Suryaa.co.in

Editorial

గోవిందా..పరువు గోవింద!

– కోర్టుకెక్కుతున్న వెంకన్న ప్రతినిధులు
– టీటీడీ పాలకవర్గంపై మళ్లీ పిటిషన్
– ఆ ఇద్దరిపై అర్హతపై హైకోర్టులో కేసు
– నియామకాలపై ఎల్వీ ఆక్షేపణ
– శ్రీనివాసానంద స్వామి ధర్మాగ్రహం
– బోర్డులో లిక్కర్ వ్యాపారులా?
– టీటీడీ నియామకాలపై ఆగని రచ్చ
– దేవాలయాల వద్ద బీజేపీ నిరసన దీక్షలు
– జైలుపక్షులు వెంకన్న ప్రతినిధులా? హవ్వ!
– చినజీయర్, విశాఖ స్వరూపానంద ధర్మాగ్రహం ఏదీ?
– ‘సర్కారీ సలహాల స్వామి’ స్వరూపానంద ఎక్కడ?
– పెదవి విప్పని పీఠాధిపతులు
– ధర్మాగ్రహానికి దడుస్తున్నారా?
– పాలకుల ప్రాపకం పోతుందని భయపడుతున్నారా?
– టీటీడీ సాయం ఆగిపోతుందన్న భయమా?
– స్వాములకు హిందూ ధర్మరక్షణ పట్టదా?
– కావలసినవి ఇస్తే మౌనదీక్ష పాటిస్తారా?
– మండిపడుతున్న హిందూ సమాజం
– చర్చి పాలనలోనూ చెక్కుచెదరని వెంకన్న ప్రతిష్ఠ
– ముస్లిం పాలనలోనూ వెలిగిన వెంకన్న
– అడ్డగోలు నియామకాలతో ఇప్పుడు అప్రతిష్ఠ
– వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలా?
– కళంకితులకు పదవులపై హిందూ సమాజంలో కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

గోవిందా.. గోవింద. నిరంతరం ఏడుకొండలు ప్రతిధ్వనించేలా భక్తకోటి చేసే గోవిదనామస్మరణ ఇది. క్షణకాలం ఏడుకొండలవాడిని దర్శించుకుంటే చాలు. జన్మధన్యమవుతుందనే భక్తుల రాకకు, పాలకుల నిర్ణయాలు బ్రేకులు వేస్తున్నాయా? ముడుపులు కట్టుకుని, వందలు-వేల కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చే భక్తులకు వెంకన్నపై నమ్మకం సడలే కుట్రలు జరుగుతున్నాయా? ‘చర్చి పాలన’లోనూ చెక్కుచెదరకుండా ఏడుకొండలపై ధీమాగా ఉన్న వెంకన్న ప్రతిష్ఠను, వ్యూహాత్మకంగా అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలకు తెరలేచిందా? ఏకంగా వెంకన్నపైనే విశ్వాసం పోయే నిర్ణయాల వెనుక, ఏదైనా మతపరమైన రహస్య అజెండా ఉందా? లిక్కర్ వ్యాపారులు, జైలుపక్షులతో పాలకవర్గాన్ని నింపేయడం వెనుక ఆంతర్యమేమిటి? దానితో పాలకులకు వచ్చే లాభమేంటి?

అందరివాడైన గోవిందుడిని కొందరివాడిని చేస్తే ఎవరికి లాభం? కమిటీలో ‘రెడ్డికార్పెట్’ వేసిన పాలకులు, మిగిలిన కులాలను అసమర్ధులని వెక్కిరించారా? ఏడుకొండలవాడి కేంద్రంగా ఇన్ని అరాచకాలు, అధర్మం జరుగుతున్నా మోతబరి పీఠాథిపతులు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? ప్రధానంగా…సర్కారుకు సలహాలిచ్చే స్వరూపనంద స్వామి, భక్తులకు ధర్మోపదేశాలు చేసే చినజీయర్ స్వామి వీటిపై ఎందుకు ధర్మాగ్రహం వ్యక్తం చేయడం లేదు? తమ ఇమేజ్‌ను ఎవరికోసం పణంగా పెడుతున్నారు? దానితో వారికి వచ్చేదేమిటి? నిలదీస్తే పోయేదేమిటి?

శ్రీనివాసానంద స్వామి తప్ప, మరొక స్వామికి ఈ అధర్మనిర్ణయాలు పట్టవా? ఎల్వీ సుబ్రమణ్యం వంటి మాజీ అధికారులకు తప్ప, పదవిలో ఉన్న అధికారులకు ఈ అడ్డగోలు నిర్ణయాలు, ఆక్షేపణగా కనిపించడం లేదా? .. ఇవీ.. వెంకన్న భక్తులు వారిపై సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. సామాన్య భక్తుల ధర్మాగ్రహం!

తాజాగా జగనన్న సర్కారు ప్రకటించిన టీటీడీ పాలకవర్గంలో.. ఇద్దరు కళంకితులు ఉండటాన్ని, హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. వివిధ ఆరోపణలపై జైలుకు వెళ్లివచ్చిన వారు, లిక్కర్ వ్యాపారులు.. వెంకన్న ప్రతినిధులుగా అవతరించడాన్ని, వెంకన్న భక్తులు తట్టుకోలేకపోతున్నారు. ‘‘వీరు ప్రతినిధులుగా ఉన్న వెంకన్న ఆలయంలోకా తాము దర్శనం కోసం వెళ్లేదంటూ’’ ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, తీహార్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరడైన శరత్‌చంద్రారెడ్డి, గతంలో మెడికల్ కాలేజీ వ్యవహారంలో సీబీఐ అరెస్టు చేసిన కేతన్‌దేశాయ్.. టీటీడీ బోర్డు సభ్యులుగా అవతరించడంపై, హిందూ సమాజం భగ్గుమంటోంది. వీరికి తోడు లిక్కర్ వ్యాపారం చేసే వారిని కూడా, బోర్డులోకి తీసుకోవడం ద్వారా.. ఒక వ్యూహం ప్రకారం వెంకన్నను అప్రతిష్ఠ పాలుచేసే కుట్ర జరుగుతోందన్న ఆందోళన హిందూ సమాజంలో వ్యక్తమవుతోంది.

క్రైస్తవులు, ముస్లింల పాలనలోనూ చెక్కుచెదరని వెంకన్న ప్రతిష్ఠను.. పాలకుల నిర్ణయాలు అప్రతిష్ఠపాలు చేసేలా ఉన్నాయని, శ్రీనివాసానంద స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా, వెంకన్నపై భక్తుల్లో విశ్వాసం తగ్గించడమే వైసీపీ సర్కారు లక్ష్యమని ఆయన ధర్మాగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి హిందువు రోడ్డెక్కి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవలసిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ‘ జగన్ సర్కారుకు భగవంతుడే సరైన శిక్ష వేస్తాడు. అప్పుడు ఆయనకు సలహాలిచ్చే స్వాములెవరూ ఆయనను కాపాడలేరు’ అని శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేశారు.

కళంకితులను బోర్డులో వేసినా పీఠాథిపతులు, సర్కారుకు సలహాలిచ్చే స్వాములు ఎందుకు ఖండించడం లేదని ఆయన నిలదీశారు. ఒక పథకం ప్రకారం వెంకన్నపై విశ్వాసం సడలించే కుట్ర జరుగుతోందని, దానిని భక్తులే అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘జగన్‌కు సలహాలిచ్చే స్వరూపానంద ఎందుకు మాట్లాడటం లేదు? ఈ అరాచకాలకు ఆయన ఆమోదం ఉందా’’? అని ఆయన నిలదీశారు.

జగనన్న నిర్ణయాలను నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల వద్ద, నిరసన దీక్షలు నిర్వహించింది. హిందూధర్మాన్ని జగన్ అవమానిస్తున్నారని, వెంకన్న ప్రతిష్ఠను దెబ్బదీసి రాష్ట్రంలో క్రైస్తవాన్ని వ్యాపించే కుట్ర జరుగుతోందని, కేంద్ర లేబర్ బోర్డు చైర్మన్ జయప్రకాష్ ఆరోపించారు. హిందువులలో వెంకన్న మీద నమ్మకం కోల్పోయేలా, చర్చి చేస్తున్న కుట్రలకు జగన్ సహకరిస్తున్నారని జేపీ ధ్వజమెత్తారు.

ఇద్దరు కళంకితులతోపాటు.. లిక్కర్ వ్యాపారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం, ‘రెడ్డి కార్పెట్’ వేయడంపై భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనిపై ఒక భక్తుడు హైకోర్టును ఆశ్రయించడంతో, వెంకన్న ప్రతిష్ఠను పాలకులు ఒక వ్యూహం ప్రకారం దెబ్బతీస్తున్నారన్న విమర్శలకు తెర లేచింది.

కాగా తాజా పాలకవర్గ నియామకంపై, ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం విరుచుకుపడ్డారు. జగన్ సర్కారు ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అటు టీడీపీ-బీజేపీ-జనసేన కూడా, టీటీడీలో జైలుపక్షులను నియమించడంపై విరుచుకుపడుతున్నాయి.

కళంకితులకు టీటీడీ పదవులివ్వడం ద్వారా, హిందూధర్మాన్ని నాశనం చేసే కుట్రలకు, జగన్ తెరలేపారని టీడీపీ రాష్ట్ర నేత బుచ్చిరాంప్రసాద్ ఆరోపించారు. టీటీడీ ని జగన్ డేరాబాబా డెన్‌లా తయారుచేస్తున్నారని విరుచుకుపడ్డారు. ‘వెంకన్నతో పెట్టుకున్న ఎవరూ బతికి బట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఆయనతో ఆడుగునే వారిని ఆయనే ఎలా ఆడుకుంటారో మీరే చూస్తారు’ అని రాంప్రసాద్ వ్యాఖ్యానించారు.

కాగా ఈ మొత్తం పరిణామాల్లో హిందూ సమాజం దృష్టిలో, పీఠాథిపతులు అప్రతిష్ఠ పాలవుతున్నారు. ప్రధానంగా జగనన్నకు సలహాలిచ్చే స్వామిగా పేరున్న, విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామి బాగా బద్మామ్ అవుతున్నారు. రిషికేష్‌లో జగనన్నకు జంధ్యం వేసి, ఆయనను హిందువుగా చూపించేందుకు, శ్రమదానం చేసిన విశాఖ స్వామి.. టీటీడీ నియామకాలపై మౌనంగా ఉండటంతో ఆయన సహజంగానే భక్తులకు టార్గెట్‌గా మారారు. దానితో హిందూ సమాజం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

ఇక హిందూ సమాజంలో ఇమేజ్ ఉన్న చిన జీయర్‌స్వామి కూడా.. టీటీడీ నియామకాలను ఖండించకపోవడంపై, భక్తులు కారాలు మిరియాలు నూరుతున్నారు. హిందూ ధర్మరక్షణపై ఉపన్యాసాలిచ్చే చినజీయర్ స్వామి, టీటీడీలో కళంకితులను నియమించడంపై.. పెదవి విప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వీరిద్దరూ జగనన్నను సన్మానించిన విషయాన్ని భక్తులు గుర్తుచేస్తున్నారు.

తమ పీఠాలు నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు.. టీటీడీపై ఆధారపడుతున్న పలు పీఠాలు.. ఆ మొహమాటంతోనే తాజా నియామకాలపై, నవరంధ్రాలూ మూసుకున్నారన్న విమర్శలు, హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి.

దానితోపాటు పాలకులు ఇచ్చే భూములపై ఆశతో.. టీటీడీ నియామకాలపై మౌనవ్రతం పాటిస్తున్నారన్న విమర్శలు, భక్తకోటి నుంచి వినిపిస్తున్నాయి. ఒక్క శ్రీనివాసానంద స్వామి మినహా, ఇప్పటివరకూ ఏ ఒక్క స్వామి కూడా టీటీడీ నియామకాలపై పెదవి విప్పకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

అటు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఒక్కరే, ఈ నియామకాలను తప్పుపట్టారు. మరి హిందూధర్మంపై పేటెంటీ తీసుకున్న స్వాములు.. ఏ మఠాల్లో సుఖ నిద్రపోతున్నారు? అసలు స్వాములకు సిగ్గుందా? అన్నది హిందూ సమాజం సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు!

LEAVE A RESPONSE