- తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు.. కానీ అది మా ఆత్మగౌరవం
- తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్న పదం ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్కని నర్సింహులు చెప్పాలి
- టీడీపీ మహానాడులో బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : షాద్ నగర్ గడ్డలో పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగి చంద్రబాబు మెప్పుకోసం బక్కని నర్సింహులు ‘డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు ‘ అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఆయన అజ్ఞానం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే.
తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నో శాసనాల్లో, సాహిత్యంలో, రాజ్యాల చరిత్రలో ఉంది. క్రీ.శ.1417 తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలవకు కొనసాగిన త్రిలింగదేశం అనే పదం నుండి తెలంగాణ వచ్చింది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్న పదం ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్కని నర్సింహులు చెప్పాలి.
తెలంగాణ ఉద్యమం, అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంటులో చేసిన చట్టం ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. చంద్రబాబు మెప్పుకోసం బక్కని నర్సింహులు మాట్లాడిన మాటలు, తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమే. మీలాంటి వాళ్లు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు.
తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు. కానీ అది మా ఆత్మగౌరవం. మా రక్తంలో, మా గుండెల్లో, మా భూమిలో, మా భాషలో, మా యాసలో, మా సంస్కృతిలో దాగి ఉంది. మీలాంటి ద్రోహుల మాటలు మా ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణ తేజాన్ని , వైభవాన్ని విశ్వవీధుల్లో ఎగరేస్తాయి.