– బాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ పార్టీ ఆఫీసు వద్ద టీడీపీ ధర్నా
– పట్టుమని పదిహేనుమంది నాయకులు రాని దయనీయం
– మోతమోగిద్దాంలో కనిపించని అధ్యక్షుడు కాసాని
-చివరిలో రావడంపై నేతల అసంతృప్తి
– కమిటీలో వందలమంది ఉన్నా నిరసనలో కనిపించని దుస్థితి
– హైదరాబాద్-రంగారెడ్డి నేతల డుమ్మా
– బసవతారకం ఆసుపత్రి నుంచి క్యాన్సర్ పేషెంట్ల రాక
– చేతికి స్లైన్లతోనే వచ్చి బాబుకు బాసటగా నిలిచిన క్యాన్సర్ బాధితులు
– ఆఫీసు సిబ్బంది, క్యాన్సర్ పేషెంట్ల భాగస్వామ్యమే ఎక్కువ
– క్యాన్సర్ బాధితుల మద్దతుతో గట్టెక్కిన టీడీపీ నిరసన
– తెలంగాణ తెలుగుదేశంలో వినిపించని ‘మోత’
– మరోసారి విఫలమైన టీడీపీ తెలంగాణ నాయకత్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ తెలుగుదేశం పార్టీని విషాదం వెన్నాడుతోంది. పేరుకు కమిటీల్లో వందలమంది ఉన్నా.. చివరకు పార్టీ అధినేతకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమం కూడా, కార్యకర్తలు లేక నీరసించిన దుస్థితి. పట్టుమని పదిహేనుమంది కూడా లేకుండా జరిగిన మోతమోగిద్దాం కార్యక్రమానికి.. చివరకు క్యాన్సర్ బాధితులు, పార్టీ ఆఫీసు సిబ్బంది దిక్కయి, పరువుకాపాడిన విషాదంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదికూడా చదవండి: తెలంగాణ వదిలి బాబు తప్పు చేశారా?
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. తెలుగురాష్ట్రాల్లో మోతమోగిద్దాం పేరుతో, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఆ ప్రకారంగా కువైట్, సింగపూర్, దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో సైతం డజన్ల సంఖ్యలో తెలుగువారు హాజరై, చంద్రబాబుకు తమ సంఘీభావం ప్రకటించారు. చేతిలో కంచాలు పట్టుకుని స్పూన్లు, గరిగెలతో శబ్దాలు చేశారు. చివరికి చిన్నారి వికలాంగులు కూడా చంద్రబాబుపై అభిమానంతో కాళ్లతో డప్పులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే టీడీపీ ఆవిర్భవించిన హైదరాబాద్లో మాత్రం, అతి దారుణంగా ఆ కార్యక్రమం విఫలం కావడంపై, పార్టీ శ్రేణుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. నిరసన కార్యక్రమానికి హాజరుకావాలని పార్టీ ఆఫీసు నుంచి సందేశాలు వెళ్లినా, దానిని ఎవరూ సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా కేవలం 12 నుంచి 15 మంది నాయకులు మాత్రమే ‘మోత’ మోగించాల్సి వచ్చింది.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు-మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఐలయ్య, బంటు వెంకటేశ్వర్లు, మండూరి సాంబశివరావు, భిక్షపతి, సూర్యదేవర లత వంటి
అతికొద్దిమంది మాత్రమే డప్పులతో హాజరయ్యారు. దానితో వారిని చూసి అటుగా వెళ్లే జనం ఆశ్చర్యపడ్డారు.
ఈలోగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళలు-వృద్ధులైన క్యాన్సర్ బాధితులు, పెద్ద సంఖ్యలో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. దానితో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి రావడంతో, ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈలోగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీతో సహా సిబ్బంది వచ్చి, క్యాన్సర్ బాధితులతో కలసి నిరసన నినాదాలు చేశారు.
దానితో మోతమోగిద్దాం నిరసన కార్యక్రమానికి, కొంత నిండుతనం వచ్చింది. వారు కూడా లేకపోతే పార్టీ పరులు పోయేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. తమలాంటి
వారికెందరికో ప్రాణభిక్ష పెట్టిన చంద్రబాబును అరెస్టు చేసిన జగన్కు, తమ ఉసురు తగులుతుందని పలువురు మహిళా రోగులు శాపనార్ధాలు పెట్టారు. చేతిల్లోకార్డులుట్టుకుని వారు కూడా సైకిల్ రావాలి-సైకో పోవాలంటూ నినాదాలు చేశారు.
దానితో రంగప్రవేశం చేసిన ట్రాఫిక్ పోలీసులు.. పార్టీ నేతలు-క్యాన్సర్ బాధితులను అక్కడి నుంచి పంపించివేశారు. అప్పుడు పార్టీ ఆఫీసు వద్దకు వచ్చిన రాష్ట్ర
అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కాసేపు మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే ఒకవైపు క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న రోగులు చేతికి స్లైన్లు పెట్టుకునే, నిరసనలో పాల్గొనడం అందరినీ ఆకర్షించించింది. వారికి ఉన్న విశ్వాసం- చిత్తశుద్ధి, పదవులు తీసుకున్న తమ పార్టీ నేతలకు పోకుండా పోయిందని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోనే పదవులు తీసుకున్న వారి సంఖ్య డజన్లలో ఉంటుందని, వారంతా హాజరైనా కార్యక్రమానికి నిండుతనం వచ్చేదని ఓ నేత వాపోయారు.
అర్హత లేనివారికి, ఎప్పుడూ రాజకీయ పార్టీల్లో కీలక హోదాలో పనిచేయనివారికి బాధ్యతలు ఇస్తే, ఫలితం ఇలాగే ఉంటుందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నాయకత్వ అంచనా లోపానికి ఇదొక నిదర్శనమంటున్నారు. అసలు పార్టీని నడిపించలేని వారికి, నాయకత్వ పగ్గాలు ఇవ్వడం ఎందుకన్న ప్రశ్నలు వినిపించాయి. పార్టీ సంక్షోభ సమయంలో కూడా స్పందించని నాయకుల పదవులు తొలగించాలన్న డిమాండ్ వినిపించింది.
అయితే సనత్నగర్ ఈఎస్ఐ క్వార్టర్స్ వద్ద.. టీడీపీ కార్యకర్తలు, స్థానిక సెటిలర్లు నాయకుడు లేకుండా నిర్వహించిన నిరసన ర్యాలీకి, వందల సంఖ్యలో ప్రజలు హాజరుకావడం విశేషం. దీన్నిబట్టి తెలంగాణ టీడీపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
‘ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలి. లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనియర్ను నియమించి సమన్వయ కమిటీకి బాధ్యతలు అప్పగించాలి. దానితోపాటు ఉత్తర తెలంగాణ-దక్షిణ తెలంగాణ-గ్రేటర్ హైదరాబాద్కు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టి పార్టీని నడిపించడం ఒక్కటే దారి. లేకపోతే ఇప్పుడు వచ్చిన ఆ 12 మంది కూడా రేపు దొరకరు’ అని ఓ సీనియర్ నేత కుండబద్దలు కొట్టారు.