లేని బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన భావిభవిష్యత్తరాన్ని పెంపొందించాలనే సుదృక్పథంతో సుమేధస ఈ హెరిటేజ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా LKG నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు భారతదేశం యొక్క సుసంపన్నమైన సంస్కృతి, వైభవోపేతమైన చరిత్రలను తెలుసుకుంటూ, తమ ప్రతిభా నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు వీలుగా అనేక కార్యకలాపాలతో రూపొందించబడింది.
హెరిటేజ్ ఫెస్ట్ అనేది భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతి సాంప్రదాయాల వార్షిక మహోత్సవం. ఇది మన వైదిక సంస్కృతి మరియు సార్వత్రిక నైతిక విలువలను కూడా ప్రోత్సహిస్తుంది. “జ్ఞానోదయం, సృజనాత్మకత మరియు వినోదము”లు కలబోసిన పండుగగా గుర్తింపు పొందిన ఈ హెరిటేజ్ ఫెస్ట్, పలు విస్తృతమైన కార్యకలాపాలకు కేంద్రబిందువై ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా నిలుస్తూ, పాఠశాల విద్యార్థుల నుండి భారీ భాగస్వామ్యానికి ఒక వేదికగా ఆవిర్భవించింది. గత ఎనిమిదేళ్లలో, మేము 2000 పాఠశాలల్లో 40,000 మంది విద్యార్థులకు చేరువయ్యామంటే, ఇది ఈ కార్యక్రమము పట్ల వచ్చిన అఖండమైన స్పందనకు నిదర్శనం.
ఈ సంవత్సరం, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 300 కన్నా ఎక్కువ పాఠశాలల నుండి సుమారు 30,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాము.
హెరిటేజ్ ఫెస్ట్ అంటే కేవలం సాంస్కృతిక పోటీలకు మాత్రమే వేదిక కాదు. నేడు ప్రపంచంలో విస్తరిస్తున్న సాంకేతికత, తదనుగుణంగా మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న బాల్య నేరాలు, పిల్లల్లో ఒత్తిడి మొదలైన వాటి వల్ల సమాజంలో ఏర్పడుతున్న సాంస్కృతిక విభజనను తగ్గించే వారధిగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో కలరింగ్, పెయింటింగ్, గీతా-శ్లోక పఠనం, పౌరాణిక వస్త్రధారణ, శాస్త్రీయ నృత్యం, గాత్ర సంగీతం, వంటకం, పుష్పాలంకార, రంగోలి, నాటకం, జానపద నృత్యం మరియు కథలు చెప్పడం వంటి వివిధ పోటీలు ఉంటాయి. ఈ పోటీలన్నీ పిల్లల సృజనాత్మకత, మేధస్సు మరియు కళాత్మక అభిరుచులను వెలికితీసే లక్ష్యంతో కొనసాగుతాయి.
జంటనగరాల్లోని ఫీల్‌ఖానా, బంజారాహిల్స్, ఘట్కేసర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కాచిగూడ, సికింద్రాబాద్, శంషాబాద్, కొత్తపేట, మెహదీపట్నం, బాచుపల్లి, ఎర్రగడ్డ మరియు కంది మొదలైన ప్రదేశాలలో పోటీలు క్రింద పేర్కొన్న విధంగా వివిధ తేదీలలో నిర్వహించబడతాయి.
కార్యక్రమ ప్రణాళిక:
హెరిటేజ్ ఫెస్ట్ ఈవెంట్ ప్రారంభం: శుక్రవారం, 14 జులై 2023.
పాఠశాలల మధ్య పోటీల షెడ్యూల్:
జోన్ 1 నుండి 3: జులై 2023 4వ మరియు 5వ వారాలు (ఫీల్‌ఖానా, బాచుపల్లి, సికింద్రాబాద్)
జోన్ 4 నుండి 12 వరకు: 2023 ఆగస్టు 1వ, 2వ, 3వ మరియు 4వ వారము (బంజారాహిల్స్, శంషాబాద్, కాచిగూడ, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కంది, సంగారెడ్డి)
జోన్ 13 నుండి 20 వరకు: సెప్టెంబర్ 2023 1వ, 2వ, 3వ వారం (చైతన్యపురి, దిల్సుఖ్నగర్, ఘట్కేసర్)
జోన్ 21 నుండి 22: అక్టోబర్ 2023 1వ, 2వ వారం (మెహదీపట్నం, అత్తాపూర్)
క్వార్టర్ ఫైనల్స్: నవంబర్ 2023 2వ మరియు 3వ వారం
సెమీ-ఫైనల్స్: డిసెంబర్ 2023
ఫైనల్స్: జనవరి 2024
కార్యక్రమంలో నమోదు పూర్తిగా ఉచితం. ఆసక్తిగల తల్లిదండ్రులు, పిల్లలు మరియు పాఠశాల యాజమాన్యాలు మరిన్ని వివరాల కోసం మొబైల్ నెం. 8639273465 ను సంప్రదించవచ్చు.
కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఆకర్షణీయమైన సర్టిఫికెట్లు ప్రదానం చేయబడతాయి. పోటీల్లో గెలుపొందిన వారికి బంగారు, రజత, కాంస్య పతకాలతో పాటు మొమెంటోలు, ట్రోఫీలు అందజేయనున్నారు. బహుమతి పంపిణీ కార్యక్రమంలో మొత్తం 30,000 సర్టిఫికెట్లు, పతకాలు మరియు 100కి పైగా ట్రోఫీలు అందజేయబడతాయి. అదనంగా, పోటీ మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకునే పాఠశాలకు “ఛాంపియన్ ట్రోఫీ” అందించబడుతుంది. రెండవ స్థానంలో నిలిచిన పాఠశాలకు రన్నరప్ ట్రోఫీ అందించబడుతుంది. తదుపరి మొదటి మూడు పాఠశాలలకు కూడా ప్రత్యేక మొమెంటోలు అందుతాయి. అంతేగాక, ఫెస్ట్‌లో అత్యధిక సంఖ్యలో నమోదులు పొందిన పాఠశాలకు ప్రత్యేకమైన మొమెంటో అందజేయబడుతుంది. గెలుపొందిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులందరినీ సైటేషన్ సర్టిఫికేట్లతో సత్కరిస్తారు.
ప్రత్యేకంగా నిర్వహించే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్-హైదరాబాద్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ చేతుల మీదుగా బహుమతులు మరియు సర్టిఫికేట్లను అందజేయనున్నారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వం, సమిష్టికృషి మొదలైన నైపుణ్యాలను పెంపొందించే ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనవలసిందిగా హైదరాబాద్‌లోని పిల్లలందరితో పాటు వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల యాజమాన్యాలను కూడా మేము ఆహ్వానిస్తున్నాము.
ఈరోజు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో, హరే కృష్ణ మూవ్మెంట్ (HKM) హైదరాబాద్ అధ్యక్షులు పూజ్యశ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ హెరిటేజ్ ఫెస్ట్ 2023 యొక్క పోస్టర్ మరియుషెడ్యూల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “హెరిటేజ్ ఫెస్ట్ పోటీల ద్వారా నేటి యువతలో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా HKM ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సనాతనమైన మన భారతీయ వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం మరియు ఆధ్యాత్మిక విలువలను ప్రచారం చేస్తూ, HKM చాలా సంవత్సరాలుగా ఈ హెరిటేజ్ ఫెస్ట్ సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తోంది. పిల్లలందరినీ ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడంతోపాటు దృఢమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులను నిర్మించడంలో దోహదపడుతూ, శ్రీకృష్ణ భగవానుని దివ్య ఆశీస్సులను కూడా పిల్లలకు అందజేయగలరని మేము తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరియు పాఠశాల యాజమాన్యాలను అభ్యర్థిస్తున్నాము”.