పూర్వకాలంలో పాత తరం వారు తమ కూతురుని కాపురానికి పంపించే సమయములో , సమస్తమైన వస్తువులూ అంటే కూతురు మరియు అల్లుడు పడుకునే మంచంతో సహా ఇచ్చి పంపేవారు. అదే కాకుండా కూతురు వేరు కాపురము పెట్టే సందర్భంలో , అవసరమయిన పక్షంలో అమ్మాయి తరఫువారు అనగా అమ్మాయి తల్లి కాని అమ్మమ్మ కాని సమస్తమయిన సామానులు తీసుకుని వచ్చి , ఒక పదిహేను రోజులు అక్కడే ఉండి అమ్మాయికి అన్ని పనులు , వంటతో సహా నేర్పి తిరిగి వెళ్ళేవారు.
కూతురును కాపురానికి పంపేటప్పుడు గ్యాస్ స్టవ్ వంటివి అమ్మాయికి కొని ఇచ్చేవారు కాదు. అలాగే నూనెలు , నువ్వులు వంటి వస్తువులు కూడా పుట్టింటి వారు తమ డబ్బుతో కొని ఇవ్వకూడదు. ఒకవేళ తప్పనిసరై కొన్నా , ఆ వస్తువుల ధర వారి దగ్గర నుండి అడిగి మరీ తీసుకోవాలి. అటువంటి పుట్టింటి వారు కొనివ్వడం అశుభ సూచకంగా భావిస్తారు.
అలాగే పాత తరం వారు , చాలా చాలా స్టీల్ సామాన్లు వారు వాడేవి కాని , లేదా కొత్తవి కాని కొని ఇచ్చి కూతురుకు కాపుర సమయంలోనే కాక కూతురు పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఇచ్చి పంపేవారు. పుట్టింటి వారిచ్చిన వస్తువుల విలువకన్నా , వారి అభిమానానికి గుర్తుగా ఎన్నో వేల మంది ఆ వస్తువులను ఎంతో అపురూపంగా చూసుకుంటూ , దాచుకుంటూ , అవసరమయినప్పుడు ఆ వస్తువులను బయటకు తీసుకుని వాడుకుంటూ తరతరాలుగా ఆ వస్తువులను కాపాడుకొస్తున్నారు.
అలాగే ఎంతోమంది మహిళలు తరతరాలుగా వారి అత్తగారు , పుట్టింటి వారు అమ్మమ్మ మరియు తల్లిగారు ఇచ్చిన వెండి సామాన్లు మరియు బంగారు నగలు ఎంతో అపురూపంగా భావిస్తూ శుభకార్యాలలో వాటిని వాడుకుంటూ ,” ఈ వస్తువు మా అత్తగారి అత్తగారిది , ఈ నగ మా అత్తగారు నాకు ఇచ్చారు , ఈ వెండి గిన్నె మా అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు మా అమ్మ బాలసారె నాడు మా అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు ఇచ్చారుట , ఈ బంగారు పువ్వు మధ్యలో వెండి విస్తరి కంచంలో ప్రతిరోజూ మా తాతగారు భోజనము చేసేవారుట , ఈ పెద్ద వెండి కంచం మరియు వెండి గ్లాసు మా నాన్నకు మా అమ్మమ్మ వాళ్ళు వివాహ సమయములో ఇచ్చారుట, ఈ కంటె మరియు కాసుల పేరు మా అమ్మమ్మ అమ్మ గారిదట ” అని మరీ మరీ తలుచుకుని తలుచుకుని , వాటిని ధరించినప్పుడల్లా , ఉపయోగించినప్పుడల్లా ఎంతో ఆనందపడుతూ మురిసిపోతుంటారు.
ఆ అనుభూతి ఆ ఆనందక్షణాలు అది అనుభవించే వారికే కాని ఇతరులకు చెప్పినా ఎంతమాత్రం అర్ధంకావు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టుకునే వారికి , ఆ వస్తువు యొక్క ధర మాత్రమే కనిపిస్తుంది. ఆ అనుభూతులు మాత్రం పొందరు కాక పొందరు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి మనస్తత్వం కలవారు ఒక భ్రమలో బ్రతుకుతున్నారని , ఒక పిచ్చి మాలోకం అని , వీళ్ళని మార్చడం భగవంతుని వల్ల కూడా కాదని భావిస్తారు.
ఈ తరంలో కొంతమంది కూతుళ్ళు మరియు కొడుకులు , తల్లిదండ్రులు కాని , తమ అత్తమామలు కాని వెండి మరియు బంగారు వస్తువులు ఇస్తే ఆనందంగా తీసుకుని వెంటనే మార్చేసుకుంటున్నారు. అలాగే విలువైన పాతకాలపు అమ్మమ్మ లేదా తల్లి వెండి జరీ పట్టు చీరెలు తమ కూతురు లేదా మనవరాలు ధరిస్తారని ముచ్చటపడి ఇస్తే , ఆనందంగా తీసుకుని నెలతిరక్కుండానే వాటిని కరిగించి అందులో వెండిని తీసేసుకుంటున్నారు.
ఇతర స్టీల్ వంట సామాన్లు , సోఫాలు , గృహోపకరణ వస్తువులు , పరుపులు , దిండ్లు , పాత ఫ్యానులు వంటి సామాన్లు , ఇత్తడి గిన్నెలు వంటి వాటిని చూస్తేనే , ఈ కాలంలో నూటికి ఎనభై శాతం మంది యువతరానికి ఎలర్జీ. కొంతమంది తమ తల్లిదండ్రులతో ” మీ పాత డొక్కు డకోటా సామాన్లు మాకవసరం లేదు. మా కిద్దామని మీరు కూడబెట్టి దాచి ఉంచనవసరం లేదు . మా కాపురాలకి అన్నీ లేటెస్ట్ గా వస్తున్న కొత్త వస్తువులు కొనుక్కుంటాం. మా తాత కుర్చీ , మానాన్న మంచం అంటూ మా మొహన పడేయటానికి ప్రయత్నించకండి. ” అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు.
చివరగా నాకు ఒకటే అన్పిస్తొంది . బంగారం వెండి వంటివి మా కొద్దనే ఏతరంవారైనా , ఈతరం వారైనా , అటువంటి పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు వాడుకున్నా , వారికి మనం ఇచ్చిన వెంటనే వాళ్ళు తీసుకుని మార్చేసుకున్నా , మనం జీవించి ఉన్నంత కాలం ఒక బలవంతపు నవ్వు ముఖాన పిలుముకుని జరుగుతున్నవన్నీ చూస్తుండాల్సిందే. తప్పదు. కూతురుకైనా లేదా కొడుకుకైనా , ఒక ఇల్లు కాని , బంగారం కాని వెండి కాని వారిది అని వారి చేతిలో పెట్టిన తర్వాత ఆ వస్తువులు ఇక నుండి వారి స్వంతమే. ఆ వస్తువులు వారు అమ్ముకున్నా , మార్చుకున్నా ఆ వస్తువుల గురించి వారిని ప్రశ్నించడానికి మనకు ఏ విధమైన అధికారము లేదు. కేవలం జరుగుతున్నవి చూస్తూ ప్రేక్షకులు పాత్ర వహించడమే.
కనీసం ” మీ పాత డొక్కు సామాన్లు మాకొద్దు” అన్న వస్తువులైనా ఏ బీదవారికో లేదా ఏ వృద్ధాశ్రమాలకో లేదా ఏ అనాధ శరణాలయాలకో దానం చేస్తే , కనీసం మనం బతికుండగానే , మన చేతులతో మనం స్వయంగా దానం చేసుకున్నామన్న ఆత్మ సంతోషమైనా మనకు మిగులుతుంది.
– వెలగపూడి గోపాలకృష్ణ