Suryaa.co.in

Andhra Pradesh

తల్లి కాంగ్రెస్ తరహాలోనే పిల్ల కాంగ్రెస్

-మత్తు నిషాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ

ఒకప్రక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలందరి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను పట్టణ, గ్రామ ప్రజలు నేరుగా తెలుసుకుంటూ ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. అదే సందర్భంలో గత టీడీపీ, నేటి వైసీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ పార్టీ స్టిక్కర్లను వేసుకుని ప్రజల్ని మోసం చేసిన/ చేస్తున్న తీరును చూసి ఆ పార్టీలను అసహ్యించుకుంటున్నారు. ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఈ రెండు పార్టీల ముసుగు తొలగిపోయింది.

నవ్యాంధ్ర ను సృష్టిస్తా, అద్భుతాలను చేస్తా అని ప్రజలకు మాయమాటలు గత టీడీపీ చెప్తే, నేటి వైసీపీ నవరత్నాల పేరుతో ఒక చేత్తో ఒక రూపాయి ఇస్తూ మరొక చేస్త్తూ పెట్రోల్, డీజిల్, ఆస్తి, చెత్త, ఇంటి, మరుగుదొడ్లపై భారీగా టాక్సులు వేసి, అక్రమ మద్యం, మైనింగ్ ఇప్పుడు రాష్ట్రంలో చలి కాలంలో కూడా వాడుకున్న బిల్లుకు ట్రూ అప్, సర్ చార్జీలంటూ రెట్టింపు బిల్లుల మోత మోగిస్తోంది. ప్రజలపై చార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. గ్రామాల్లో నిరవధిక కరెంట్ కోత, పట్టణాల్లో బిల్లుల మోత మొత్తంగా వైసీపీ ఫ్యాన్ తిరిగితే పేదోడి ఫ్యాన్ బంద్. వెంటనే పెంచిన రకరకాల విద్యుత్ సర్ చార్జీలను తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

తల్లి కాంగ్రెస్ తరహాలోనే పిల్ల కాంగ్రెస్ వ్యవహారం ఉంది. ఒకప్పుడు డ్రగ్స్, గంజాయి, నిషా లాంటి వాటికీ పంజాబ్ పెట్టింది పేరు కానీ నేడు ఆంధ్ర పంజాబ్ ని బీట్ చేయాలనీ ఉవ్విళూరుతున్నట్టు ఉంది. అందరికీ అన్నం పెట్టె అన్నపూర్ణ లాంటి ఆంధ్రా నేడు అందరికీ మత్తునిచ్చే గంజాయి, డ్రగ్స్ మద్యానికి కేరాఫ్ అడ్రెస్స్ గా మారింది. గంజాయి సాగులో గతంలో సాదారణంగా ఎక్సయిజ్ శాఖ కూంబింగ్ నిర్వహించేది కానీ ఈ ప్రభుత్వం వచ్చాకా ఒక్కసారైనా కూంబింగ్ చేసారా? మత్తు ముందుకు యువతను, పిల్లలను బానిసలను చేస్తున్నారు. మత్తు నిషాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగాయి. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.

వరి పంటను ప్రోత్సహించని జగన్ ప్రభుత్వం గంజాయి సాగును మాత్రం ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర, తుఫానుల్లో పంటపోయి నష్టపోయిన రైతును ఆదుకోలేని ఈ ప్రభుత్వం గంజాయి ఉత్పత్తిదారులకు ఊతమిస్తున్నట్టు కనపడుతోంది. వెంటనే కూంబింగ్ నిర్వహించి గంజాయి డ్రగ్స్ ఉత్పత్తులను అడ్డుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE