– సీఐడీకి ఎలా వచ్చిందని లోకేష్ ఫైర్
– సీఐడీ సంగతి తేలుస్తామని హెచ్చరిక
– వ్యక్తులు-సంస్థల ఐటీ రిటర్న్సు సీఐడీ తీసుకోవచ్చా?
– రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు ఆ అధికారం ఉందా?
– ఇంతకూ సీఐడీకి భువనేశ్వరి ఐటీ వివరాలు ఇచ్చిందెవరు?
– కేంద్ర ఆర్ధిక శాఖ నుంచే ఆ వివరాలు వచ్చాయన్న అనుమానం
– వైసీపీకి అను‘కుల’ అధికారుల హస్తంపై అనుమానాలు?
– ఐటీ రిటర్న్సుపై లోకేష్ కోర్టుకెక్కనున్నారా?
– లోకేష్ కోర్టుకెళితే సీఐడీకి చిక్కులు తప్పవా?
– సీబీడీటికి ఫిర్యాదు చేయనున్న లోకేష్
– కేసులో చివరకు చిక్కేదెవరు?
– భువనేశ్వరి ఐటీ రిటర్న్సుపై సోషల్‌మీడియాలో హల్‌చల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఆర్ధిక సంస్థలకు మాత్రమే తెలిసిన వ్యక్తులు-సంస్థల ఆదాయ రహస్య వివరాలు.. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు ఎలా తెలుస్తున్నాయి? కేంద్ర అధికారులకు మాత్రమే తెలిసిన వ్యక్తులు-సంస్థల ఐటీ రిటర్న్సు వివరాలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థల చేతిలోకి ఎలా వెళుతున్నాయి? సదరు రాష్ట్ర స్థాయి దర్యాప్తు అధికారిపై, దీనికి సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళితే.. సదరు అధికారుల పరిస్థితి ఏమిటి?.. మాజీ సీఎం-టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఐటీ రిటర్న్సు వివరాలు, సీఐడీ చేతిలోకి వెళ్లడంపై ఏపీలో ఇప్పుడు అలాంటి చర్చనే జరుగుతోంది.
ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ యువనేత నారా లోకేష్‌ను, సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ఆ సందర్భంలో లోకేష్ తల్లి భువనేశ్వరికి సంబంధించిన ఐటీ రిటర్న్సు వివరాలను సీఐడీ అధికారులు, లోకేష్ ముందు పెట్టి విచారించిన వైనం వివాదానికి తెర లేపింది. సీఐడీ వైఖరిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివరాలు సీఐడీకి ఎలా చేరాయి? దీని సంగతి తేల్చేవరకూ నిద్రపోను అని స్పష్టంచేశారు. దీనితో సీఐడీకి ఆ వివరాలు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు ఇచ్చారు? ఆ వివరాలకు సంబంధించి సీఐడీ ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసిందా? ఒకవేళ రాస్తే అందుకు ఏ శాఖ స్పందించిందన్న ప్రశ్నలు తె రపైకి వచ్చాయి. దీనిపై విచారణ జరిపితే.. ఏ విచారణ సంస్థ సీఐడీ కి లిఖితపూర్వకంగా ఇచ్చిందో బయటపడుతుంది.
సహజంగా వ్యక్తులు, సంస్థల ఐటీ రిటర్ను వివరాలు ఎవరంటే వారికి ఇవ్వడం అసాధ్యం. అయితే కేంద్రానికి సంబంధించిన కొన్ని సంస్థలకు మాత్రమే, అలాంటి వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థలు మాత్రమే దర్యాప్తు కోసం వ్యక్తులు-సంస్థల ఐటీ రిటర్ను వివరాలు తీసుకోవచ్చని విశ్లేషస్తున్నారు.
సీబీఐ, ఈడీ, డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, డైరక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఐఏ వంటి ఏజెన్సీలకు మాత్రమే వ్యక్తులు-సంస్థల ఐటీ రిటర్ను వివరాలు అధికారికంగా తీసుకునే అధికారం ఉంటుంది. అది కూడా దర్యాప్తునకు సంబంధించి, సాక్షాధారాల కోసమే తీసుకుంటారు. ఈ వివరాలన్నీ ఈ దర్యాప్తు సంస్థలు అధికారికంగానే తీసుకుని, కోర్టులో వాటిని ఆధారాలుగా సమర్పిస్తాయి. ఇది సహజంగా ఎక్కడైనా జరిగే విచారణ ప్రక్రియనే.
కానీ భువనేశ్వరి ఐటీ రిటర్న్సు కేసులో.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన సీఐడీ, ఆ పద్దతులేవీ పాటించిన దాఖలాలు లేవని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వైసీపీ ఎంపీలకు బంధువులైన కొందరు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, దొడ్డిదారిన చేరవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘వైసీపీ ఎంపీల బంధువుల్లో చాలామంది ఐఆర్‌ఎస్ అధికారులున్నారు. వారిలో పలువురు దర్యాప్తు సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కొందరు అధికారులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన మరికొందరు అధికారులు కూడా, తమ మాతృశాఖల ద్వారా ఈ వివరాలను తెప్పించుకునే అవకాశాలున్నాయి. పైగా చాలాకాలం నుంచి ఒక డిఫెన్స్ అధికారి కూడా కేంద్రంలో జగన్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. వీరిలో ఎవరైనా కావచ్చు. ఏదేమైనా మేం వీటి వ్యవహారం తేల్చేవరకూ వదిలిపెట్టం’’ అని మాజీ మంత్రి ఒకరు హెచ్చరించారు.
కాగా తన తల్లి ఐటీ రిటర్ను వివరాలు సీఐడీకి లభించడాన్ని యువనేత లోకేష్ సీరియస్‌గా తీసుకోవడంతో సీఐడీ చిక్కుల్లో పడక తప్పని పరిస్థితి. ఆయన దీనిపై సీబీడీటికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమయింది. దానిపై దర్యాప్తు మొదలయితే.. సీఐడీకి ఆ వివరాలు ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారని బయటపడటం ఖాయం.
నిజంగా అదే జరిగితే సీఐడీలో ఏ అధికారిని బాధ్యులను చేస్తారన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. సీఐడీ చీఫ్‌ను బాధ్యులను చేస్తారా? లేక దర్తాప్తు అధికారిని బాధ్యులుగా చేస్తారా అన్న చర్చకు తెరలేచింది. ఏదేమైనా దేశంలో తొలిసారి ఇలాంటి ఘటనకు, ఏపీ సీఐడీ కేంద్రబిందువు కావడం చర్చనీయాంశమయింది.