Suryaa.co.in

Features

మన విశ్వవిద్యాలయాలు – ఉన్నత ప్రమాణాలు – భవిష్యత్తు!

మొన్నేమో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాల ఆచార్యులు 65 సం.ల వయస్సు వచ్చే వరకు కాంట్రాక్టు ఒప్పందంపై బోధనా వృత్తిని కొనసాగించవచ్చని విధాన నిర్ణయం తీసుకొన్నది. నిన్నేమో! మన విశ్వవిద్యాలయాలు, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ స్థాయి యూనివర్శిటీలతో పోటీపడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ – ఛాన్సలర్స్ సమావేశంలో ఉద్బోధించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి తద్భిన్నంగా జుగుప్సాకరంగా ఉన్నది.

ఈ ఏడాది జూన్ 8 నుండి జూలై 3 వరకు మా అమ్మాయి ఆహ్వానంపై నేను యు.కె. వెళ్లిన సందర్భంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, వార్విక్ యూనివర్సిటీలను సందర్శించాను. నా జీవిత భాగస్వామి అక్క కుమార్తె ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. చేసింది. ఆమె డాక్టరేట్ పట్టా ప్రధానోత్సవాన్ని వీక్షించడానికి 2018 మార్చిలో మొదటిసారి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించాను. అప్పుడు కొద్ది రోజుల పాటు ఆక్స్ ఫర్డ్ లోనే ఉండే అవకాశం లభించడంతో పలు ప్రసిద్ధ కళాశాలలకు వెళ్ళాను. అలాగే, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీని కూడా సందర్శించాను.

డిగ్రీ వరకు బోధించే అనుబంధ కళాశాలలు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా మన విశ్వవిద్యాలయాల వ్యవస్థ ఉన్నది. ఆక్స్ ఫర్డ్ యూనవర్సిటీ వ్యవస్థ భిన్నమైనది, విలక్షణమైనది. ఏ కళాశాలకు ఆ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగిన ఉన్నత విద్యా సంస్థల సముదాయం ఆక్స్ ఫర్డ్ యూనవర్సిటీ. అద్భుతమైన కళావైవిధ్యంతో కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించబడిన చారిత్రాత్మకమైన, నేటికీ చెక్కు చెదరని, వన్నె తగ్గని, భవన సముదాయాలలాగే ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలు విజ్ఞాన ప్రపంచంలో ప్రకాశిస్తున్నాయి. 2016లో నెలకొల్పబడిన వార్విక్ యూనివర్సిటీ సహితం మేనేజ్మెంట్ కోర్సుల విభాగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని చెప్పారు.

ఈ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విద్యనార్జిస్తున్నారు. ప్రపంచ దేశాల నుండి పదుల వేల సంఖ్యలో విద్యార్థులు పోటీల్లో నెగ్గి, ఎగబడి అడ్మిషన్స్ పొందుతున్నారు. జాతుల, మతాల, భాషల, వైవిధ్యభరితమైన సంస్కృతి – సాంప్రదాయాల సమ్మేళనంగా మినీ ప్రపంచ కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి.

ఆ విశ్వవిద్యాలయాల్లోని విజ్ఞాన గనుల నుండి సాధ్యమైనంత విజ్ఞానార్జన చేయాలన్న తపనతో విద్యార్థులు, శాస్త్ర – సాంకేతిక – సామాజిక రంగాలకు చెందిన అంశాల్లో నూతన ఆవిష్కరణలతో చరిత్ర పుటలకెక్కాలన్న సంకల్పంతో అధ్యయనంలో నిమగ్నమై, శ్రమిస్తున్న యువపరిశోధకులతో ఆ ఉన్నత శ్రేణి విద్యా సంస్థల ఆవరణాలు, ఆ నగరాల పురవీధులు కళకళలాడుతూ కనిపించాయి.

ఆ యువత నూతన ప్రపంచాన్ని నిర్మించబోయే మేధావి వర్గం. వారికి భౌగోళిక, రాజకీయ సరిహద్దులు లేవు. వారిని చూస్తుంటే ముచ్చటేసింది. ప్రపంచ ప్రగతికి విద్యాధిక యువతే ఆశాజ్యోతి అన్న విశ్వాసం మరింత బలపడింది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనవర్సిటీ పుట్టుపూర్వోత్తరాలు మొదలుకొని నేడు ప్రపంచ పటంలో అత్యున్నత విశ్వవిద్యాలయంగా ఎదిగిన క్రమాన్ని తెలుసుకున్నాను. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ విశ్వవిద్యాలయాల పరిపాలనా వ్యవస్థల పనితీరు, ఉన్నత విద్యా ప్రమాణాల్లో నూతన శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో అధ్యయనం, పరిశోధనలు చేస్తూ, విజ్ఞాన రంగంలో నూతన ఆవిష్కరణలతో మానవాళికి ఎనలేని సేవలందిస్తున్నాయి. సంపూర్ణ స్వయం ప్రతిపత్తితో రాణిస్తున్నాయి.

రాజకీయ జోక్యంగానీ, ప్రభుత్వ పెత్తనంగానీ విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో వీసమెత్తు కూడా లేదని చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుండి ఆర్థిక వనరులు పుష్కలంగా లభిస్తున్నాయి.

మరి మన సంగతేంటి? మన దేశంలో పేరెన్నికగన్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మొదలుకొని కేంద్ర విశ్వవిద్యాలయాల వ్యవహారాలను పరిశీలిస్తే మోడీ ప్రభుత్వ నిర్వాకం బోధపడుతుంది. తెలుగు నాట ప్రసిద్ధికెక్కిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వరకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న వ్యవహారాల తీరుతెన్నులను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పోకడలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో! బోధపడుతుంది.

నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. తిరుపతి ఎస్.వి.ఆర్ట్స్ కాలేజీలో, 1975 -78లో బి.కాం; చదివాను. 1978-80లో ఎస్.వి.యూనివర్సిటీలో తత్వశాస్త్ర విద్యార్థిగా విద్యనార్జించి, యం.ఏ. పట్టా పుచ్చుకున్నాను.

నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో సెమిస్టర్ పరీక్షా విధానం లేదు. వార్షిక పరీక్షల విధానం అమలులో ఉండేది. ఏడాది చివరలో రోజుకొక సబ్జెక్ట్ పరీక్ష నిర్వహించే పద్ధతి అమలులో ఉండేది. పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహిస్తే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్.) తరుపున విజ్ఞప్తి చేశాం. విశ్వవిద్యాలయం స్పందించక పోవడంతో ఆందోళన చేశాం. నాడు విశ్వవిద్యాలయం వైస్ – ఛాన్సలర్ గా ప్రముఖ విద్యావేత్త ప్రొ.సచ్చిదానందమూర్తిగారు ఉన్నారు. మా ఆందోళన వారి దృష్టికి వెళ్లింది. వారు సానుకూలంగా స్పందించి రోజు మార్చి రోజు పరీక్ష నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు. విద్యావేత్తలు వైస్ – ఛాన్సలర్స్ గా ఉంటే విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ మెరుగౌతుందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

వైస్ – ఛాన్సలర్స్ నియామకం రాను రాను ఒక ప్రహసనంగా తయారయ్యింది. పాలక పార్టీకి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేసే వ్యక్తులను, కులం మరియు ప్రాంతం ప్రాతిపదికగా నియమించబడుతున్నారు. నేడు పరాకాష్టకు చేరుకొన్నది.

నా చిరకాల మిత్రుడు గాలి నాగరాజు పోస్టును ఫేస్ బుక్ లో చదివాను. విశాఖపట్నానికి చెందిన మన ఆడపడుచు, ఆంధ్రా యూనివర్సిటీలో పట్టభద్రురాలైన డా.నీలిమా బెండపూడి అమెరికాలో పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ (వైస్ – ఛాన్సలర్)గా ఉన్నారట. మన ప్రధాని మోడీగారు ఆమెతో ప్రత్యేకంగా కలిసిన ఫోటో కూడా జత చేశారు. ఒకనాడు మన దేశంలో కూడా సంకుచిత రాజకీయాలకు అతీతంగా సమర్థులు, విద్యావేత్తలు వైస్ – ఛాన్సలర్స్ గా నియమించబడేవారు. నేడాపరిస్థితి మృగ్యం.

మన విశ్వవిద్యాలయాల్లో కులతత్వ శక్తులు దశాబ్దాలుగా వేళ్ళూనుకొని ఉన్న మాట నిజమే! ఎస్.వి. యూనివర్సిటీలో కులతత్వ శక్తులతో ఢీ అంటే ఢీ అని ఎదురొడ్డి నిలిచి, ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏ.ఐ.ఎస్.ఎఫ్. జెండాను సమున్నతంగా ఎగరేసిన చరిత్రకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ ఉద్యమ నిర్మాణంలో నాయకత్వ స్థానంలో ఉండి క్రియాశీల పాత్ర పోషించిన వాడిని.

విశ్వవిద్యాలయ వ్యవస్థలో ఉన్నతమైన ప్రొఫెసర్స్ స్థానాల్లో ఉన్న కొందరు అధ్యాపకులు విద్యార్థుల్లో కుల భావాలను ప్రోత్సహించి, పెంచి పోషించే వారు. వారికి కొందరు వైస్ – ఛాన్సలర్స్ వత్తాసు పలికేవారు. నాడు కులతత్వ శక్తులు రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలను జారుడు బండ ఎక్కించాయి. నేడు కులతత్వ, అవకాశవాద, పచ్చి స్వార్థపర శక్తులు, సంకుచిత రాజకీయ శక్తులు, వారికి ప్రభుత్వం తోడై విశ్వవిద్యాలయాలను పతనావస్థకు చేర్చారు. విశ్వవిద్యాలయాల పరువు, ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారాయి.

ఒకనాడు అధ్యాపకుల కొరత, నేడు అధ్యాపకులేలేని దుస్థితి. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పదవీ విరమణ చేసిన వారు 65 సం.ల వయస్సు వరకు కాంట్రాక్టు ఒప్పందంపై అధ్యాపకులుగా కొనసాగడానికి వీలుకల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఈ దుస్థితికి అద్దం పడుతున్నది.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ పోస్టులన్నీ ఖాళీగా పడిఉన్నాయని, కేవలం హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నారని, వారు కూడా రెండు మూడేళ్లలో రిటైర్ అయిపోతారని, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులంతా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని, కొద్ది రోజుల క్రితం నన్ను కలిసిన ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి చెప్పాడు. ఏడాది క్రితం నేను ఎస్.వి.యూనివర్సిటీకి వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని కొందరు విద్యార్థి మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చారు.

విశ్వవిద్యాలయాలకు సక్రమంగా నిధులు మంజూరు కావడం లేదట. యు.జీ.సీ. నుంచి రీసెర్చ్ స్కాలర్స్ కు మంజూరు కావలసిన ఉపకారవేతనాలు కూడా దాదాపు ఆగిపోయాయట. కొన్ని విభాగాల్లో ప్రవేశాల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరిచడం లేదట. వాటిపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడంలేదని చెప్పారు. దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

“విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి” అన్న మాటను పాలకులు, తమ నిఘంటువుల్లోనే లేకుండా తొలగించారు. వైస్ – ఛాన్సలర్స్ కుర్చీల్లో భజనపరులను పదిలంగా కూర్చోబెట్టారు. ఖాళీగా ఉన్న వాటిలో కూడా అలాంటి వారినే కూర్చోబెట్టడానికి కసరత్తులు చేస్తున్నారు. స్వామిభక్తి ప్రదర్శించడంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి అగ్రస్థానంలో నిలిచారని పుంఖానుపుంఖాలుగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యుల మరియు సలహాదారుల జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా మార్చారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనాన్ని రాజంపేట యం.పి. కటౌట్స్ తో నిపేసిన దృశ్యాన్ని చూసి, ఆవేదనతో స్పందించి, గతంలో సోషల్ మీడియాలో నేను ఒక పోస్టు కూడా పెట్టాను. విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించే గుణమే ఈ ప్రభుత్వానికి లేదు.

మన విశ్వవిద్యాలయాలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ వగైరా యూనివర్సిటీలతో పోటీతత్వంతో నిలుస్తాయా! మేలిరకం మేధావులను సమాజానికి అందించగలవా! విశ్వ వ్యాపిత ఖ్యాతిని ఆర్జిస్తాయా! ముఖ్యమంత్రిగారు… ఆలోచించండి!

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE