Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ కు ఓటు వేసినా కాంగ్రెస్ కు వేసినట్టే.. కాంగ్రెస్ కు ఓటు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టే

– బిజెపికి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను అడ్డుకోవాలి
– రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి పిలుపు

తెలంగాణలో బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని, హిందూ వ్యతిరేకత వాటి విధానమని అన్నారు. ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టేనని, కాంగ్రెస్ కు ఓటు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టేనని, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమన్నారు. కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జి. కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కనుసన్నల్లోనే పని చేస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామి అయింది. 2014లో కూడా కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసే ఉన్నారు. బేరం కుదరక కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయలేదు. బేరం కుదిరితే ఎప్పటికైనా కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారు.

గత ఐదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సమావేశాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి పాల్గొన్నది. ఇటీవల కెసిఆర్ సన్నిహితుడైన ఓ కీలక నేత మన వాళ్ళు కొందరు కాంగ్రెస్లో ఉన్నారు, వారిని అడ్డుకోకండి, వారికి సహకరించండి అని బాహాటంగానే మాట్లాడారు.

2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో విలీనమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురో, ఆరుగురో గెలిస్తే వాళ్లు కూడా బీఆర్ఎస్ లోనే చేరిపోతారు.

బీఆర్ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు నిజాయితీతో కూడిన జనతా సర్కారును కోరుకుంటున్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేసాయి. మన గెలుపును అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయి.

బీఆర్ఎస్, బిజెపి ఒకటి అని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బిజెపికి పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను మనం తిప్పికొట్టాలి. ఈ రెండు పార్టీలకు సహజ మిత్రుడైన ఎంఐఎం వాటికి వంత పాడుతోంది.

కెసిఆర్ పనైపోయిందని సర్వేలు చెప్తున్నాయి. ప్రజలు బీఆర్ఎస్ కథలను నమ్మడం లేదు. ఇక కెసిఆర్ క్రెడిబిలిటీ కోల్పోయిన నేత. 1978లో వెంగళరావు మాదిరిగానే ఇప్పుడు కెసిఆర్ కూడా దారుణ ఓటమిని ఎదుర్కోబోతున్నారు.

ఇక మరో అంశం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఎంఐఎంకు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదు.

తెలంగాణ ఏర్పాటు జూన్ 2 ఉందిగా ఇక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అంటూ ఎంఐఎం మెప్పు పొందే కథలు చెప్పుకొంటూ వచ్చారు. బిజెపి ఒత్తిడి మేరకు గత ఏడాది అధికారికంగా, మొక్కుబడిగా నిర్వహించినట్లు నటిచాంరు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచాయి.

గత ఏడాది నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుండడంతో వేరే దారి లేక, గత్యంతరం లేక కేసీఆర్ కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. అలా బిజెపి కెసిఆర్ మెడలు వంచింది.

కేసీఆర్ నిజాంల వారసుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను నిజాం ఆత్మ ఆవహించినట్టు ఉంది. తొమ్మిదవ నిజాం మాదిరిగా వ్యవహరిస్తున్నారు. నిజాం పాలకులు తెలంగాణ సంస్కృతిపై దాడి చేసి విధ్వంసం చేశారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం బిజెపి కట్టుబడి ఉందని ప్రజలకు చెబుదాం. మన ధన, మాన, ప్రాణాలను దోచుకున్న రజాకార్ల వారసత్వంగా పని చేస్తున్న మతతత్వ పార్టీ ఎంఐఎం… బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యకు నేతృత్వం వహిస్తున్నది. మజ్లిస్ తో కలిసి పని చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను తిప్పికొట్టాలి, నిలదీయాలని ప్రజలకు మనవి చేస్తున్నాను.

రజాకార్లు మన ఆడబిడ్డలను చెరిచారు, అడ్డుకున్న మన వాళ్లను దారుణంగా హింసించారు. నిజాం పాలనలో నిర్బంధ మారణకాండ సాగింది. నిజాం పాలనలో సాంస్కృతిక విధ్వంసం జరిగితే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం చేశారు. నిధుల దుర్వినియోగం, అవినీతి, కుటుంబ పాలన, ఏకపక్ష ధోరణి, నియంతృత్వం పరాకాష్టకు చేరాయి.

కెసిఆర్ కు అసలు హిందూ సంస్కృతి అంటేనే లెక్కలేదు. గతంలో హిందూ గాళ్లు, బొందు గాళ్లు అని మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడితే స్పందించడం లేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే హిందువులను నిర్మూలించడమే.

గతంలో ఓవైసీ కూడా సరిగ్గా ఇదేవిధంగా 15 నిమిషాలు తనకు టైం ఇస్తే హిందువులందరినీ లేకుండా చేస్తానని భారతదేశానికి, హిందువులకు వ్యతిరేకంగా పిచ్చి కూతలు కూశాడు. కావున, ఇలాంటి వ్యక్తులు, శక్తులు, పార్టీల ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పోరాటం కొనసాగించాలి.

రానున్న ఎన్నికల్లో కుటుంబ పార్టీ, అవినీతి పార్టీలయిన కల్వకుంట్ల బీఆర్ఎస్, సోనియా కాంగ్రెస్ లను ఓడించి, తెలంగాణలో బిజెపిని విజయ పథాన నడిపించడానికి పూర్తి శక్తియుక్తులతో ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను.

ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ సునిల్ బన్సల్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి.మురళీధర్ రావుతో రాష్ట్రానికి చెందిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE