Suryaa.co.in

Andhra Pradesh

అహంకారంతో విర్రవీగిన వారికి శిక్ష తప్పదు

సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

సింహాచలం:-రాష్ట్రంలో ధర్మం లేకుండా పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ధర్మ పరిరక్షణకు తాను పోరాటం చేస్తానని…దేవుడి అనుగ్రహం కోరుతున్నానని అన్నారు. భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నాయుడు సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఏడుకొండల వాడు, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం అనంతరం తాను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు.

ధర్మ పరిరక్షణ జరగాలని తాను దేవుడ్ని ప్రార్థించానని చెప్పారు. హిరణ్యకశపుడు అహం కారంతో విర్రవీగితే…మహా విష్ణువు నరసింహ స్వామి రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని శిక్షించారని అన్నారు. నేడు రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితే ఉందని…రాష్ట్రాన్ని దుష్టుల నుంచి కాపాడమని ప్రార్థించాను అన్నారు. విశాఖ వచ్చినప్పుడు..ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఇచ్చిన అపూర్వ స్వాగతం మర్చిపోలేనన్నారు. కష్ట సమయంలో అనేక దేశాలలో ఉన్న తెలుగు ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని….వారి రుణం తీర్చుకోలేనని అన్నారు.

ఏ రాజకీయ నాయకుడికీ దక్కని ఆదరణ, మద్దతు తనకు ప్రజల్లో దక్కిందని అన్నారు. తన కోసం ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేశారని…..సంఘీభావం తెలిపారని అన్నారు. తనకు బాధ్యత మరింత పెరిగిందని…ప్రజలకు సేవచేసే శక్తిని ఇవ్వమని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చిన ఆశోక్ గజపతి రాజు కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని పూర్తిగా నాశనం చేశారని అన్నారు. ఒక ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేస్తున్న వారిపైనా దౌర్జన్యం చేశారన్నారు. ధర్మం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దుష్టశక్తిపై పోరాటం చేసే శక్తిని ఇవ్వమని తాను దేవుడుని ప్రార్థించినట్లు చెప్పారు.అందరూ చేతులు కలిపి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు.

తెలుగు దేశం ప్రభుత్వ సమయంలో సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదని అన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే పంచ గ్రామాల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE