– ఏపీలో ఇప్పుడు ఇసుక అమ్మకాలు అధికారికమా? అనధికారికమా?
– సర్కారుతో జెపి కంపెనీకి ముగిసిన ఒప్పందం
– ఆ మేరకు జీఎస్టీ రిటర్నులో స్పష్టం చేసిన జెపి కంపెనీ
– ఒప్పందం చేసుకున్న కంపెనీ మరో సబ్ కాంట్రాక్టరు నుంచి కొంటుందా?
– 8 నెలల్లో వందగ్రాములఇసుక కూడా అమ్మలేదంటున్న జెపి కంపెనీ
– ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్నులో సున్నాలు చూపిన జెపి
– 8 నెలల్లో వందగ్రాముల ఇసుక కూడా అమ్మని కంపెనీకే మళ్లీ కాంట్రాక్టా?
– జెపి కంపెనీకి లీజు పొడిగింపు జీఓను బయటపెట్టని సర్కారు
– జెసి కంపెనీ పేరుతో ఇసుక త వ్వకాల బిల్లులు
– టాక్సు కడుతోందా? జీఎస్టీ చెల్లిస్తుందా అని నిలదీసిన చంద్రబాబు
– బాబు ప్రశ్నలకు జవాబు లేని సర్కారు
– జీఎస్టీ చెల్లింపులతో సర్కారుకు సంబంధం లేదన్న మంత్రి పెద్దిరెడ్డి
– ఇసుక తవ్వకాలతో 1528 కోట్లు చెల్లిస్తానన్న జెపి కంపెనీ
– చూపిన టర్నోవర్ 1421 కోట్లు మాత్రమే
– ఇసుక తవ్విన జెపి 107 కోట్లు నష్టపోయిందట
– సబ్ కాంట్రాక్టు కంపెనీ 300 కోట్లు బకాయి ఉందన్న జెపి కంపెనీ
– ఆ 300 కోట్ల బకాయిలు చెల్లించేదెవరో?
– 5 నెలలకే జెపి కంపెనీ జీఎస్టీ రిటర్ను ఫైల్
– మరో ఆరునెలలు గుండుసున్నాలే
– ఆ ఆరునెలల్లో అరగ్రాము ఇసుక కూడా అమ్మలేదట
– ఏడాదికి కోటిన్నర టన్నుల ఇసుక అమ్మినట్లు చెబుతున్న జెపి
– మంత్రి పెద్దిరెడ్డేమో ఏడాదికి 2 కోట్ల టన్నుల అమ్మకాలని స్పష్టీకరణ
– జెపిని నమ్మాలా? మంత్రి మాటలు నమ్మాలా?
– నష్టపోయిన కంపెనీ మళ్లీ కాంట్రాక్టు ఎందుకు తీసుకున్నట్లు?
– విపక్షాల విమర్శలకు జవాబు లేని వైసీపీ సర్కారు
(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని రెండేళ్లకు 107 కోట్లు నష్టపోయిన కంపెనీనే మళ్లీ ఎక్కడైనా కాంట్రాక్టు పొడిగించుకుంటుందా? 8 నెలల పాటు నయాపైసా వ్యాపారం చేయలేక చేతులెత్తేసిన ఒక కంపెనీ.. మళ్లీ మరో ఏడాది పాటు అదే కాంట్రాక్టు తీసుకునే ధైర్యం చేస్తుందా? తన దగ్గర సబ్ లీజు తీసుకున్న కంపెనీ 300 కోట్లు సర్కారుకు బాకీ పడితే, మళ్లీ లీజు పొడిగించుకునే సాహసం చేస్తుందా?..
సాధారణంగా లాభాల కోసం వ్యాపారం చేసే ఏ కంపెనీ కూడా అలాంటి ధైర్యం చేయదు. బతికుంటే బలుసాకు తినొచ్చని, పెట్టె బేడా సర్దుకుని పోతుంది. కానీ ఏపీలో ఇసుక తవ్వుతున్న జెపి వెంచర్స్ కథ మాత్రం దానికి పూర్తి రివర్స్.అది ప్రజాసేవ కోసం వందల కోట్లు నష్టపోయేందుకు సిద్ధమవుతోందట. రెండేళ్లలో 107 కోట్లు నష్టపోయి, 8 నెలల్లో జీఎస్టీ రిటర్ను జీరో చూపించి, ఆ కాలంలో అరగ్రాము ఇసుక కూడా అమ్ముకోలేని ‘అతి పేద’ జెపి వెంచర్స్ కంపెనీ.. మరో ఏడాది పాటు తన లీజును పొడిగించుకోవడానికి, ఎన్ని డజన్ల గుండెలు కావాలి? ఎన్ని టన్నుల ధైర్యం కావాలి? బహుశా అవన్నీ దండిగా ఉన్నందుకే.. సదరు కంపెనీకి మళ్లీ ఏడాది లీజు పొడిగించినట్లు సచివులు సెలవిచ్చిన ట్లు కనిపిస్తోంది.
అది కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఆ గ్రామం పేరు కోడూరు రామకృష్ణాపురం. అక్కడ కొన్ని టిప్పర్లు ఇసుక తొలుకుని వెళ్తుంటే గ్రామస్తులు వాటిని ఆపి, ఇసుక అనుమతులు చూపించాలని పట్టుపట్టారు. అయితే వారి వద్ద ఎలాంటి అనుమతులు లేవు. దానితో గ్రామస్తులు వీఆర్ఓకు ఫోన్ చేస్తే, పోలీసులు వాటిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే తహశీల్దార్ ఫిర్యాదు చేస్తేనే, కేసు నమోదు చేస్తామన్నది పోలీసుల వాదన. తహశీల్దారేమో మూడురోజులు సెలవులో ఉన్నారు. ఇసుక టిప్పర్లేమో పోలీసుస్టేషన్ ఆవరణలోనే ఉన్నాయి.
మరి టిప్పర్లలో ఇసుక తీసుకువెళ్లిన వారికి అనుమతులు, సర్కారుతో ఇసుక తవ్వకాల ఒప్పందం చేసుకున్న జెపి కంపెనీ ఏమైనా ఇచ్చిందా? ఒప్పందం గడువు ముగిసింది కాబట్టి ఆ కంపెనీ అనుమతి ఇచ్చే అవకాశం లేదు. పోనీ రెవిన్యూ-గనుల శాఖేమైనా జమిలిగా ప్రత్యేక అనుమతి ఇచ్చాయా? అలాంటి అవకాశం లేనేలేదు.
మరి తవ్విన ఇసుక అమ్మకాలు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి? గడువు ముగిసినా కొత్త కంపెనీకి తవ్వకాల అనుమతి లేకుండా, యధేచ్చగా ఇసుక తోలుకోవచ్చా? పోలీసులు, రెవిన్యూ, గనుల శాఖ ఏం చేస్తున్నాయి? ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇసుక తవ్వకాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జయప్రకాష్ పవర్ వెంచర్స్ 2021 మేలో ఇసుక తవ్వకాల టెండర్ దక్కించుకుంది. ఆ ప్రకారంగా ఏపీలో మరెవ్వరూ ఇసుక తవ్వడానికి వీల్లేదు. సదరు కంపెనీకి డబ్బులు చెల్లించి, ఇసుక కొనుక్కోవాల్సిందే. చివరకు ఎంతలావు అధికార పార్టీ నేతలెవరైనా ఆ పనిచేస్తే, పది నిమిషాల్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి, స్థానిక పోలీసులకు ఫోన్ వచ్చేది.
కాబట్టి అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అటువైపు చూసేందుకు సాహసించేవారు కాదు. ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకుంటే.. ఆ సమాచారం నిమిషాల్లో పెద్దలకు చేరి, అక్కడి నుంచి పోలీసులకు చేరిపోయేది. అంటే పాలకులు జెపి వెంచర్స్‌కు అన్ని రక్షణ కవచాలు ఏర్పాటు చేశారన్నమాట.
అయితే సదరు జెపి వెంచర్స్ ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్టును, మరో కంపెనీకి సబ్ లీజుకు ఇచ్చింది. దానికి సంబంధించి సదరు కంపెనీ సర్కారుకు ముచ్చటగా 300 కోట్ల పన్నులు బాకీ పడిందట. అది వేరే ముచ్చట. దాన్నలా ఉంచితే.. ఏపీ సర్కారుతో ఇసుక తవ్వకాల అధికార టెండరు దక్కించుకున్న జెపి వెంచర్స్ కాంట్రాక్టు ముగిసినా, మళ్లీ కొత్త కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు ఇప్పటిదాకా జీఓ వెలువడలేదు. అంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో జరుగుతున్న తవ్వకాలన్నీ అక్రమాలేనన్నమాట.
నిజానికి జెపి వెంచర్స్ తొలి ఏడాది ఆర్ధిక సంవత్సరంలో 11 నెలలకు జీఎస్టీ రిటర్ను ఫైల్ చేయాలి. కానీ విచిత్రంగా 5 నెలలకే ఫైల్ చేసి, మిగిలిన ఆరునెలలకు జీరో చూపించారు. అలాగే 2021 మే, జూన్, జులై, ఆగస్టుతోపాటు, 2022 జనవరి-ఫిబ్రవరి నెలలకు గాను జీరో చూపించారు. ఆ ప్రకారంగా అన్ని నెలలు జెపి వెంచర్స్, వందగ్రాముల ఇసుక కూడా అమ్మలేదట. నిజమే నమ్మమంటోంది సదరు కంపెనీ! అదే విషయాన్ని చాలా అమాయకంగా స్పష్టం చేయటమే ఆశ్చర్యం.
ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఇసుక తవ్వకాలకు సర్కారుతో అధికార ఒప్పందం చేసుకున్న జెపి వెంచర్స్, మరో సంస్థ నుంచి ఇసుకను కొనుగోలు చేసినట్లు చూపించడం. ఇసుక అమ్మకాలపై నెలవారీ జీఎస్టీ రిటర్ను ఫైలు చేసిందేమో జెపి వెంచర్స్. కానీ ఇంకో కంపెనీ నుంచి ఇసుక కొన్నట్లు చెబుతుంటే, దాన్ని అధికారులు అమాయకంగా నమ్మేయడమే ఆశ్చర్యం.
అంటే ఆ ప్రకారంగా.. సబ్ కాంట్రాక్టు కంపెనీ ఇసుక తవ్వితే, దానిని జెపి వెంచర్స్ 1372 కోట్లకు కొనుగోలు చేసిందన్నమాట. చందమామ, బాలమిత్ర కథల పుస్తకాలు లేని లోటు, పాలకుల సౌజన్యంతో జెపి వెంచర్స్ బాగానే భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే గడువు ముగిసిన జెపి వెంచర్స్ స్థానంలో సర్కారు, మరో కంపెనీతో కొత్త ఒప్పందం చేసుకోలేదు. అయినా యధావిధిగానే ఇసుకను వేల సంఖ్యలో లారీలతో రవాణా చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పటివరకూ జరిపిన తవ్వకాలన్నీ అక్రమం అన్నట్టే కదా? మరి డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి? వాటికి రశీదులు ఎవరిస్తున్నారు? ఒకవేళ ఇస్తే అవి చెల్లుతాయా? అనుమతి లేని ఇసుక లారీలను చెక్‌పోస్టుల వద్ద ఎందుకు పట్టుకోవడం లేదు? అసలు ఇసుక రీచ్‌ల వద్దే లారీలను గనులు, రెవిన్యూ, పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు? అన్నవి మెడపై తల ఉన్న వారికెవరికైనా వచ్చే సందేహాలు.
దీనిపైనే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లి ధర్నాలు చేసేవరకూ, జెపి వెంచర్స్‌కు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ముగిసిందన్న సంగతి ప్రజలకు తెలియదు. పైగా ఇసుక వ్యవహారం రెవిన్యూ చూసుకుంటుందన్న మైనింగ్ శాఖ బాసు వెంకటరెడ్డి ప్రకటనకు భిన్నంగా, ఇసుక రీచ్‌ల వద్దకు పోలీసులు ప్రత్యక్షం కావడం ప్రజల్లో ఉన్న అనుమానాలు రెట్టింపు చేసింది.
వెంకటరెడ్డి మాట నిజమైతే, టీడీపీ నేతలు ఇసుక రీచ్‌ల వద్ద ధర్నా చేస్తే రెవిన్యూ అధికారులు రావాలే తప్ప, పోలీసులు ఎందుకొచ్చినట్లు? నేతలకు నోటీసులిచ్చి, గృహ నిర్బంధం ఎందుకు చేసినట్లు? వీటికిమించి..ఇసుక తవ్వకాలపై టీడీపీ శరపరంగా, ఇసుక రీచ్‌ల నుంచి సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు సర్కారు నుంచి సమాధానం లేకపోవడం, వైసీపీ సర్కారును మరింత అప్రతిష్ఠపాలు చేసింది.
ప్రధానంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వేసిన ప్రశ్నలకు అటు గనుల శాఖ మంత్రి గానీ, ఇటు రెవిన్యూ- మైనింగ్ శాఖాధిపతి గానీ జవాబు ఇచ్చిన దాఖలాలు లేవు. ‘‘తవ్వకాలు చేస్తున్న జెపి వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తున్నారు. మరి సదరు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుందా? లేక జీఎస్టీ చెల్లింపులు చేస్తోందా?’’ అన్న ప్రశ్నకు, మంత్రి పెద్దిరెడ్డి సమాధానం ఇవ్వకపోవడమే ఆశ్చర్యం.
నిజానికి ఒక కంపెనీ నెలల తరబడి జీరో జీఎస్టీ రిటర్ను ఫైల్ చేస్తుందంటే.. అధికారులు పోలీసు కుక్కలా వాసన కనిపెట్టి, రేసు గుర్రాల్లా పరిగెట్టి, ఆ కంపెనీ లెక్క తేల్చాలి. ఎందుకంటే జీఎస్టీ వాటాల్లో, రాష్ట్ర ప్రభుత్వవాటా కూడా ఉంటుంది. కాబట్టి, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ లెక్కలు తేల్చాల్సిన అధికారులు, అసలు ఆ ఛాయలకే వెళ్లకపోవడమే విమర్శలకు కారణమవుతోంది.
ఇటీవల కమర్షియల్ టాక్సులో అవినీతి పేరిట ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు వేసి, జైళ్లకు పంపిన అధికారులు.. వందల కోట్ల వ్యవహారంలో మాత్రం, ధృతరాష్ట్ర పాత్ర పోషించడం సహజంగా అనుమానాలు-ఆరోపణలకు తావిస్తుంది. జెపి వెంచర్స్ విషయంలోనూ అదే జరిగింది.
అయితే ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సేమ్ టు సేమ్ చంద్రబాబు మాదిరిగానే స్క్రీన్ ముందు కూర్చుని, చేతిలో సన్న కర్ర చూపిస్తూ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో.. అసలు అనుమానాలకు తప్ప, అన్నీ చెప్పడమే వింత. జెపి వెంచర్స్ గవర్నమెంటుకు టాక్స్ కడుతోందా? జీఎస్టీ చెల్లింపులు చేస్తుందా? అన్న మీడియా ప్రశ్నలకూ పెద్దిరెడ్డి వద్ద జవాబు లేకపోవడం మరో ఆశ్చర్యం.
అదేవిధంగా జెపి నుంచి సబ్ లీజుకు తీసుకున్న కంపెనీ, ప్రభుత్వానికి 300 కోట్లు చెల్లించాలని స్వయంగా జెపి కంపెనీ నివేదిక ఇచ్చింది. మరి తాను సబ్ లీజుకి ఇచ్చిన కంపెనీ డబ్బులు ఎగ్గొడితే, ఆ డబ్బులు ఖజానాకు ఎవరు చెల్లిస్తారు? జెపి కంపెనీనా? ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న శాఖ ముఖ్య కార్యదర్శి, సంబంధిత అధికారులా అన్నది నిగ్గు తేలాల్సిన ప్రశ్న.
ఇక ఇసుక తవ్వకాల కాంట్రాక్టును, మళ్లీ జెపి కంపెనీకే ఏడాది పాటు కొనసాగించామని మంత్రి వెల్లడించారు. దానిని తప్పుపట్టాల్సిన పనిలేదు. అయితే ఆ పొడిగింపు జీఓను ఇప్పటిదాకా ఎందుకు బయటపెట్టలేదన్నది విపక్షాల ధర్మ సందేహం. అసలు ఎనిమిది నెలల పాటు వంద గ్రాముల ఇసుక కూడా అమ్మలేని స్థితిలో ఉన్న కంపెనీకే, మళ్లీ ఏడాది లీజు పొడిగించడం వల్ల.. అటు ప్రభుత్వం-ఇటు జెపి వెంచర్స్ ఏం బావుకుంటాయన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న.