Suryaa.co.in

Telangana

రేవంత్‌.. చేతనైతే సాయం చెయ్‌.. లేకపోతే మూసుకుని కూర్చో!

– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌ బహిరంగ లేఖ
– కేటీఆర్‌కు రేవంత్‌లేఖపై దాసోజు ఫైర్‌

భారీవర్షాలతో క్లిష్టపరిస్థితిలో ఉన్న నగరంలో సహాయ కార్యక్రమాలు చేస్తున్న అధికారులు, సిబ్బంది నైతిక స్థైర్యం కోల్పోయేలా మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఈ సమయంలో క్షుద్ర రాజకీయాలు చేయడం సరైంది కాదని గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్చార్జి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ హితవు పలికారు. మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ లేఖ రాయడాన్ని ఎద్దేవా చేసిన శ్రవణ్‌..అందుకు బదులుగా రేవంత్‌కు ఘాటైన లేఖ సంధించారు. రేవంత్‌రెడ్డీ.. నీకు చేత నయితే నీ మల్కాజిగిరి ప్రజలకు సహాయం చెయ్‌. లేకపోతే మూసుకుని కూర్చో అంటూ ఘాటు లేఖాస్త్రం సంధించారు. దాసోజు లేఖ పూర్తి పాఠం ఇదీ..

టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు డా దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
రేవంత్ గారు.. మీరిచ్చిన జిహెచ్ఏంసి ముట్టడి పిలుపు, ప్రజల కోసమా లేక చిల్లర పబ్లిసిటీ రాజకీయాలకోసమా? ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటావా లేక ధర్నాల పేరుమీద అడ్డుకుంటావా? మీ ధర్నా డ్రామాలను పర్యవేక్షించాల్నా లేక ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు ప్రజలకు అండగా ఉండాల్నా ?

చిల్లర రాజకీయాలే ప్రామాణికమన్నట్లు మీరు విపత్కర పరిస్థితుల్లో పనికిమాలిన రాజకీయాలు చేయడం తగదు. ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఒక్కరికి హాని కలగకుండా, ఒక్క ప్రాణానికి నష్టం జరగకుండా జిహెచ్ఏంసి మరియు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకా మీ ముట్టడి?

చిన్న వర్షానికే ప్లాట్స్ సెల్లార్లలోకి నీరు చేరి జనం పడ్డ అవస్థలు ఇప్పుడు లెవనా? హైదరాబాద్ జనం ప్రాణాపాయంలో పడడం లేదనా? ఎందుకు మీ అక్కసు?

ఒక పక్కన అలవికాని రీతిలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న నాలాలు, ప్రజలు నానా ఇబ్బందులకు గురౌతుంటే, వారిని ఆదుకోవడం కోసం తమ ప్రాణాలని లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ జిహెచ్ఏంసి యంత్రాగం, పోలీసులు అహోరాత్రులు పనిచేస్తుంటే, తలకుమాసిన రాజకీయాలకోసం బుద్ది జ్ఞానం లేకుండా జిహెచ్ఏంసి పదివేల రుపాయల ఎక్స్ గ్రేషియా పేరుమీద ముట్టడి చేయడం ధర్మమా? మీ చర్యలవల్ల ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బదీయటం తగునా?

రేవంతు రెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనటానికి ఈ ముట్టడి పిలుపు స్పష్టమైన సంకేతం. ఏ పనికైనా సమయం సందర్భం ఉండాలి అంటారు.కానీ బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి, సమయం సందర్భం లేకుండా సందట్లో సడేమియా లెక్క ప్రభుత్వ సహాయక చర్యలు అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న జిహెచ్ఏంసి ముట్టడి ఒక చిల్లర పని మాత్రమే కాదు, అది సామాజిక నేరం కూడా.

ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతటి ఆపత్కాలంలో, విపత్కర పరిస్థితుల్లో ప్రజల కోసం వారిని పనిచేయనీయకుండా, వారి విధి నిర్వహణను అడ్డుకోవడం ముమ్మాటికీ నేరం. రేవంత్ రెడ్డి గారి మూర్ఖ రాజకీయ డ్రామాలకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, తలాతోకా లేని రేవంత్ రెడ్డి గారి లాంటోడు, చుట్ట కాల్చుకుంట, నిప్పు ఇస్తావ్ అడిగినట్లుంది రేవంత్ రాజకీయ డ్రామాలు చూస్తుంటే.

ఈ చిల్లర డ్రామాలు బందు చేసి, ప్రజలకు పనికివచ్చే నిర్మాణాత్మక రాజకీయం చేయాలని, లేనిచో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అనే విషయం గుర్తించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి. ఇక పోతే ఎవరికి ఎప్పుడు ఏమి సహాయం చేయాలి అనేది కెసిఆర్ కు నీకంటే బాగా తెలుసు. ఆపదలో ఉన్నవాళ్లకు చేతిలో ఎముక లేకుండా ఆదుకునే దొడ్డ మనసున్న నాయకుడు కెసిఆర్.

పార్లమెంటు సభ్యుడను అనే సోయి లేకుండ, ఓట్లేసి నిన్ను గెలిపించిన పాపానికి మల్కాజిగిరి ప్రజలను విస్మరించి చిల్లర రాజకీయాలు చేయడం తగదు. నీకు మానవత్వమే ఉంటే, నీకు సామజిక బాధ్యత ఉంటే మల్కాజిగిరి లో ప్రజలకు అందుబాటులో ఉండు. వారికీ సహాయ కార్యక్రమాలు చేపట్టు. లేదా చేతకాకపోతే ముడుసుకొని మూలకు కూర్చో. కానీ పనికి రాని రాజకీయాలు చేయవద్దు.

.రాష్ట్రంలో అతిపెద్ద ప్రకృతి విలయం ప్రజలను అతలాకుతలం చేస్తోంది ఎన్నడూ లేని విదంగా రాష్ట్రంలో 70-100 సెంటి మీటర్ల వర్షం పడింది.. ఉత్తర తెలంగాణ అల్లకల్లోలం అవుతుంటే ఒక బాధ్యతయుతమైన నాయకుడివే అయితే ప్రజల కష్టాలలో భాగం పంచుకోవాలి.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వరదలు వస్తుంటే గోతి కాడి నక్క లాగా చిల్లర రాజకీయాలు చేసే కక్కుర్తి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో కాంగ్రెస్ నాయకులే నిర్ణయించుకోవాలి.

ప్రకృతి వైపరీత్యాలు పాలకుల తప్పిదమా?
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి లో ఒక్క ముంపు ప్రాంతాన్ని అయిన రేవంత్ రెడ్డి గారు వెళ్లి చూసాడా.. ఢిల్లీ లో చిల్లర రాజకీయాలతో పూట గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి విషయంపై మాట్లాడే నైతికత లేదు.

హైదరాబాద్ అభివృద్ధి ఏం జరిగింది ఎంత జరిగింది, గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ గ్యాంగుల భూకబ్జాల గూర్చి, సాక్షాత్తు మీద్వారా ప్రస్తుతం ఇబ్బందులకు గురౌతున్న సామాన్య భూబాధితుల గురించి కూడా బహిరంగ చర్చ చేద్దాం. దానికి కూడా ఒక సమయం సందర్భం వస్తుంది.

అప్పటివరకు అగుడుపడకుండా, ఆగమాగం కాకుండా ప్రస్తుతం భారీ వర్షాల వల్ల బాధపడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులను ఇబ్బంది పెట్టకండి. చేతనైతే మీ కార్యకర్తలను సహాయకార్యక్రమాల్లో నిమగ్నమైయ్యేలా పురమాయించండి కానీ ప్రభుత్వ సహాయక చర్యలలో మోకాలు అడ్డం పెట్టకండి.

ఇట్లు
డా దాసోజు శ్రవణ్
బిఆర్ఎస్

LEAVE A RESPONSE