-రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఆర్థిక ఆక్రమణదారుడు ఈ ముఖ్యమంత్రి
-మగువల భర్తల ఆరోగ్యాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేస్తున్న జమోరె
-మీ భర్తలు తాగితేనే అమ్మ ఒడి, విద్యా వసతి, దీవెన, విదేశీ విద్య వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తాడట
-మధ్య నిషేధం చేస్తామంటూనే భవిష్యత్తు మద్యం ఆదాయంపై అప్పులా?… ఇదెక్కడి విడ్డూరం!
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తరహాలో ఎవరైనా వ్యాపారస్తుడు తప్పు చేసి ఉంటే పదేళ్లు జైలు శిక్ష విధించేవారు. కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి శిక్షార్హుడు. జగన్మోహన్ రెడ్డి కి కూడా పదేళ్లపాటు జైలు శిక్ష వేయాలి. కానీ వేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దేశంలోనే అత్యంత పెద్ద మోసం. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని యదేచ్చగా ఉల్లంఘించిన ఘనత ఆర్థిక ఆక్రమణదారుడైన జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది. రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించి రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించిన వ్యక్తి జమోరె అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని మగువల భర్తల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జమోరె అప్పులు చేశారు. మహిళల పుస్తెలతాడులను ఒక విధంగా ఆయన చోరీ చేస్తున్నాడని చెప్పాలి. రానున్న 13 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులను చేసింది.
భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే అప్పు చేసి ఖర్చు చేస్తే, రాబోయే తరాల పరిస్థితి ఏమిటి?!. ఇలాంటి చెత్త నాయకులు రాజకీయాల్లోకి వస్తారని గ్రహించే కాబోలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగంలో 266/1, 293/3 అధికరణాలను పొందుపరిచారు. అయినా జగన్మోహన్ రెడ్డి తూ నా బొడ్డు అన్నట్లు, ఆ అధికరణలను ఎత్తి అవతల పడేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై నేను గతంలోనే ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి కి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖలు రాశాను.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని వారు తప్పు పట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే విషయమై నేను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాను. అయితే ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశాననే సాకుతో ,
న్యాయస్థానం కేసును కొట్టి వేసింది. నేను వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేయడంతో మరుసటి రోజు సాక్షి దినపత్రికలో తాటికయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించారు. ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట గతంలో 38.142 వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం, నేను వేసిన పిటీషన్ కొట్టివేసిన 48 గంటల వ్యవధిలో మరో 12 వేల కోట్ల రూపాయల అప్పును ఎత్తేందుకు సిద్ధమయ్యిందన్నారు.
ఎక్సైజ్ టాక్స్ పేరిట కొత్త టాక్స్ వేసి ఏపీ ఎస్ డి సి పేరిట 25 వేల కోట్ల అప్పు చేసిన జగన్ సర్కార్
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీ ఎస్ డి సి ) పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్ బీ ఐ కన్సార్టియం నుంచి 25 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎక్సైజ్ టాక్స్ అని కొత్త పన్నును కనిపెట్టి, ఆ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదాయంగా చూపెట్టారు. ఏ ఈ ఆర్ ఈ టి టాక్స్ ద్వారా ప్రతి ఏటా ఏపీ ఎస్ డి సి కి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పి, ఈ మొత్తం రుణాన్ని తీసుకున్నారు.
తీసుకున్న అప్పు అసలు, వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచే చెల్లించనున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ రుణ పరిమితి నుంచి మినహాయింపు పొందడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వక్ర మార్గాన్ని ఎంచుకుంది. ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదాయాన్ని దారి మళ్లించి, ఆ ఆదాయాన్ని కార్పొరేషన్ ఆదాయంగా చూపెడుతూ 25 వేల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని విమర్శించారు.
మద్యం రేట్లు తగ్గించాలన్న కుదిరే పని కాదు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడే ప్రభుత్వం మద్యపాన ప్రియులకు నాణ్యమైన మద్యాన్ని అందించి, రేట్లు తగ్గించాలని భావించిన అది కుదిరే పని కాదని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రానున్న 13 ఏళ్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అప్పు చేసింది. సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న నగదు ప్రజల కష్టార్జితమే… అది ప్రజల సొమ్మే.
ప్రజల కష్టాన్ని మద్యం పేరిట తాకట్టుపెట్టి, ప్రజల తోటే తీసుకున్న అప్పుకు జమోరె వాయిదాలను కట్టిస్తున్నాడు. ప్రజల ఆదాయాన్ని కొల్లగొట్టి రాజకీయ నేతలు సగం తినగా మిగిలిన డబ్బులను సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పంచుతున్నారు. భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి నగదు ఇచ్చేది లేదు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలి.
మగువల భర్తల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, మా దగ్గర ఇంతమంది తాగుబోతులు ఉన్నారని చెప్పి, తాగుబోతుల నుంచి తనకు ఇంత ఆదాయం లభిస్తుందని, మద్యం ధరలను పెంచి, మద్యపాన ప్రియుల చేత తాగిపించి… మహిళల పుస్తెలను తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు తెచ్చి, దానిలో సగం డబ్బులు కొట్టేసి… చిల్లర మెతుకులను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విసురుతున్నారని రఘురామకృష్ణం రాజు విరుచుకపడ్డారు.
రానున్న పదేళ్ల ఆదాయాన్ని ఈ సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టాడంటే, రానున్న పదేళ్లు ఆదాయం హుష్ కాకి అన్నది స్పష్టం అవుతుంది. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో మాదిరిగా వారికి కావలసింది వడ్డీ, మనకు కావలసింది అసలు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజలిచ్చిన పాత్రలలో సంపూర్ణంగా జీవిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనమవడం ఖాయం. బుద్ధున్నవారు ఎవరైనా మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు నేను సిద్ధం.
ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన 25 వేల కోట్ల రూపాయల అప్పుని 13 ఏళ్లలో చెల్లిస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అప్పటికి ఈ ప్రభుత్వం మాత్రం ఉండదు. ఆ అప్పు 75 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది . అప్పులు చేసి అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశారా అంటే అది లేదు. కేవలం ప్రభుత్వ రోజువారి ఖర్చుల కోసమే అప్పులు చేయడం విడ్డూరంగా ఉంది.
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై గతంలో ప్రధానమంత్రి కి, ఆర్థిక శాఖ మంత్రి కి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి నేను రాసిన లేఖలపై స్పందించి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకున్నది . కానీ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దున్నపోతు మీద వాన పడినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.
తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినందు వల్ల తప్పులు చేయరని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను అధిగమిస్తూ అప్పులు తీసుకోవడం ఆపలేదు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని మరలిచేందుకు ఈసారి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ పేరిట అప్పు చేశారు. రాష్ట్రంలో మద్యం పై 35 నుంచి 60 శాతం వ్యాట్ ( వ్యాల్యూ యాడెడ్ టాక్స్ ) తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాక్షి దినపత్రికలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రత్యేక కథనంగా రాశారు.
మద్యం పై వ్యాట్ తగ్గించడంతో మద్యపాన ప్రియులు సంకలు గుద్దుకున్నారు. అయితే వ్యాట్ తగ్గించడం ద్వారా, చౌకగా మద్యం లభిస్తుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి . వ్యాట్ తగ్గించడం ద్వారా లభించే ఆదాయాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తరలించకుండా, దాన్ని బేవరైజస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపెట్టి, కార్పొరేషన్ పేరిట రుణాన్ని పొందింది.
రాష్ట్రంలో జగన్ బంధుమిత్ర సపరివారంగా తయారు చేస్తున్న మద్యం బ్రాండ్లను, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ కొనుగోలు చేసి మద్యపాన ప్రియులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. రాష్ట్రంలోని 31 డిస్టలరీలు, నాలుగు బేవరేజెస్ లు జగన్మోహన్ రెడ్డి పాలెగాళ్లు, బంధుమిత్ర సపరివారం చేతిలోనే ఉన్నాయి. వ్యాట్ తగ్గింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన 8400 కోట్ల రూపాయల ఆదాయాన్ని, కార్పొరేషన్ ఆదాయంగా చూపెట్టి తొలి విడత 38 వేల 142 కోట్ల రూపాయల రుణాన్ని పొందిన రాష్ట్ర ప్రభుత్వం, రానున్న రెండు వారాల్లో మరో 12 వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ఎత్తుగడ వేస్తోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
నీ మొగుడు తాగితేనే నీకు విద్యా దీవెన, విదేశీ విద్య పథకం
నీ మొగుడు తాగి ఒళ్ళు గుల్ల చేసుకుంటేనే నీకు అమ్మఒడి, విద్యా వసతి, విద్యా దీవెన, విదేశీ విద్య పథకానికి డబ్బులు ఇస్తామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది. ప్రజలకు మద్యం తాపించి, ఆదాయాన్ని సమకూర్చుకొని అందులో సగం డబ్బులు కొట్టేసి సంక్షేమ పథకాల కోసం నువ్వు డబ్బులు ఖర్చు చేసేది ఏమిటని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు.
చెత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, మగువల పుస్తెలను తస్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మేలు ఏమిటో వారే గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయల రుణ పరిమితిని విధించగా, కార్పొరేషన్ల పేరిట దొంగ అప్పులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుతోంది. ఒక కార్పొరేషన్ కు ప్రజా సంక్షేమంతో సంబంధం ఉందా?, ప్రజా సంక్షేమం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మద్యం అమ్ముకొని దోచుకుంటాను. కొంత ఖర్చు చేసి ప్రజాసేవ చేస్తానంటే గంగిరెద్దుల్లా ప్రజలు తల ఊపడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఆటలు చెల్లుతున్నాయి.
ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని చితక బాదడం అనేది ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఊరికి రాకుండా అడ్డుకుంటున్నారు. నోటికొచ్చినట్లు తిట్టిస్తున్నారు. ఇలాంటి వెధవలైన పాలకులు ఉంటే రాష్ట్రమే కాదు దేశం కూడా అధోగతి పాలవుతుంది. రానున్న రెండు వారాల్లో 12 వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందాలని ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశాను. ఈ లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి కూడా పంపాను.
మద్య నిషేధం చేస్తానని చెప్పి… ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రానికి లభించే 13 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. మధ్య నిషేధం చేయకపోతే ఓటే అడగనని చెప్పిన ఆయన, చెత్త మద్యం బ్రాండ్లను తాగిపించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, యువకులు, బాలికలు అపహరణకు గురయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొంటే, గగ్గోలు పెట్టారు.
పార్లమెంట్లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. మరి దానికి అధికార పార్టీ నాయకులు ఏమి సమాధానం చెబుతారు?!. ముఖ్యమంత్రి జమోరె ప్రోత్సాహంతో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయించారు. వాలంటీర్లు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులా?, ప్రభుత్వ ఉద్యోగులు కాకపోతే ఉచితంగా సేవ చేస్తున్నారా??, మరి వారికి ఐదువేల రూపాయల వేతనం, అవార్డుల పేరిట నగదు ఎందుకు ఇస్తున్నారు. వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగి కానప్పుడు ప్రజల ఇళ్లల్లోకి వెళ్లే అధికారాన్ని ఎవరు ఇచ్చారు?!, ఎందుకు వెళ్తున్నారు.
ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ జీతగాడి కిందే లెక్క. 5000 రూపాయల జీతం తీసుకుంటున్న వాలంటీర్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగి కాదని అంటున్నారని రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.