Suryaa.co.in

Andhra Pradesh

అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ

– రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని అప్పారావు కుటుంబానికి తెలిపారు.

అప్పారావు భార్య పైడాలమ్మ, కుమారులు సత్యనారాయణ, రామారావు, నాయుడు, కుటుంబ సభ్యులు సీహెచ్ సింహాచలం భువనమ్మతో మాట్లాడుతూ…తమ తండ్రి 1983 నుండి టీడీపీ కార్యకర్తగానే కొనసాగి కన్నుమూశారని తెలిపారు. తాము కూడా ఊహ తెలిసిన నాటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నామని వివరించారు. వైసీపీ మూకలు తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని, ఆటుపోటులను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కృషి చేయాలని భువనమ్మ కోరారు. వృద్దాప్యంలో భర్తను కోల్పోయిన పైడాలమ్మకు రూ.3లక్షల చెక్కును అందించి మీకు మేమున్నాం..ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE