Suryaa.co.in

Editorial

‘కమల’ కుటుంబం!

– వారసులతో వికసిస్తున్న కమలం
– వారసత్వానికి వ్యతిరేకమంటూ అగ్రనేతల ప్రకటనలు
– ప్రాంతీయపార్టీలపై ‘వారసత్వ వార్‌’
– అవి కుటుంబపార్టీలంటూ ధ్వజం
– మోదీ నుంచి కిషన్‌రెడ్డి వరకూ అవే ఆరోపణలు
– పరివార్‌ పార్టీలంటూ బీఆర్‌ఎస్‌, వైసీపీ, టీడీపీలపై బీజేపీ నేతల ముద్ర
– ‘పువ్వుపార్టీ’లోనూ వికరిస్తున్న పరివారం
– యుపి, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీలో వారసులకే పదవులు
– ఆంథ్ర-తెలంగాణలోనూ వర్ధిల్లుతున్న కుటుంబ వారసత్వం
– పివి, మర్రి, డీఎస్‌,నల్లారి వారసులంతా బీజేపీలోనే
– బీజేపీలో దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది వారసులకు పదవులు
– అయినా ప్రాంతీయపార్టీలపై కుటుంబ వారసత్వపు ముద్ర
– బీజేపీ.. భలే భలే
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘అవి కుటుంబపార్టీలు. వాటిలో కుటుంబసభ్యులే పార్టీలను నడిపిస్తారు. మేం పరివార్‌ పార్టీలకు దూరంగా ఉంటాం. మా పార్టీలో వారసత్వ రాజకీయాలకు స్థానం లేదు. మాది పులుకడిగిన పువ్వుపార్టీ’’.. ఇదీ ప్రధాని మోదీ నుంచి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వరకూ ప్రాంతీయ పార్టీలపై విసిరే విసుర్లు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో , బహిరంగసభ వేదికలపై చేసే విమర్శలు. తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నది ప్రతి బీజేపీ అగ్రనేత చేసే స్పష్టీకరణ.

ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ.. సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని, దానిని తరచూ పరివార్‌ పార్టీగా అభివ ర్ణిస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వంటి ప్రముఖులంతా.. బీఆర్‌ఎస్‌ను కుటుంబపార్టీగానే ముద్ర వేస్తున్నారు. కేసీఆర్‌, కవిత, కేటీఆర్‌, హరీష్‌, సంతోష్‌లను దృష్టిలో ఉంచుకునే, బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారన్నది.. మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

అటు మొన్నటివరకూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కో ఇన్చార్జి సునీల్‌ దియోధర్‌ వంటి అగ్రనేతలు కూడా వైసీపీ, టీడీపీ నుద్దేశించి.. ఇలాంటి విమర్శలే సంధించారు. తాము కుటుంబపార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని, సోము వీర్రాజు కొన్ని డజన్ల సార్లు స్పష్టం చేశారు. కుటుంబపార్టీలతో దేశానికి ప్రమాదమని, వారికి జాతీయ భావం ఉందని విమర్శలు చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన గొప్ప పార్టీగా చెబుతుంటారు.

కానీ వాస్తవంలో బీజేపీ నేతల ప్రకటనలు అందుకు పూర్తి విరుద్ధం. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది వారసులు, బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నారన్నది తిరుగులేని నిజం. ప్రధానంగా దేశంలోకెల్లా పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనే సగానికి పైగా వారసులు బీజేపీలో కొనసాగుతున్నారు. రాజస్థాన్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, బీహార్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాల్లో కూడా బీజేపీలో పనిచేసిన కీలక నేతల వారసులు.. ఆయా రాష్ర్టాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న వాస్తవాన్ని, బీజేపీ జాతీయ నేతలు వ్యూహాత్మకంగా విస్మరించడమే విచిత్రం.

మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ రించిన్‌కరు కుమారుడు కిరణ్‌ రిజుజు.. వాజపేయి మంత్రివర్గంలోని దేవేంద్రప్రధాన్‌ కుమారుడు ధర్మేంద్రప్రధాన్‌.. అదే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేదప్రకాష్‌ కుమారుడు, పియూష్‌ గోయల్‌.. టీడీపీ హయాంలో సలహాదారు, అంతకుముందు బీజేపీఅధికార ప్రతినిధిగా ఉన్నసీనియర్‌ నేత పరకాల ప్రభాకర్‌ భార్య, నిర్మలాసీతారామన్‌; హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం ప్రేంకుమార్‌ ధుమాల్‌ కుమారుడు, అనురాగ్‌ ఠాకూర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కర్నాటక మాజీ సీఎం ఎస్సార్‌బొమ్మై కుమారుడు, బస్వరాజ్‌బొమ్మై కూడా కర్నాటక సీఎంగా పనిచేశారు.

కేంద్రమంత్రి రాజనాధ్‌సింగ్‌ కుమారుడు, పంకజ్‌సింగ్‌ యుపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. హర్యానా మాజీ సీఎం రావ్‌ బీరేంద్రసింగ్‌ తనయుడు, రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌ కేంద్రమంత్రిగా, మరో కేంద్రమంత్రి నారాయణ్‌రాణే కుమారుడు, నైలేష్‌ రాణే ఎంపీగా పనిచేశారు. అప్నాదళ్‌ అధినేతసోనేలాల్‌ పటేల్‌ కుమార్తె, అనుప్రియ పటేల్‌; మాజీ కేంద్రమంత్రి అర్జున్‌పవార్‌ కోడలు, భారతీ ప్రవీణ్‌ పవార్‌; బెంగాల్‌ మాజీ మంత్రి మంజుల్‌ఠాకూర్‌ కొడుకు, శంతన్‌టాకూర్‌ కేంద్రమంత్రులుగా ఉన్నారు. బెంగాల్‌లో ఎంపి శిశిర్‌ అధికారి కొడుకు, సువేందు అధికారి ఎమ్మెల్యే; బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌వర్గియా కొడుకు, ఆకాష్‌ ఎమ్మెల్యే; మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌ ఫడ్నవీస్‌ కొడుకు, దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి; కాంగ్రెస్‌లో కీలకనేత జితేంద్రప్రసాద తనయుడు, జితిన్‌ ప్రసాద యుపి మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.

ఇక దివంగత కేంద్రమంత్రి ప్రమోద్‌మహాజన్‌ కుమార్తె.. పూనం మహాజన్‌ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలు- ఎంపిగా చేస్తున్నారు. కేంద్రమాజీ మంత్రి జస్వంత్‌సింగ్‌, యశ్వంత్‌సిన్హా కుమారులిద్దరూ ఎంపీలుగా చేసినవారే. రాజమాత విజయరాజే సింధియా కుమార్తె వసుంధరాజే సింథియా, మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. ఈ కుటుంబం అంతా వివిధ పదవుల్లో ఉన్నవారే కావడం గమనార్హం.

సూరజ్‌భాన్‌ కూతురు ఎమ్మెల్యే; , గవర్నర్‌ కలరాజ్‌మిశ్రా కొడుకు.. చత్తీస్‌గఢ్‌ సీఎంగా పనిచేసిన రమణసింగ్‌ కొడుకు ఎంపీ; మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం సుందర్‌లాల్‌ పట్వా కొడుకు, సురేంద్ర పట్వా మంత్రిగా; కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇద్దరు కోడుకుల్లో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీలుగా; ఎంపి లక్ష్మీకాంత్‌శర్మ కొడుకు ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తుండటం ప్రస్తావనార్హం. ఇక కర్పూరిఠాకూర్‌, వీరేంద్రకుమార్‌ చక్లీచా, గంగాప్రసాద్‌, సిపి ఠాకూర్‌ శకుని చౌదరి, ఆర్‌కె సిన్హా, నారాయణ్‌దత్‌, మదన్‌జైస్వాల్‌ కుమారులంతా ఎంపి, పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు.

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి,  ఏపీకి కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా,  గతంలో బీజేపీలో పనిచేసిన నాయకుడే. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు సీఎం, పురందీశ్వరి సోదరుడు హరికృష్ణ, మేనల్లుడు లోకేష్ మంత్రులుగా పనిచేశారు. మరో సోదరుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే.

ఏపీలో సీనియర్‌ నేత పివి చలపతిరావు కుమారుడు మాధవ్‌ ఎమ్మెల్సీగా చేశారు. యడ్లపాటి రఘునాధరావు కుటుంబం అంతా బీజేపీలోనే ఉంది. ఎమ్మెల్సీగా చేసిన సీనియర్‌ నేత జూపూడి యజ్ఞనారాయణ కుమారుడు జూపూడి రంగరాజు, ఆయన తల్లి కూడా బీజేపీలోనే ఉన్నారు. రాయలసీమ నుంచి తొలి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పార్ధసారధి తనయుడు, బీజేవైఎంలో ఉన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాధ్‌రెడ్డి కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేశారు. కిరణ్‌ తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీలో చురుకుగా పనిచేస్తున్నారు.

ఇక తెలంగాణలో మాజీ ప్రధాని పివి నరసింహారావు మనుమడు ఎన్వీ సుభాష్‌; మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రిశశిధర్‌రెడ్డి; మాజీ ఎంపి జంగారెడ్డి కుమార్తె చందుబట్ల కీర్తిరెడ్డి; కెవి రంగారెడ్డి మనుమడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో వివిధ హోదాల్లో ఉన్నారు. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శృతి పార్టీలో కీలకపదవిలో కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తనయుడు పార్టీలోనే ఉన్నారు. పీసీసీ మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్‌ తనయుడు, ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు.

మాజీ ఎంపి వెంకటస్వామి తనయుడు జి.వివేక్‌, జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఉన్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌ తనయుడు, తూళ్ల వీరేందర్‌గౌడ్‌ పార్టీలో ఉన్నారు. దివంగత మాజీ ఎంపి ఆలె నరేంద్ర తనయుడు కార్పొరేటర్‌గా ఉండగా, ఆయన కుటుంబం నుంచి మరొకరు, ఎల్బీనగర్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ఇక గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె రానున్న ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ గవర్నర్‌ విద్యాసాగర్జీ- మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో, తమ తనయులను అరంగేట్రం చేయించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈవిధంగా ఇన్ని డజన్ల మంది వారసులు పువ్వు పార్టీలో పనిమళిస్తుండగా.. తమది కుటుంబపార్టీ కాదని బీజేపీ నేతలు చెప్పడమే వింత. అయితే.. దీనికి సంబంధించిన సరైన సమాచారం బీజేపీ ప్రత్యర్ధుల వద్ద లేకపోవడమే, ‘‘బీజేపీ కుటుంబపార్టీ కాదన్న భావన’’కు కారణంగా కనిపిస్తోంది. కాబట్టి కమలం కూడా, కుటుంబ రాజకీయాలకు అతీతం కాదని స్పష్టమవుతోంది. అన్నీ ఆ తాను ముక్కలే!

కమల వనంలో ఉన్న కుటుంబాలపై చర్చిద్దామా: దాసోజు శ్రవణ్ సవాల్

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బీజేపీ ప్రవచిత నైతిక రాజకీయ సిద్ధాంతాలున్నాయని బీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ‘ కోడలికి సుద్దులు చెప్పే అత్త తెడ్డు నాకిందన్న సామెత బీజేపీకి సరిపోతుంది. కుటుంబపాలన అంటూ ప్రాంతీయ పార్టీలపై ఆరోపణలు చేసే బీజేపీలో, మొత్తం ఎంతమంది కుటుంబసభ్యులున్నారో చర్చకు సిద్ధమా? ఉత్తరాదిలో తండ్రులు, కొడుకులు, కూతుర్లు, కోడళ్లకు ఎంతమంది ముఖ్యమంత్రి, ఎంపి,ఎమ్మెల్యే, మంత్రి పదవులిచ్చారో చర్చిద్దామా? తెలంగాణలో ఎంతమంది కుటుంబసభ్యులు బీజేపీలో ఉన్నారో లెక్క తేలుద్దామా? ఏపీలో మీ పార్టీ అధ్యక్షురాలు పురందీశ్వరి ఎక్కడ నుంచి వచ్చారో చెప్పే ధైర్యం, మాపై నిందలు వేసే మోదీ-అమిత్‌షాకు ఉందా? మరి కుటుంబపాలన మీదా? మాదా? మీ చేతులకు అంటిన మరకలు మాకు అంటిస్తే ఎలా? మీది బురదలో ఉన్న పువ్వుపార్టీ. ఆ బురద అందరికీ అంటించాలంటే ఎలా? ముందు కుటుంబసభ్యులతో నిండిన మీ కమలవనంలో ఉన్న వారిని పంపించిన తర్వాత, ఇతర పార్టీల గురించి మాట్లాడితే మీ సొల్లు కబుర్లు ఎవరైనా నమ్ముతారు. అప్పటివరకూ కుటుంబపార్టీలపై మాట్లాడే హక్కు మీకు ఉండదు’’ అని దాసోజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

LEAVE A RESPONSE