-మేనిఫెస్టోని చిత్తుకాగితంలా చూస్తున్న టీడీపి
-ఎంపీ విజయసాయిరెడ్డి
వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి చెప్పిన ప్రతీహామీని గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేరవేర్చిందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో ఆయన పలు అంశాలపై గురువారం స్పందించారు.
తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల ముందు ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని చెప్పారు..ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు పార్టీ టిష్యూ పేపర్ లాగా పక్కన పడేసిందని అన్నారు.. ఏకంగా ఎన్నికల మేనిఫేస్టోను టిడిపి పార్టీ వెబ్ సైట్ నుండి తోలిగించిందని ఆయన గుర్తు చేశారు..
వీధికుక్కల దాడులపై కేంద్రం చర్యలు మొదలుపెట్టాలి
వీధికుక్కల దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జంతు ప్రేమికులు, పశువైద్య నిపుణులు, వైద్యులు మొదలైన వారితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను తొలగించేందుకు పరిష్కారాలను సూచించే బాధ్యతను కమిటీకి అప్పగించాలన్నారు.
సూచనలను స్వీకరించిన తర్వాత, ఈ సూచనలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరాలని సూచించారు. నిజానికి వీధికుక్కల వల్ల చాలా మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వీధికుక్కల దాడి ఘటనలో బాగ్ బక్రీ టీ కంపెనీ యజమాని పరాగ్ దేశాయ్ మరణించడంపై అవేదన వ్యక్తం చేశారు. భారత్లో రోజుకు సగటున 11 వేల మంది కుక్కల కాటుకు గురవుతున్నారని ఆయన చెప్పారు.