– ఎన్నికల వేళ ఏపీకి బీజేపీ ఝలక్
– కడప స్టీల్, రైల్వేజోన్, భారీ పోర్టులపై చేతులెత్తేసిన కేంద్రం
– విభజన హామీల్లో కొన్ని ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయట
– విభజన హామీలు తెలంగాణతోనే తేల్చుకోవాలట
– తాను కేవలం మధ్యవర్తిని మాత్రమేనని తేల్చిన కేంద్రం
– కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని స్పష్టీకరణ
– కేంద్రమంత్రి జవాబులో కనిపించని అస్పష్టత
– కేంద్రానికి వైసీపీ మద్దతునిస్తున్నా పట్టించుకోని నిర్లక్ష్యం
– ఎన్నికల ముందు తమను బీజేపీ ఇరికించిందంటూ వైసీపీ ఫైర్
– జగన్‌పై విపక్షాలకు అస్ర్తాలిచ్చిన బీజేపీ
– కమలం కావాలనే ఇరికించిందా?
– ఎన్నికల వేళ ఇరకాటంలో వైసీపీ
– మరి పార్లమెంటులో రణమా? రాజీనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎగిరెగిరి దంచినా అదే కూలీ. ఎగరకుండా దంచినా అదే కూలీ సామెత మాదిరిగా తయారయింది వైసీపీ పరిస్థితి. బీజేపీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టే అన్ని బిల్లులనూ కళ్లుమూసుకుని ఆమోదిస్తున్న వైసీపీ శ్రమదానం చేస్తున్నా ఫలితం లేని విషాదం. అయినా ఏపీని ఖాతరు చేయని కేంద్ర నిర్లక్ష్యం, మరోసారి పార్లమెంటుసాక్షిగా బట్టబయలయింది. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా, విభజన హామీలు పట్టించుకోని బీజేపీ సర్కారు.. ఏపీ ప్రజల చిరకాల వాంఛితాలనూ చెత్తబుట్టలపాలు చేసింది.
ఫలితంగా రాష్ట్రంలో విపక్షాలకు బీజేపీ తానే అస్ర్తాలిచ్చింది. కీలకమైన ఎన్నికల వేళ నిస్సహాయురాలిగా మిగిలిన అధికార వైసీపీ దారెటు? మరిప్పుడు వైసీపీ అధినేత-సీఎం జగన్ ఏం చేస్తారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై రణమా? మళ్లీ రాజీనా?.. ఇదీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్.
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందంటే ఇదే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా.. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఇచ్చిన సమాధానం, అధికార వైసీపీని రాజకీయంగా సంకటస్థితిలోకి
నెట్టింది. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, కేంద్రమంత్రులపై ఒత్తిడి చేస్తున్నామని, సొంత నియోజకవర్గాల్లో మీడియా ముందు చెప్పే ఎంపీలను, కేంద్రమంత్రి ఇచ్చిన జవాబు అయోమయంలో పడేసింది. ప్రధానంగా కడప జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులకు, ముఖం చూపించలేని నిస్సహాయ స్థితిలో పడేసింది.
రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులేవీ కేంద్రం ఆమోదించలేదు. వాటిని చెత్తబుట్టలో వేసినట్లు, కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం స్పష్టం చేసింది. దీనితో ఇక విపక్షాలు తమపై సంధించే వైఫల్య అస్త్రాలను, ఎలా ఎదుర్కోవాలన్న ఆత్మరక్షణలో పడటం వైసీపీకి అనివార్యంగా మారింది.
కడపలో స్టీల్‌ఫ్యాక్టరీ గురించి సీఎం జగన్, వైసీపీ ఎంపీ-ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా గంభీరమైన ఉపన్యాసాలిచ్చారు. అది రాయలసీమ ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధించి తీరతామని శపథం చేశారు. కానీ తాజాగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్, పార్లమెంటులో ఇచ్చిన సమాధానం వారిని షాక్‌కు గురిచేసింది.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై,
ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అయితే దాని నివే దిక సమర్పించేందుకు ఎంతకాలం పడుతుంది? దానికి కాలపరిమితి ఉందా? లేదా? అన్న విషయం మాత్రం ప్రకటించకపోవడం ఆశ్చర్యం.
ఇక ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛితమైన, రైల్వే జోన్ కూడా అటకెక్కినట్లేనని కేంద్రమంత్రి తాజా ప్రకటనలో స్పష్టమయింది. ప్రత్యేక రైల్వే జోన్‌కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటుకు, 2022లో 106.89 కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు.
అందులో భాగంగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను, 10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అంటే మిగిలిన నిధులు ఎప్పుడు ఇస్తారు? ఈరకంగా అయితే రైల్వేజోన్ ఎన్నేళ్లకు ఇస్తారు? అప్పటివరకూ రైల్వే జోన్ అటకెక్కినట్లేనా? అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.
కడప స్టీల్ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిన బీజేపీ సర్కారు.. కనీసం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించం అని చెబుతుందనుకున్న రాష్ట్రంపై ఆ కరుణ కూడా దక్కలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరించడాన్ని అడ్డుకుంటామని వైసీపీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన
ఉద్యమాలలో, వైసీపీ కూడా పాల్గొంది. కానీ కేంద్రమంత్రి తాజా ప్రకటనలో, ఆ ముచ్చటనే లేకపోవడం వైసీపీని ఇరుకున పడేసింది. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన.. విశాఖ స్టీల్- రైల్వేజోన్‌పై కేంద్రంలోని బీజేపీ కనికరించకపోవడం… కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీకి, రాజకీయంగా శాపంలా పరిణమించిందని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయనతోపాటు బీజేపీ అగ్రనేతలంతా.. విశాఖ రైల్వేజోన్ సాధిస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. సోము వీర్రాజయితే ఒక అడుగు ముందుకేసి.. రైల్వే జోన్ రాదని మీకెవరు చెప్పారని మీడియాపై విరుచుకుపడ్డారు. ఎంపి జీవీఎల్ కూడా మీడియా సమావేశాల్లో అదే హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో, అటు బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడినట్టయింది.
ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఈ రెండు అంశాలపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడాన్ని విస్మరించకూడదు.
ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అటు రైల్వే జోన్, ఇటు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం చేతులెత్తేయడంతో, పురందేశ్వరి రాజకీయ భవిష్యత్తు కూడా చిక్కుల్లో పడినట్లయింది.
పోర్టుల ఏర్పాటులోనూ బీజేపీ సర్కారు పిల్లిమొగ్గలు వేసి, రాష్ట్రానికి మొండిచేయి చూపినట్లు స్పష్టమయింది. సమీప ప్రాంతాల్లో ఉన్న పోర్టుల నుంచి ఎక్కువ పోటీ ఉండటంతో, దుగ్గరాజపట్నంలో ప్రధాన ఓడరేవు ఏర్పాటుకాలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దుగ్గరాజపట్నం బదులు.. రామాయపట్నం వద్ద మేజర్‌పోర్టు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్న కేంద్రమంత్రి.. దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై అయినందున, ఏపీ ప్రభుత్వం మైనర్పోర్టుగా డీనోటిఫై చేయాలని, లేదా మరో ప్రాంతాన్ని గుర్తించాలని సూచించినట్లు చెప్పారు.
ఇక విభజనహామీలపైనా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తి స్థాయిలో చేతులెత్తేసింది. విభజన హామీలో చాలావరకూ అమలుచేశామని చెప్పుకున్న కేంద్రమంతి.. మిగిలిన అంశాలను సమయానుకూలంగా సమీక్షిస్తామని, మిగిలినవి సమీక్ష దశలో ఉన్నాయని పిల్లిమొగ్గ వేయడం ప్రస్తావనార్హం. అయితే.. విభజనసమస్యలపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని, ఉచిత సలహా ఇచ్చిన కేంద్రమంత్రి.. కేంద్రం కేవలం మధ్యవర్తి పాత్రమాత్రమే పోషిస్తుందని తప్పించకోవడం ఆశ్చర్యం.
తాజా పరిణామాలు రాజకీయంగా వైసీపీని , సీఎం జగన్ వ్యక్తిగత ఇమేజ్‌ని దెబ్బతీసేలా ఉన్నాయని, వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తమకు ఎంపీ సీట్లు మొత్తం ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ అంశంలో కేంద్రంపై పోరాడటంలో విఫలమయ్యారన్న విమర్శలు, ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు.
ఆ విమర్శలు చాలవన్నట్లు… తాజాగా కీలరకమైన సమస్యలకు సంబంధించిన అంశాల్లో రాష్ర్టానికి మొండిచేయి చూపిన బీజేపీపై పోరాడాలా? లేక ఇప్పటిమాదిరిగా సర్దుకుపోవాలా? అన్న అంశం వైసీపీని వేధిస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో.. కేంద్రం రాష్ర్టానికి మొండి చేయి చూపిందన్న విమర్శలు, రాజకీయంగా తమ పార్టీకే నష్టమని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. కేంద్రానికి మద్దతునిస్తున్నా మీరేం సాధించారన్న ్రపశ్నలకు సమాధానం ఏం చెప్పాలన్నది వారి అసలు ఆందోళన.
ఎన్డీఏ భాగస్వామి కాకపోయినప్పటికీ.. ఇప్పటివరకూ కేంద్రానికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నప్పటికీ, తమను కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ దెబ్బకొట్టిందన్న ఆగ్రహం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఏపీకి మొండి చేయి చూపడం ద్వారా, తమ పార్టీపై బురదచల్లే విపక్షాలకు మరిన్ని అస్ర్తాలు ఇచ్చిందని, కమలంపై కస్సుబుస్సుమంటున్నారు.
మరి కేంద్రం తాజా వైఖరిపై, జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఆప్రకారంగా వైసీపీ ముందు రెండు దారులే కనిపిస్తున్నాయి. అది రణమా? రాజీనా? ఇప్పుడు జగనన్న తేల్చాల్సింది దానినే!