– జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం గంజాయి కేపిటల్
– గంజాయి, డ్రగ్స్ వెనుక వైసీపీ నేతల హస్తం
– డ్రగ్స్ మత్తులో ఏపీలో పెరిగిన నేరాలు-ఘోరాలు
– గవర్నర్ గారికి అన్ని ఆధారాలు అందించాను
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుని ఉడ్తా పంజాబ్ ఎలా అయ్యిందో చూశాం..జగన్ రెడ్డి పాలనలో మన రాష్ట్రం ఉడ్తా ఆంధ్రప్రదేశ్ కాకూడదనే నేను పోరాడుతున్నానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను శనివారం కలిసిన లోకేష్ డ్రగ్స్ వల్ల ఏపీలో జరుగుతున్న అనర్థాలు వివరించారు. యువగళం పాదయాత్రలో గంజాయి బాధిత కుటుంబాలు తనకి తెలియజేసిన వేదనని గవర్నర్ ముందుంచారు. ఏపీలో విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్ పర్యవసానాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి, డ్రగ్స్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కి నివేదించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జాబ్ కాపిటల్ గా ఉండేదని, జగన్ సీఎం అయ్యాక గంజాయి కేపిటల్ గా మారిందన్నారు. బడిలో గంజాయి, గుడిలో గంజాయి, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తేలుతోందన్నారు. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతుండగా ఒక మహిళ తన కుమార్తెకి గంజాయి మాఫియా వల్ల జరిగిన అన్యాయాన్ని వివరించింది. వైకాపా నేతలు ఆమె కూతురిని గంజాయికి బానిసని చేసి, లైంగికంగా దాడి చేశారు. నిండా 15 ఏళ్లు లేని ఆ అమ్మాయి వైసీపీ గంజాయి ముఠాలకి పావుగా మారిపోయిందని తెలిసి షాక్ కి గురయ్యానని, ఆ అమ్మాయిని డీఅడిక్షన్ సెంటర్‌కి పంపించి, వైద్యం చేయిస్తున్నానని తెలిపారు.
పాదయాత్ర దారిపొడవునా గంజాయి బారిన పడిన బాధితుల విషాదగాథలతో ఈ మహమ్మారిపై పోరాడాలని నిర్ణయించుకుని, గంజాయిపై యుద్ధం ప్రకటించామని తెలిపారు. `గంజాయి వద్దు బ్రో` పేరుతో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో ఏ నేరం జరిగినా, ఏ ఘోరం చోటు చేసుకున్నా దాని వెనుక గంజాయి ఉంటోందన్నారు.
గంజాయి మత్తులోనే టెన్త్ స్టూడెంట్ అమర్ నాథ్ గౌడ్ ని వైకాపా నేతలు తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారని, గంజాయి గ్యాంగులు రేప్‌లు , హత్యలకి పాల్పడుతున్నా చర్యల్లేవన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి వల్లే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారని, వీటన్నింటినీ ఆధారాలతో సహా గవర్నర్ కి ఇచ్చామని లోకేష్ తెలిపారు.
గంజాయి పంట, రవాణా, అమ్మకం వరకూ మొత్తం దీని వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు. గంజాయి వల్లే కుటుంబాలే నాశనం అయ్యాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్కూళ్లలోనూ గంజాయి గుప్పుమంటోందన్నారు. గంజాయి లేనే లేదు అని ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే స్కూలులో గంజాయి దొరకడం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోందన్నారు.
గంజాయి మాఫియాతో దేశభద్రతకి పెనుముప్పు
గంజాయి, డ్రగ్స్ దేశభద్రతకి సంబంధించిన అంశమని, నేరాలు-ఘోరాలు పెరగడంతోపాటు అంతర్జాతీయ ముఠాల కార్యకలాపాలు, హవాలా దేశానికే ప్రమాదంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం దేశంలోనే గంజాయి, డ్రగ్స్ అతి ఎక్కువగా దొరికింది ఆంధ్రప్రదేశ్‌లోనే అని తేలింది.
దొరికిన గంజాయి 18 టన్నులుంటే, దొరకనిది ఇంకెంత ఉందో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. చివరికి దేశంలో ఎక్కడ గంజాయి, ఇతర డ్రగ్స్ పట్టుకున్నా వాటి ట్రేడింగ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కావడం ఆందోళనకర అంశమన్నారు. దీనిపై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, రాంగోపాల్ వర్మతో తనపై సినిమా తీయించుకునే భేటీలలో బిజీగా ఉండటం మన దురదృష్టమన్నారు.
గంజాయి నిరోధంపై డిజిపితో సమీక్ష చేయకపోవడం గంజాయి మాఫియా వెనుక సీఎం ఉన్నారని అనుమానించాల్సి వస్తోందని, రాష్ట్రంలో ఒక తరాన్ని నాశనం చేశారని ఆవేదన చెందారు. పాలకులు గంజాయి మాఫియాలకి వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి, డ్రగ్స్ జోలికి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాదయాత్రలో అల్లర్లు సృష్టించే కుట్రలు
యువగళం పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, తనపైనా అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలకి సీఐలని కాపలా పెట్టడం వైకాపా బరితెగింపుని స్పష్టం చేస్తోందన్నారు. గొడవలు సృష్టించి టిడిపి వారిపైనే రివర్స్ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. శ్రీకాళహస్తిలో రాళ్ల దాడికి వైకాపా యత్నించగా, టిడిపి కేడర్ తిరుగుబాటు చేసేసరికి పారిపోయారని వెల్లడించారు. ప్రొద్దుటూరులో కోడిగుడ్లతో దాడులు చేశారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని, పాదయాత్రకి భద్రత కల్పించాలని కోరానని తెలిపారు.
వలంటీర్లు డేటా సేకరణ చట్ట విరుద్ధం
రాజ్యాంగబద్ధంగా ఉన్న స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు పనిచేయాలని, వలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నది తెలుగుదేశం విధానం అని లోకేష్ స్పష్టం చేశారు. వలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రగిరిలో వలంటీర్ల ద్వారా డేటా సేకరణ చేశారని, వలంటీర్లంతా వైకాపా కార్యకర్తలేనని విజయసాయిరెడ్డి గతంలోనే ప్రకటించారని..ఇదంతా చూస్తుంటే వైకాపా కోసం వలంటీర్ల వ్యవస్థని వాడుతున్నారని స్పష్టం అవుతోందన్నారు.
వలంటీర్లయినా, మరెవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండగా, వలంటీర్ల ద్వారా మళ్లీ సమాచార సేకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచార సేకరణ చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు.
ముందస్తు ముచ్చట సజ్జలనే అడగండి
వైకాపా సర్కారు ముందస్తు ఎన్నికలకి వెళ్తుందనే సంకేతాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా “అన్ని విషయాలు మాట్లాడే సజ్జలని అడగండి“ అంటూ వ్యంగ్యంగా స్పందించారు లోకేష్. జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్లాలంటే ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా..? అంటూ ముగించారు.