ఆగమాగమై ఓట్లు వేయొద్దు
ఆ నాడు ఎక్కడెక్కడున్నోళ్లు.. ఎవల బూట్లు మూసినోళ్లు.. ఇవాళ ఛాలెంజ్‌లు చేస్తున్నారు’
సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా:అక్టోబర్ 26: గతంలో ఫ్లోరైడ్‌తో నడుములు వంగిపోతే పట్టించుకోనోడు.. నేడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే మీరు తీర్పునిచ్చారు.
ఆ సందర్భంగా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది. దాదాపు 95శాతం పనులు చేశాం. చండూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. వందపడకల హాస్పిటల్ నిర్మాణమవుతుంది. మిగతా పనులన్నీ మీ కండ్ల ముందుట ఉన్నాయ్’ అని తెలిపారు.
ఆగమాగమై ఓట్లు వేయొద్దు..
ఎన్నికలు వచ్చినప్పుడు నేను మీమ్మల్ని కోరేది ఒక్కటే. గత ఎన్నికల్లోనూ కోరాను.. ఈ సారి కూడా కోరేది ఏంటంటే.. ఆగమాగమై ఓట్లు వేయొద్దు. ఎవరో ఏదో చెబితే క్యారీ ఫార్వర్డ్ అయిపోవద్దు. మనంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మునుగోడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అంతకుముందున్న కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడ నడుములు వంగిపోయేదాకా.. చచ్చిపోయేదాక చూశారే తప్పా ఫ్లోరైడ్ నివారణ కోసం కృషి చేయలేదు. అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఇక్కడి ఉద్యమకారులు స్వామి అనే పిల్లవాడిని ప్రధాని టేబుల్‌పై పడుకొబెట్టినా.. దానికి నివారణ దొరకలేదు.
కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చాకనే ఫ్లోరైడ్ నీళ్ల గోస ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరూ లేరు. పిడికెడు మందిమే ఉన్నాం. ప్రభాకర్‌రెడ్డి ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఉద్యమంలో ఉన్నారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో నా వెంట ఉన్నారు. మడమ తిప్పకుండా పోరాటం చేస్తున్నారు. ఆ నాడు ఎక్కడెక్కడున్నోళ్లు.. ఎవల బూట్లు మూసినోళ్లు.. ఇవాళ ఛాలెంజ్‌లు చేస్తున్నారు’ అన్నారు.
వారికి బుద్ధి చెప్పాలి..
గవర్నమెంట్ వచ్చి పదేళ్లయిన ఈ సందర్భంలో.. ఎన్నికలు వస్తే 24 ఏళ్ల కిందట పత్తాలేని నాడు.. గొడగొడ ఏడ్చిన నాడు.. పంటలు ఎండిపోయిన నాడు.. ఫోర్లైడ్తో నడుములు వంగిపోయిన నాడు.. పట్టించుకోనోడు.. వాళ్లు ఎక్కడక్కడున్నారో మీకు తెలుసు. ఈ రోజు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నరు.. ఎవరు లేరో మీకు తెలుసు.. మీరు కళ్లారా చూశారు.
అందువల్ల రాజకీయాల్లో ఎవరైతే పనికి మాలిన వాళ్లు ఉంటరో.. డబ్బు మదంతో పని చేసేవారుంటారో.. వాళ్లకు బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలువరు.. ప్రజలు ఓడిపోతరని మనవి చేస్తున్నానన్నారు.