విజయవాడ:- శ్రీ చైతన్య విద్యా సంస్ధల అధినేత బీ.ఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బీ.ఎస్ రావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…. బీఎస్ రావు విజనరీ ఉన్న వ్యక్తి, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారు. బీఎస్ రావు దంపతులు డాక్టర్లుగా ఇంగ్లాండ్, ఇరాన్ లో 12 ఏళ్లు వైద్య సేవలందించారు. పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో విద్యాసంస్ధను స్ధాపించారు. మహిళల విద్యాభివృద్ది కోసం మొదట పాఠశాల ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 21 రాష్ట్రాల్లో 321 జూనియర్ కాలేజీలు, 430 స్కూల్స్ స్ధాపించారు.
వీటి ద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీ.ఎస్ రావుతో సహా పలు విద్యాసంస్ధల అధినేతల్ని పిలిచి విద్యార్దులకు ఐఐటీ కోచింగ్ ఇవ్వాలని ప్రోత్సహించాను. ఐఐటీ సీట్లలో గతంలో మనకు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే వచ్చేవి.
కానీ నేడు రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఐటీలో 25 శాతం సీట్లు వస్తున్నాయంటే దీనికి ప్రధాన కారణం నాడు బీ.ఎస్ రావు చేసిన కృషి. బీఎస్ రావు వేసిన పునాదిని భావితరాలకు అందేలా శ్రీ చైతన్య కుటుంబ సభ్యులు సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు కోరారు.