– మా పిల్లల శిక్షణకు అయిన ఖర్చును మేము చెల్లిస్తాం
– 370 కోట్ల నుంచే మా ఇద్దరు పిల్లలు స్కిల్‌లో శిక్షణ పొందారు
– మరి ఆ డబ్బు బాబు దోచుకుంటే మా పిల్లల శిక్షణ ఖర్చు ఎవరిచ్చారు?
– స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన పిల్లల తండ్రి లేఖ
– సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఆ తండ్రి లేఖ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు అనుకోని మద్దతు లభించింది. ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేశారో.. అదే ‘స్కిల్ ’లో శిక్షణ పొందిన ఇద్దురు బాలికల తండ్రి నుంచి, చంద్రబాబు అనూహ్య మద్దతు లభించింది.
ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు, వ్యక్తులు బాబుకు మద్దతునిస్తున్నారు. అయితే.. స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొంది, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఈ నేపథ్యంలో అందులో శిక్షణ పొందిన ఇద్దరు బాలికల తండ్రి ఒకరు.. బాబుకు బాసటగా నిలిచారు.
తన కుమార్తెలాంటి వారికెందరికో శిక్షణ ఇప్పించి, వారికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేందుకు కష్టపడిన చంద్రబాబును, అవినీతి పరుడంటూ అరెస్టు చేయడం తమ మనసు గాయపరిచిందని, ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబు 370 కోట్లు అవినీతికి పాల్పడితే మరి మా పిల్లలకు అందులో శిక్షణ ఇచ్చేందుకు డబ్బు ఎక్కడి నుంచి ఖర్చు చేశారు. కావాలంటే.. మా పిల్లల శిక్షణకు ఎంత ఖర్చయిందో చెప్పండి. దాన్ని నేను చెల్లిస్తా. నేనిచ్చే డబ్బు తీసుకుని, చంద్రబాబు దోచుకున్నారంటున్న మొత్తం నుంచి మినహాయించండి’’ అంటూ రాసిన ఘాటు లేఖ ఒకటి సోషల్‌మీడియాలో చర్చనీయాంశమయింది. కేవలం లేఖతో సరిపెట్టని ఆ తండ్రి.. నాటి సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్రలతో తన పిల్లలు దిగిన ఫొటోలను కూడా పెట్టారు. ఇప్పుడిని స్కిల్ కేసు ఎపిసోడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆ తండ్రి రాసిన లేఖ సారాంశం ఇదీ..
నారా చంద్రబాబు నాయుడు గారిపై పడిన అపనిందను తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెలు పొందిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టిన ఖర్చును మేము కడతాము. బి.టెక్ చదివేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందిన నా పెద్ద కుమార్తె మరియు ఇతర విద్యార్థినులు, ట్రైనింగ్ పూర్తయ్యాక 2017 ఏప్రిల్ నెలలో అమరావతికి వెళ్లి ఆనాటి మంత్రి గారైన శ్రీ కొల్లు రవీంద్ర గారిని మరియు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఫోటోను చూడండి.
నా చిన్న కుమార్తె కూడా బిబిఏ చదివేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ 370 కోట్ల నుండే నా ఇద్దరు కుమార్తెలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సొమ్మును శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకుని ఉంటే నా కుమార్తెలకు ట్రైనింగ్ ను ఎవరి డబ్బుతో ఇచ్చారు? కావాలంటే నా కుమార్తెల ట్రైనింగ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అయిన ఖర్చు ఎంతో చెబితే నేను తిరిగి కడతాను.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారంటున్న మొత్తం నుండి నేను కట్టే సొమ్మును మినహాయించండి. నా కుమార్తెల లాంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి, ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి కల్పించిన ఆ మహానుభావుడికి, నా కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం నాకు, నా కుమార్తెలకు, నా భార్యకు చాలా బాధను కలిగిస్తోంది.
ఇట్లు
అబ్బూరి శ్రీనివాసులు 6304371012