• తాజాగా జగన్ ప్రజలకు దసరా కానుకగా ఒక్కోయూనిట్ పై రూ.1.15పైసల భారం వేయబోతున్నాడు
• ఇప్పటికే ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.7,200కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఏపీ.ఈ.ఆర్.సీ ముందు ఉంచాడు
• ఇప్పటికే 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ రెడ్డి ఆ ఛార్జీలు..ఈ ఛార్జీలు అంటూ ప్రజలపై రూ.25,993 కోట్ల భారం మోపాడు
• విద్యుత్ డిస్కంలకు జగన్ రెడ్డి రూ..34,776కోట్లు బకాయి పెట్టాడు
• బయటమార్కెట్లో అధికధరకు విద్యుత్ కొని, సెకీ ఒప్పందాల ద్వారా జగన్ రెడ్డి రూ.22 వేల కోట్లు కొట్టేశాడు
• జగన్ విద్యుత్ రంగాన్ని తన ఆదాయ వనరుగా మార్చుకోవడం వల్లే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు…డిస్కంలపై అప్పుల కుప్పలు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నేటివరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తన బాదుడేబాదుడిని కొనసాగిస్తున్న జగన్ రెడ్డి, ప్రజలు నరకం అనుభవిస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా తాజాగా ఏపీ ఈ.ఆర్.సీకి మరో రూ.7,200కోట్ల వరకు ప్రతిపాదనలు పంపాడని, యూనిట్ కు అదనంగా మరో రూ.1.15పైసలు పెంచేందుకు సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేటివరకు అంటే నాలుగున్న రేళ్లలోనే వివిధరూపాల్లో ప్రజలపై రూ.64,388 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాడు. చంద్రబాబునాయుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా గతంలో ఏనాడూ ప్రజలపై పైసా భారం మోపిందిలేదు. ప్రజలపై భారం వేయకుండా వారికి నాణ్యమైన విద్యుత్ ను కోతలు లేకుండా అందించి, రాష్ట్రాన్ని కూడా మిగులు విద్యుత్ ఉత్పత్తిలో నిలిపాడు. ఏపీ ప్రజలకు దసరా పండుగ కానుకగా జగన్ రెడ్డి, ఒక్కో యూనిట్ కు అదనంగా రూ.1.15 పైసలు పెంచబోతున్నాడు. ముఖ్యమంత్రి దసరా మామూళ్లు కొట్టేస్తూ, ప్రజలకు మాత్రం దమ్మిడీ మిగలకుండా చేస్తున్నాడు.
జగన్ రెడ్డి ప్రజలపై వేసిన రూ.64,388 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఎప్పుడు ఎలా.. ఏఏ పేర్లతో వారిపై వేశాడో చూద్దాం
2020లో ఒక్కో యూనిట్ పై రూ.90 పైసలు భారం వేసి, రూ.1300 కోట్ల భారం వేశాడు. మరలా 2020లోనే కరెంట్ శ్లాబులు మార్చి నేరుగా ప్రజలపై మరో రూ.1500 కోట్ల భారం వేశాడు. 2021లో ప్రతి కిలోవాట్ కు అదనంగా రూ.10లు పెంచడం వల్ల రూ.3,542కోట్ల భారం మోపాడు. గతంలో విద్యుత్ వినియోగించుకున్నారంటూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.3,669కోట్ల భారం వేశాడు. ఏప్రియల్ 2022న శ్లాబుల అడ్జెస్ట్ మెంట్ పేరుతో రూ.3,900 కోట్ల భారం వేశాడు.
ఫ్యూయల్ అండ్ పవర్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో రూ.700కోట్లు, 2021లో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.3,082కోట్లు, 2023 ఫ్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ (ఎఫ్.ఏ.పీ.పీ.సీ) పేరుతో రూ.400కోట్ల భారంవేశాడు. ఇప్పుడు వీటన్నింటికీ అదనంగా ట్రూఅప్ ఛార్జీలపేరుతో మరో రూ.7,200కోట్లను ప్రజల ముక్కుపిండి వసూ లు చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు.
ఈ భారమంతా నేరుగా విద్యుత్ వినియో గదారులుపై పడేదే. ఈ విధంగా దాదాపు రూ.25,293కోట్ల భారం విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో నేరుగా నాలుగున్న రేళ్లలో జగన్ రెడ్డి ప్రజలపై వేశాడు. దీనికి తోడు విద్యుత్ డిస్కంలు, సరఫరా సంస్థలద్వారా పొందిన అప్పులు, ఇతర రుణాలు కలిపి మొత్తంగా జగన్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై వేసిన భారం రూ.64,388 కోట్లు.
తన అవినీతికోసం కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కూడా జగన్ రెడ్డి పూర్తి గా భ్రష్టుపట్టించాడు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.36,261కోట్ల అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి, హిందుజా సంస్థకు చెల్లించాలంటూ మరో రూ.2,834 కోట్ల అప్పు లు తెచ్చాడు. డిస్కంలకు వైసీపీప్రభుత్వం రూ.34,776 కోట్లు బకాయిపెట్టింది. దాంతో విద్యుత్ డిస్కంలు నిర్వీర్యమయ్యే పరిస్థితి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాక, పవర్ ఫైనాస్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చిమరీ జగన్ సర్కార్ తన స్వార్థానికి వాడుకోవడంతో డిస్కంల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
బినామీ సంస్థలకు దోచిపెట్టడానికి, తన అప్పులకోసం డిస్కంలకు జగన్ రెడ్డి రూ.34,776 కోట్లు బకాయి పెట్టాడు
ఏపీ.ఎస్సీ.డీ.సీ.ఎల్.కు రూ.15వేలకోట్లు, సీ.పీ.డీ.సీ.ఎల్ కు రూ.6,182కోట్లు, ఈ.పీ.డీ.సీ.ఎల్ కు రూ.5,000కోట్లు, మూడు డిస్కంలపై రూ.3,500 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపింది. పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విద్యుత్ బకాయిల కు సంబంధించి రూ.5,000కోట్ల భారాన్ని ప్రభుత్వం డిస్కంలపై వేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా వైసీపీ ప్రభుత్వం డిస్కంలకు రూ.34,776కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో డిస్కంల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు ప్రజల్ని, ఇటు డిస్కంలను దెబ్బతీస్తూ, రాష్ట్ర విద్యుత్ రంగాన్నే నామరూపాలు లేకుండా చేసింది.
కేవలం తన కమీషన్లకోసమే జగన్ రెడ్డి ఒక్కో యూనిట్ కు రూ.4.02పైసలు అదనంగా చెల్లించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటున్నాడు
మరోపక్క అధికధరకు జగన్ సర్కార్ బయటమార్కెట్లో విద్యుత్ కొంటూ ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కమీషన్ల కోసం అధికధరకు బయట నుంచి విద్యుత్ కొని వైసీపీ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల కంటే రూ.12,200 కోట్లు అదనంగా చెల్లించింది. ఈ సమాచారం సమాచారహక్కుచట్టం ద్వారా బయటకు వచ్చింది. బహిరంగ మార్కెట్లో యావరేజ్ న యూనిట్ విద్యుత్ ధర రూ.4.75పైసలు ఉంటే, జగన్ సర్కార్ రూ.4.02పైసలు అదనంగా చెల్లించి, ఒక్కో యూనిట్ ను రూ.8.77పైసలకు కొనుగోలు చేసింది.
ఎందుకు ఇంత ఎక్కువ ధర రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందయ్యా అంటే కేవలం కమీషన్లకోసమే. ఈ విధంగా అటు ప్రజల్ని, విద్యుత్ డిస్కంలను దారుణంగా దెబ్బతీసిన జగన్ రెడ్డి, మరోపక్క రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. దేశంలో అనేక రాష్ట్రాలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెబితే, జగన్ సర్కార్ మాత్రం అప్పులు, దోపిడీకోసం స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమైంది.
బయటమార్కెట్లో అధికధరకు విద్యుత్ కొని, సెకీ ఒప్పందాల ద్వారా జగన్ రెడ్డి రూ.22 వేల కోట్లు కొట్టేశాడు
సెకీ ఒప్పందం ప్రకారం 17వేల యూనిట్ల సౌర విద్యుత్ ను యూనిట్ రూ.2.39పైసల కు ఒకేసారి 30 ఏళ్లపాటు కొనేలా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఇదే సెకీతో అదే సౌర విద్యుత్ ను యూనిట్ రూ.1.39 పైసలకే కొనేలా ఒప్పందం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒక్కో యూనిట్ కు అదనంగా చెల్లించిన రూపాయి ఎటుపోయింది? ఎవరి జేబుల్లోకి పోయింది? 2020 డిసెంబర్లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ ప్రభుత్వ డిస్కంలు ఒక్కో యూనిట్ విద్యుత్ ను రూ.1.99 పైస లకు కొనడానికి టెండర్లు పిలిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం యూనిట్ కు రూ.2.50 పైస లు కోట్ చేసింది.
యూనిట్ కు 51పైసలు అదనంగా కోట్ చేసిన సొమ్ము ఎటుపోయిం ది? ఈ విధంగా ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొంటూ, రూ.22 వేలకోట్లు నేరుగా జగన్ రెడ్డికి చేరేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రికి మేలు చేయడానికే రాష్ట్ర విద్యుత్ సంస్థలు సెకీ ఒప్పందంలో అదనపు ధరకు టెండర్లు వేశాయి. సెకీ ఒప్పందాల ద్వారా రూ.22వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి, మరోపక్క విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.26 వేలకోట్ల భారం వేశాడు.
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా జగన్ ప్రభుత్వంలో చలనంలేదు
రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే కాంట్రాక్ట్ ను తన బినామీ కంపెనీ అయిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ కు జగన్ రెడ్డి అప్పగించాడు. ఆ సంస్థ నుంచే స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కొనాలనే నిబంధన పెట్టి రైతుల్నికూడా దోచేస్తున్నాడు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా, రైతులు సబ్ స్టేషన్లు ముట్టడిస్తున్నా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించే స్థితిలో జగన్ ప్రభుత్వం లేదు.
అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లైనా ఇంకా గత ప్రభుత్వంపై నిందలేనా జగన్ రెడ్డి?
అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థల్ని రక్షిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యి నాలుగున్నరేళ్లు అవుతున్నా నేటికీ గతప్రభుత్వంపైనే నింద లేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. తనదోపిడీకోసం రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి, నేటికీ తన విషపత్రిక సాక్షిలో అన్నింటికీ టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రజల్ని భారాలతో బాదుతూ ఇప్పటికీ సిగ్గు లేకుండా గత ప్రభుత్వంపై నిందలేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
టీడీపీ ప్రభుత్వం రూపాయి విద్యుత్ ఛార్జీ పెంచకుండా ప్రజలకు మేలు చేస్తే, అప్పుడు లేని ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయెల్ అడ్జస్ట్ మెంట్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు జగన్ రెడ్డి వచ్చాకే ఎందుకు తెరపైకి వచ్చాయి? జగన్ రెడ్డి అంతులేని అవినీతికి అంతిమంగా రాష్ట్రమే బలికానుంది. జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని తన ఆదాయవనరుగా మార్చు కున్నందునే నేడు రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. జగన్ కు విద్యుత్ నిర్వహణ, సరఫరా, తయారీ గురించి అసలే తెలియదు ” అని బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.